'పొగ’చూరుతున్న ఆరోగ్యం

Cigarette Lovers Lights in No Smoking Areas Hyderabad - Sakshi

బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా ధూమపానం

బస్టాండ్, థియేటర్స్, కార్యాలయాలు అంతటా పొగరాయుళ్లే..  

పక్కనున్నవారి ఇబ్బందిని పట్టించుకోని వైనం

కనీస జరిమానాలు విధించని అధికారులు

అమలుకు నోచని ధూమపాన నిషేధ చట్టం

సాక్షి సిటీబ్యూరో: నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో నడుస్తున్న పొగగొట్టాలు పెరిగిపోతున్నాయి. గుప్పుగుప్పు మంటూ ఒకరు.. రింగురింగులు వదులుతూ ఇంకొకరు ఎక్కడపడితే అక్కడ.. తమ ఇష్టం వచ్చినట్లు ఊదేస్తున్నారు. పక్కనున్నవారు ఎంత ఇబ్బందిపడ్డా.. వద్దని వారించినా పట్టించుకోకుండా పొగరాయుళ్లు తమ ప్రతాపం చూపుతున్నారు. 

ఎక్కడ చూసినా వారే..  
బహిరంగ ప్రదేశాలు, బస్టాప్‌లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ సంస్థలు హోటళ్లు, సిని యా థియేటర్లతో పాటు టిఫిన్‌ సెంటర్లు, జ్యాస్‌షాప్‌లు, టీ స్టాల్స్‌ వద్ద ఎప్పుడు పడితే అప్పుడు పొగరాయుళ్లు నిర్భయంగా ధూమపానం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వ ప్రకటనలు, అటు వైద్యుల హెచ్చరికలను వీరు పట్టించుకోవడంలేదు. వీరి అలవాటుతో తమ ఆరోగ్యంతో పాటు పక్కనున్న వారి ఆరోగ్యానికి చేటు చేస్తోంది. ధూమపానంతో ఇతరులకు తీవ్ర నష్టం  జరుగుతోందని 2008లో కేంద్ర ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ధూమాపానం చేయడాన్ని నిషేధిస్తూ చట్టం చేసి కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ చట్టం ఎక్కడా అమలు చేయకపోవడం విచారకరం. 

జరిమానాల జాడేలేదు..
బహిరంగంగా ధూమపానం చేసేవారిపై జరిమానాలు విధించడంతో పాటు పదేపదే పట్టుబడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే అందుకు అవసరమైన కార్యచరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నియంత్రణ లేకపోవడంతో పొగరాయుళ్లు రెచ్చిపోతున్నారు. మరోపక్క యువత కూడా ఇటువైపు ఆకర్షితులై పెడదోవ పడుతున్నారు. చట్టం అమల్లోకి వచ్చి పదేళ్లవుతు న్నా నగరంలో ఒక్క జరిమానా విధించకపోవడం గమనార్హం. ఇక ఆటోవాలాలు, బైకులపై తిరిగేవారు ఇష్టానుసారంగా పొగతాగుతున్నారు. ఆటో లో పాసింజర్లు ఉన్నా వారి విజ్ఞప్తిని పట్టించుకోకుండా పొగతాగే డ్రైవర్లు నగరంలో కోకొల్లలు. ప్రధాన రహదారుల్లో ద్విచక్ర వాహనాలను, కార్ల ను నడుపుతూ ఓ చేత్తో హాండిల్, మరో చేతిలో సిగరెట్‌ కాలుస్తూ ప్రయాణాలు చేస్తున్నారు. 

హోటల్స్, పార్కుల్లో కూడా..  
నగరంలోని దాదాపు అన్ని హోటళ్ల వద్దా సిగరెట్‌ షాప్‌లు ఉన్నాయి. అక్కడే చాయ్‌ తాగి దమ్ము లాగుతున్నారు. పక్కనున్న వారికి ఇబ్బంది కలుగుతుందని వారిస్తే గొడవకు దిగుతున్నారు. ఇక పార్కుల్లో సైతం ధూమపానం చేస్తున్నారు. సందర్శకులకు ఇబ్బందికరంగా ఉందని చెప్పినా వెనక్కి తగ్గడం లేదు. బయట ‘పొగ తాగరాదు’ అన్న బోర్డులు దర్శనమిస్తున్నా వాటిని పొగరాయుళ్లు ఎవరూ లెక్కచేయడం లేదు. 

కఠిన చర్యలు తీసుకోవాలి...
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రధానంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, పార్కులు, డ్రైవింగ్‌ చేస్తూ, కార్యాలయా పరిసరాల్లో సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసేవారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే వారి ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top