ఆ అధికారులను విచారించాలి

CID inquiry into Bodhan Commercial Taxes case - Sakshi

వాణిజ్య పన్నుల శాఖ ఆఫీస్‌కు సీఐడీ ఎస్పీ బృందం

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వివరాలు ఇవ్వాలన్న  అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు చిల్లుపెట్టిన బోధన్‌ వాణిజ్య పన్నుల శాఖ కేసుకు సంబంధించి సీఐడీ విచారణలో వేగం పెంచింది. ఈ కేసు దర్యాప్తులో రెండో ఎపిసోడ్‌ ప్రారంభించిన సీఐడీ అధికారులు.. శుక్రవారం నాంపల్లిలోని వాణిజ్య పన్నుల శాఖ కేంద్ర కార్యాలయానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు గుర్తించిన నకిలీ చలాన్లు, అందుకు కారణమైన అధికారుల్లో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్‌ చేసి రిమాండ్‌ చేసింది. అయితే అరెస్టయిన అధికారులతో పాటు ఉన్నతాధికారుల్లో కొంతమందికి స్కామ్‌తో లింకున్నట్టు సీఐడీ ఆధారాలు సేకరించింది. నకిలీ చలాన్ల ద్వారా లబ్ధి పొందిన డిస్ట్రిబ్యూటర్లు, రైస్‌మిల్లర్లు, ఇతరత్రా వ్యాపారులు అసలు కట్టాల్సిన చలానా ఎంత? కట్టకుండా ఎగ్గొట్టి అధికారుల జేబుల్లోకి నింపిన ఖజానా ఎంత అన్న అంశాలను తెలుసుకునేందుకు శుక్రవారం దర్యాప్తు అధికారి అయిన సీఐడీ ఎస్పీ, తన బృందంతో వాణిజ్య పన్నుల శాఖలో విచారించారు.  

మరో 16 మందిపై అనుమానం
బోధన్‌ స్కామ్‌లో పలువురు అధికారులను అరెస్ట్‌ చేసిన సీఐడీ.. వారి విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో మరో 16 మంది అధికారులపై అనుమానం వ్యక్తం చేస్తోంది. లబ్ధి పొందిన వ్యాపార సంస్థల నుంచి పై స్థాయిలో ఉన్న అధికారుల జేబుల్లోకి ప్రభుత్వ ఖజానా సొమ్ము వెళ్లినట్టు గుర్తించింది. దీంతో వారిని సైతం విచారించేందుకే వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయానికి వెళ్లినట్టు సీఐడీ ఉన్నతాధికారులు తెలిపారు. ఆ 16 మందికి సంబంధించిన వివరాలు సేకరించడంతో పాటు పలు కీలకమైన ఆడిటింగ్‌ డాక్యుమెంట్లను సీఐడీ అధికారులు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులను అడిగినట్టు తెలిసింది. ఆ 16  మంది అధికారులు తమ దర్యాప్తుకు సహకరించేలా చూడాలని, ఈ మేరకు తాము నోటీసులిస్తామని సీఐడీ అధికారులు సూచించినట్టు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top