
‘నయీం నెత్తుటి కూడులో వారికి వాటా’
ఎంతో మంది అమాయకులను అదిరించి, బెదిరించి సంపాదించిన గ్యాంగ్‌స్టర్ నయీం నెత్తుటి కూడులో టీఆర్‌ఎస్ నాయకులకు వాటాలు ఉన్నాయని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు.
సూర్యాపేట: ‘ఎంతో మంది అమాయకులను అదిరించి, బెదిరించి సంపాదించిన గ్యాంగ్‌స్టర్ నయీం నెత్తుటి కూడులో టీఆర్‌ఎస్ నాయకులకు వాటాలు ఉన్నాయి. నయీం బతికున్నప్పుడు అక్రమంగా సంపాదించాడు. ఇప్పుడు అతడు చనిపోయిన తర్వాత కూడా ఆస్తులను పంచకుండా జాప్యం చేస్తున్నారు’ అని తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర కన్వీనర్ చెరుకు సుధాకర్ అన్నారు. బుధవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధాకర్ మాట్లాడారు. నయీమ్ సంపాదించిన అక్రమాస్తులను బాధితులను పంచాలని, అందుకు ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడంలేదని ప్రశ్నించారు.
తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబం అంటే అందరికీ గౌరవమే అని, అయితే ఉద్యమ కారులను ఉరికించి కొట్టిన తూర్పు జయప్రకాశ్ ఇలాఖాలో కాంగ్రెస్ పార్టీ వారు జూన్ 1న సమావేశం ఏర్పాటు చేయాలనుకోవడం శోచనీయమన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నల్లగొండ జిల్లాలో దళితుల ఇళ్లలో భోజనం చేసి అతిగా ప్రచారం చేసుకోవడం దళితుల మనోభావాలను కించపరచడమే అన్నారు.
మొదటి నుంచి తెలంగాణ జెండా పట్టి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు నేడు కనుమరుగు అయ్యారని, వారికి సరైన గౌరవం కల్పించేందుకే ఇంటి పార్టీ స్థాపించామని చెప్పారు. రాష్ట్ర సాధన లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటు చేసే ఇంటి పార్టీ ఆవిర్భావ సభ జూన్ 2న హైదరాబాద్‌లో జరగనుందని ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థులు సబ్బండ వర్ణాలు తరలి రావాలని పిలుపునిచ్చారు.