మీ అభి‘మత’మేంటి?

Central Government Seeks Opinion From States On Religious Activities - Sakshi

మతపరమైన కార్యకలాపాలపై రాష్ట్రాల నుంచి అభిప్రాయ సేకరణ

కొన్ని దేశాల్లో సామూహిక ప్రార్థనల వల్లే కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి

సామూహిక, బహిరంగ ధార్మిక కార్యక్రమాలపై 3 నెలలు ఆంక్షలు?

ఆచితూచి వ్యవహరిస్తున్న కేంద్రం.. త్వరలో మార్గదర్శకాలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: ఒకపక్క కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌కు కేంద్రం భారీ సడలింపులు ఇస్తుండటంతో క్రమంగా జన జీవితం మళ్లీ సాధారణస్థితికి చేరుకుంటోంది. దుకాణాలు తెరుచుకుంటున్నాయి, ప్రజా రవాణా ప్రారంభమైంది. మరి ప్రార్థన మందిరాలు ఎప్పుడు తెరుచుకుంటాయి?
ఇప్పుడు చాలామంది ఎదురుచూస్తున్న అంశమిది. వీటి విషయంలో కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకసారి ప్రార్థన మందిరాలు తెరుచుకుంటే వాటిని నియంత్రించటం అంత సులువు కాదని కేంద్రం అభిప్రాయపడుతోంది. (జంతువుల నుంచే 75 శాతం ఇన్‌ఫెక్షన్లు)

ఈ క్రమంలోనే సామూహిక, బహిరంగ ధార్మిక కార్యక్రమాలపై మూడు నెలల పాటు ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కార్యకలాపాలు మొదలైతే జనసమూహాలు ఏర్పడతాయని భావిస్తోన్న కేంద్రం.. వాటిని ప్రారంభించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లాంటి కొన్ని దేశాల్లో ధార్మిక కార్యక్రమాలతో కరోనా కేసులు తీవ్రంగా పెరిగినట్టు స్వయంగా ఆయా దేశాల్లో అధికారికంగా సమాచారం వెల్లడైంది. ఇప్పటివరకు ఆ విషయంలో మన దేశం సురక్షితంగా ఉంది. 

అన్ని మతాల ప్రార్థన మందిరాలు మూసే ఉంచటంతోపాటు వేడుకల్ని ప్రభుత్వం నిషేధించింది. పూర్తిగా అంతర్గత కార్యక్రమంగా రోజువారీ ప్రార్థనలు, ఉత్సవాలకు అనుమతించింది. దేవాలయాల్లో అర్చకులు, మసీదుల్లో మౌజమ్‌లు, చర్చ్‌లలో ఫాదర్‌లు మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలి తప్ప భక్తులకు ప్రవేశం కల్పించరాదని ఆదేశించింది. దాన్ని కచ్చితంగా అమలు చేస్తుండటంతో ధార్మిక కార్యక్రమాలపరంగా ఇంతకాలం ఎలాంటి చింత లేదు. 

ఇప్పుడు లాక్‌డౌన్‌ సడలింపుల జాబితాలో ప్రార్థన మందిరాలను చేరిస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని కొన్ని సంస్థలు కేంద్రం దృష్టికి తెచ్చాయి. దీంతో కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాన్ని తీసుకుంటున్నట్టు సమాచారం. అక్కడి నుంచివచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా, ఈనెల 31తో లాక్‌డౌన్‌ ముగియనున్న నేపథ్యంలో.. తదుపరి నిర్ణయం తీసుకోనుంది. 

బహిరంగ ఉత్సవాలు, సామూహిక ప్రార్థనలకు అనుమతి వద్దు
గతంలో ఎన్నడూ లేనట్టు దాదాపు రెండు నెలలుగా ప్రార్థన మందిరాలు మూసే ఉన్నాయి. వాటినింకా మూసి ఉంచటం సరికాదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. దీంతో వాటిని ప్రత్యేక షరతులకు లోబడి తెరిచేందుకు అనుమతించాలనే విషయమై చర్చ జరుగుతోంది. రోజూ వేల మంది భక్తులు వచ్చే ప్రధాన ఆలయాల్లోకి పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతిస్తూ కరోనా నిబంధనలు పాటించాలనే షరతు విధించనున్నట్టు సమాచారం. 

చిన్న ప్రార్థన మందిరాల్లో ఒకసారి పదిమందికి మించకుండా భక్తులను అనుమతించేలా నిబంధనలు రూపొందిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. అన్ని మతాలకు చెందిన ప్రార్థనాలయాలకు ఇదే తరహా నిబంధనలు అమలు చేయాలనేది ఒక ఆలోచనగా ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు సామూహిక ప్రార్థనలు, బహింరంగ వేడుకలు, ఉత్సవాలు, ప్రదర్శనలు, యాత్రలు నిర్వహించకుండా ఆంక్షలు కొనసాగించనున్నారు. దేవాలయాల్లోనే కాక బహిరంగ ప్రాంతాల్లో ధార్మిక వేడుకలు నిర్వహించరాదని కూడా ఆంక్షల్లో చేరుస్తారన్న చర్చ నడుస్తోంది. 

ఇక వేడుకల పేరుతో అన్నదాన వితరణ, ప్రసాదాల పంపిణీపై కూడా ఆంక్షలుండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల దక్షిణ బంగ్లాదేశ్‌లోని ఓ పట్టణంలో స్థానిక సంస్థ ఒకటి ప్రభుత్వం వద్దంటున్నా వినకుండా బహిరంగ ప్రదేశంలో 10వేల మందితో సామూహిక ప్రార్థనలు నిర్వహించింది. పాకిస్తాన్‌లో వైద్యుల సంఘం అభ్యంతరం చెప్పినా.. సామూహిక ప్రార్థనలకు అనుమతించారు. ఈ రెండుచోట్లా ఒక్కసారిగా కరోనా కేసులు బాగా పెరిగాయి. ఈ అంశాలన్నింటినీ కేంద్రం పరిశీలిస్తోంది. రాష్ట్రాల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకోనుంది. వాటిని తెరిచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక సూచనలు చేయనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top