శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు పనిచేస్తున్న పోలీసు శాఖలో ‘కుల’కలం రేగుతోంది. ఇతర ప్రభుత్వ శాఖల్లోని కుల సంఘాల మాదిరిగానే పోలీసు శాఖలో కుల చిచ్చు మొదలైంది.
వరంగల్ క్రైం : శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు పనిచేస్తున్న పోలీసు శాఖలో ‘కుల’కలం రేగుతోంది. ఇతర ప్రభుత్వ శాఖల్లోని కుల సంఘాల మాదిరిగానే పోలీసు శాఖలో కుల చిచ్చు మొదలైంది. ఇటీవలి కాలంలో పోలీసు శాఖలో ఒక కులానికి సంబంధించి సంఘం ఏర్పడడం.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు పోలీసు శాఖను నివ్వెరపరుస్తున్నాయి.
ఒక వ్యక్తితో మొదలైన సదరు సంఘ కార్యకలాపాలు మెల్లగా విస్తరిస్తున్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పరిణామం పోలీసు శాఖకు ఇబ్బందికరంగా మారింది. కుల సంఘం పేరుతో జరుగుతున్న కార్యకలాపాలపై కొందరు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డీజీపీ ఇటీవల జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.
తరచూ సమావేశాలు
తమను పోలీసు శాఖలో అణగదొక్కుతున్నారంటూ కొద్ది నెలల క్రితం ఒక సంఘం పేరుతో కార్యకలాపాలు
మొదలయ్యాయి. సభ్యత్వ నమోదు, రెగ్యులర్‌గా మీటింగులు జరుగుతున్నారుు. జిల్లాలో ఎక్కడ సమావేశం జరిగినా అందరూ రావల్సిందేనంటూ సదరు సంఘం నాయకులు హుకూం జారీ చేస్తున్నారు. సమావేశానికి అనుమతి లేదంటూ వారి పైస్థాయి అధికారులు చెబితే తమను అవమానిస్తున్నారని భయబ్రాంతులకు గురిచేస్తున్నట్లు పలువురు అధికారులు వాపోతున్నారు.
ఇటీవల హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన క్రైం మీటింగ్‌లో తమను అణగదొక్కుతున్నారంటూ ఉన్నతాధికారితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. క్రమశిక్షణ కలిగిన పోలీసు శాఖలో ఉన్నతాధికారులను ప్రశ్నించండం అంటే మామూలు విషయం ఏమీ కాదని ఖాకీల్లో చర్చ జరుగుతోంది.
శాఖలో మరిన్ని సంఘాలు..
కులం పేరుతో సంఘాలు ఏర్పాటు చేయడంపై పోలీసు సిబ్బంది, అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హెడ్‌క్వార్టర్స్‌లో ఓ కార్యాలయూన్ని వారి ఆఫీస్‌గా మార్చుకోవడం.. అక్కడే సభ్యత్వ నమోదుతో సంఘానికి సంబందించిన అన్ని కార్యకలాపాలు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సంఘం పేరుతో డామినేట్ చేయడంపై మండిపడుతున్న కొందరు పోటీగా సంఘాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే హెడ్‌క్వార్టర్స్‌లో కుల సంఘాలకు చెందిన అనేక బ్యానర్లు త్వరలో వెలిసే అవకాశం ఉంది. పరిస్థితి అంతవరకు వస్తే జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది.