చెరువులకు నీరు చేరేలా..!

Canals Water Shortage In Nalgonda - Sakshi

గుర్రంపోడు : ఏఎమ్మార్పీ పరిధిలో ఉండి.. ఇప్పటి వరకు నీరందని చెరువులను నింపేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. కాల్వకు నీటిని విడుదల చేసిన సమయంలో వంద కిలోమీటర్ల ప్రధానకాల్వ పొడవునా గల 129 చెరువుల్లో వంద చెరువులకు ఏదో విధంగా ఎంతోకొంత నీరు చేరుతోంది. కాగా అసలే నీరు చేరని 29 చెరువులను గుర్తించి వాటికి మేజర్, మైనర్‌  కాల్వలపై తూములు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు. ఏఎమ్మార్పీ డివిజన్‌ పరిధిలో 29 చెరువులు నింపేలా తూములకు 13 పనులకుగాను రూ.74 లక్షల వ్యయంతో టెండర్లు పిలిచారు. 45 రోజుల్లో పనులు పూర్తి చేసి ఖరీఫ్‌ నాటికి తూములు సిద్ధం చేయనున్నారు. తూముల నిర్మాణాలతో రైతుల ఇబ్బందులు తొలిగిపోనున్నాయి.

గతంలో ఇలా..
ఏఎమ్మార్పీ ద్వారా పంటలకు నీరందక.. ఇటు చెరువులూ నిండక వదిలిన నీరెటుపోతుందో అర్థంగాక రైతులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడేవారు. దీన్ని అధిగమించేందుకు అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. ఏఎమ్మార్పీ కాల్వలను ఆరుతడికి పంటలకు మాత్రమే డిజైన్‌ చేసి తవ్వారు. ఏఎమ్మార్పీకి నీటి కేటాయింపులు సరిపడా లేనందున పూర్తి ఆయకట్టుకు కాల్వల ద్వారా నీరందించడం కష్టసాధ్యమవుతుంది. కనీసం చెరువులైనా నింపాలని ప్రజాప్రతినిధులు, రైతుల డిమాండ్‌ మేరకు అధికారులు నెల రోజులుగా ఆయకట్టు చెరువులన్నింటినీ పరిశీలించారు. ఏఎమ్మార్పీ కాల్వల నుంచి నీరు చేరని చెరువులను గుర్తించి ప్రత్యేకంగా తూముల నిర్మాణాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

కొత్తగా తూములు నిర్మించనున్న ప్రాంతాలు ఇవే.. 
ఏఎమ్మార్పీ పరిధిలోని డి–23 కాల్వపైన చెరువులకు నీటి విడుదలకుగాను కొత్తగా తూములు నిర్మించి చామలోనిబావి, పెద్దబావి కుంట, తాటి చెరువు, డి–25 మేజర్‌పై ఆప్‌టేక్‌ గేట్‌ నిర్మించి కొప్పోలులోని చింతలచెరువు, కొత్తకుంట, నడికూడ చెరువులను నింపనున్నారు. డి–22 కాల్వలో కొత్తగా నిర్మించే తూము వల్ల పిట్టలగూడెం వద్ద గల బలుచకుంట, చవుటకుంట నింపడానికి వీలుంటుంది. ఇదే మేజర్‌పై మరో రెండు చోట్ల తూములు నిర్మించి ఆమలూరు, బొల్లారం, గుర్రంపోడు గ్రామాల కుంటలను నింపనున్నారు. డి–37లో 23వ కిలోమీటరు వద్ద తూము నిర్మాణంతో మావిండ్ల వారికుంట, మోదుగులకుంట, వేములచెరువు, ఇదే కాల్వపై 8వ కిలోమీటరు వద్ద తూముతో మంచినీళ్ల బావి, పెద్ద చెరువు, 11వ కిలోమీటరు వద్ద తూముతో తిమ్మరాజుకుంట, కొండయ్యకుంట, అన్నయ్యకుంట, ఊరకుంటలకు నీరు చేరనుంది. 3వ కిలోమీటరు వద్ద తూముతో ముత్యాలమ్మ కుంట, యాదయ్య చెరువులకు నీరు చేరునుంది. ఒక చెరువు కింద గల మిగతా చెరువులు కూడా ఈ తూముల వల్ల నిండి ప్రయెజనం చేకూరుతుంది.

 భూసేకరణ సమస్య లేని చోటే తూములు 
మొదటి దశలో ఎలాంటి సమస్య లేకుండా చెరువులకు నీరు చేరే వీలున్న ప్రాంతాలను గుర్తించి కాల్వలపై తూము ఏర్పాట్లకు టెండర్లు పిలిచాం. 45రోజుల్లో పనులు పూర్తి చేయించి ఈ సారి నీటిని విడుదల చేయగానే చెరువులకు నీరు చేరేలా సిద్ధం చేస్తాం. ఏఎమ్మార్పీ ఆయకట్టులో నీరు చేరని చెరువులను పరిశీలించి ఎలాంటి వివాదాలు, భూసేకరణ సమస్య లేకుండా తాము ఇక్కడి నుంచి నీటిని చెరువులకు, కుంటలకు మళ్లించుకుంటామని రైతులు కోరిన చోట్ల తూములు ఏర్పాటు చేస్తున్నాం. మిగతా విడతల్లో మరికొన్నింటిని పరిశీలిస్తాం.   – అజయ్‌కుమార్, డివిజన్‌ ఈఈ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top