సీతాకోక చిలుకా.. ఎక్కడ నీ జాడ?

Butterflys Shortage in Butterfly Park Hyderabad - Sakshi

మహవీర్‌ హరిణ వనస్థలిలో నిర్లక్ష్యం

బటర్‌ఫ్లై పార్కు ఉన్నా నిర్వహణ సున్నా

పూల మొక్కలు లేక కనిపించని సీతాకోకచిలుకలు  

ఆశగా వచ్చి వెనుదిరుగుతున్న పర్యాటకులు

సాక్షి సిటీబ్యూరో: హరివిల్లులోని రంగులన్నీ తన రెక్కల్లో నింపుకుని నిశబ్దంగా ఎగురుతుంటాయి. ప్రకృతిలోని అందాలన్నీ తనలోనే ఇముడ్చుకుని పూలమొక్కల్లో కలియదిరుగుతుంటాయి. అవే రిగే సీతాకోకచిలుకలు.. పిల్లలకు అవంటే ఎంత ఇష్టమో.. పెద్దలకూ అంతే ఇష్టం. పూలలో పువ్వుల్లా కలిసిపోయే ఆ అందమైన చిరుజీవుల కోసం మహవీర్‌ హరిణ వనస్థలి జాతీయ పార్కులో ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై పార్కు వెలవెలబోతోంది. వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే ఇవి జీవవైవిధ్యంలో కూడ ఎంతో కీలకమైనవి. వాతావరణంలో ఏర్పాడుతున్న మార్పుల వల్ల ఆ జాతి తగ్గిపోతుండగా.. మరోవైపు అటవీశాఖ ఆధ్వర్యంలో పలు చోట్ల సీతాకోకచిలుకల కోసం ప్రత్యేకంగా వనాలు, పార్కులను ఏర్పాటు చేసి వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో అందమైన సీతాకోకచిలుకలు కనిపించడం లేదు. నగర శివారులోని మహవీర్‌ హరిణ వనస్థలి నేషనల్‌ పార్కులో సీతాకోకచిలుకల వనాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ రంగు రంగు రెక్కల సీతాకోక చిలుకలను చుద్దామని వస్తున్న పర్యాటకులకు నిరాశే ఎదురువుతోంది. అటవీశాఖ అధికారుల సరైన నిర్వాహణ చర్యలు చేపట్టకపోవడంతో ఈ సీతాకోకచిలుకల వనంలో ఆ జాతి కనిపించడం లేదు. బటర్‌ఫ్లై కన్సర్వేషన్‌ సొసైటీ హైదరాబాద్‌ లెక్కల ప్రకారం తెలంగాణలో 170 రకాలు, బయోడైవర్సిటీ బోర్డు లెక్కల ప్రకారం 153 రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడోచోట ఒకటీ రెండూ తప్ప కనువిందు చేసే సంఖ్యలు లేవు. 

మొదట్లో బాగానే ఉన్నా..
నగర శివార్లలోని విజయవాడ జాతీయ రహదారిపై 1404 హెక్టార్లలో మహవీర్‌ హరిణ వనస్థలి నేషనల్‌ పార్కు విస్తరించి ఉంది. ఇందులో కృష్ణ జింకలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు, పలు రకాల పాములు, పక్షులు ఉన్నాయి. ప్రతిరోజు ఈ పార్కుకు వందల సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. అదేవిధంగా నగరంలోని పలు పాటశాలల విద్యార్థులను స్టడీ టూర్‌లో భాగంగా తీసుకువస్తుంటారు. పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మూడేళ్ల క్రితం పార్కులోని కొంత స్థలాన్ని ప్రత్యేక సీతాకోకచిలుకల వనంగా తీర్చిదిద్దారు. నిత్యం పూలతో కళకళలాడే విధంగా.. చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకున్నారు. దాంతో పాటు నిర్వాహణ బాగుండడంతో వందల సంఖ్యలో సీతాకోకచిలుకలు అభివృద్ధి చెంది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేవి. రానురాను అధికారులు ఈ బటర్‌ఫ్లై పార్కును పట్టించుకోకపోవడంతో పూల మొక్కల స్థానంలో పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దాంతో సీతాకోకచిలుకలు సైతం కనిపించకుండా పోయాయి.

మొక్కలు పెంచుతాం
సీతాకోకచిలుకలు తగ్గిన విషయం ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. వెంటనే దీనిపై చర్యలు తీసుకుని బటర్‌ఫ్లై పార్కును అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా సీతాకోకచిలుకలకు ప్రధానమైన పూల మొక్కలను పెంచుతాం.  – శివయ్య, డీఎఫ్‌ఓ  

సీతాకోకచిలుక జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది. అందరూ అసహ్యించుకునే గొంగళిపురుగు ఎంతో శ్రమకోర్చి తన రూపాన్ని మార్చుకుంటుంది. ఈ క్రమంలో అది మరో జన్మే ఎత్తుతుంది. కొన్నిరోజులు గొంగళిపురుగుగానే పెరిగి.. తర్వాత తన లాలాజలంతో తనచుట్టూ చీకటి గూడుకట్టుకుని అందులోనే ఉండిపోయి రెక్కలు తొడిగి తన పాత దేహాన్ని వదిలి అందరూ ఇష్టపడే అందమైన సీతాకోకచిలుకగా మారుతుంది. ఈ రూపంలో కొన్ని గంటలు మాత్రమే ఈ ప్రాణి జీవించి అనంతరం ప్రాణాలు విడుస్తుంది. కానీ బతికి ఆ కొన్ని గంటలు అందరికీ ఆనందాన్ని పంచుతుంది. మహవీర్‌ హరిణ వనస్థలిలో ఏర్పాటు చేసిన సీతాకోకచిలుకల వనంలో పూల మొక్కలు లేక వాటి ఉనికే ప్రశ్నార్థకమైంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top