వారధికి ముప్పు

Bridge Repair In Karimnagar - Sakshi

అది రాజీవ్‌ రహదారి. దానికి అనుసంధానంగా ఉన్న బ్రిడ్జిపై నిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి.. మేజర్‌ సిటీలైన హైదరాబాద్, వరంగల్‌ వరకు ప్రయాణం చేయాలంటే కరీంనగర్‌ గుండా వచ్చే వాహనదారులు ఈ బ్రిడ్జిపై నుంచి వెళ్లాల్సిందే. 25 ఏళ్ల నాటి నిర్మాణం. కానీ.. ఏం ఉపయోగం మెయింటనెన్స్‌ లేక ప్రమాదకరంగా మారింది. నిర్వహణ లోపం.. సామర్థ్యానికి మించిన వాహనాలు తిరుగుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది. పిల్లర్ల మధ్య ఉన్న స్లాబ్‌ క్రమంగా గ్యాప్‌ ఇస్తుండడంతో వాహనదారుల నడ్డి విరుగుతోంది. ద్విచక్ర వాహనదారుల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.

అల్గునూర్‌(మానకొండూర్‌): రాజీవ్‌ రహదారిపై అనుసంధానంగా తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్, కరీంనగర్‌ మధ్యనున్న మానేరు పాత వంతెనపై ప్రమాదం తొంగిచూస్తోంది. వంతెన నిర్వహణలోపం, సామర్థ్యానికి మించిన వాహనాలు దీని మీదుగా ప్రయాణిస్తుండడంతో పిల్ల రుపై ఉన్న బేరింగ్‌లు ఇదివరకే చెడిపోయాయి. వంతెన స్లాబ్‌పై గ్యాప్‌ క్రమంగా పెరుగుతోంది. రాజీవ్‌ రహదారి నిర్మాణంలో భాగంగా కాంట్రాక్ట్‌ సంస్థనే వంతెన నిర్వహణ బాధ్యతలు చూడాలి. కానీ.. నిర్వహణలోపం, తాత్కాలిక మరమ్మతు చేపడుతోంది. నెలకోసారి చిన్నపాటి మరమ్మతు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. 18 పిల్లర్లు ఉన్న వంతెనపై ప్రతీ పిల్లర్ల మధ్య స్లాబ్‌ మధ్య గ్యాప్‌ వస్తోంది. దీంతో వాహనాలు భారీగా కుదుపునకు గురవుతున్నాయి.

25 ఏళ్ల క్రితం నిర్మాణం..
కరీంనగర్‌–హైదరాబాద్‌ రహదారి వెంట అల్గునూర్‌–కరీంనగర్‌ను అనుసంధానం చేసేలా గతంలో సింగిల్‌ రోడ్డుతో వంతెన ఉండేది. క్రమంగా వాహనాల రద్దీ పెరగడం రాతి కట్టడంతో నిర్మించిన వంతెన పాతది కావడంతో సుమారు 25 ఏళ్ల క్రితం కొత్త వంతెన (ప్రస్తుత పాతవెంతన) నిర్మించారు. వంతెనపై క్రమంగా వాహనాల రద్దీ పెరగడం.. గ్రానైట్, ఇసుక లారీలు, భారీ వాహనాల రాకపోకలు పెరగడం.. ఈ క్రమంలో వెంతన 10 ఏళ్ల క్రితం వంతెన బేరింగ్‌లు చెడిపోయాయి. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో బేరింగ్‌లు మార్చేశారు. తర్వాత రాజీవ్‌ రహదారి విస్తరణ పనులు జరగడంతో వంతెన బాధ్యతలను కూడా ఆర్‌అండ్‌బీ అధికారులు రాజీవ్‌ రహదారి నిర్మాణ సంస్థ హెచ్‌కేఆర్‌కే అప్పగించారు.

తరచూ తాత్కాలిక మరమ్మతు..
వాహనాల రద్దీ, భారీ వాహనాల రాకపోకల కారణంగా వంతెనపై స్లాబ్‌ మధ్య గ్యాప్‌ పెరుగుతోంది. రాజీవ్‌ రహదారి నిర్మాణ సంస్థ తాత్కాలికంగా తారు పోసి గ్యాప్‌లను మూసివేస్తోంది. పనులు చేసిన రెండు వారాల్లోనే పోసిన తారు చెదిరిపోవడంతోపాటు వంతెన స్లాబ్‌ మధ్య గ్యాప్‌ మరింత పెరుగుతోంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయపడుతున్నారు. వంతెన నిర్మించిన ప్రతీ 15 ఏళ్లకోసారి బేరింగ్‌లు మార్చాలి. రాజీవ్‌ రహదారి నిర్మాణ సంస్థ ఇప్పటివరకు బేరింగ్‌లు మాత్రం మార్చలేదు. దీంతో గ్యాప్‌లు కూడా పెరుగుతున్నాయని వాహనదారులు అభిప్రాయపడుతున్నా రు. వంతెనపై ఏర్పాటు చేసిన స్ట్రీట్‌లైట్లు కూడా కొన్ని వెలగడంలేదు. దీంతో రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా లైట్లకు కూడా మరమ్మతు చేయాలని వాహనదారులు, భక్తులు కోరుతున్నారు.

కుదుపులతో ప్రమాదాలు.. 
వంతెన కింద ఉన్న 18 ఫిల్లర్లపై ప్రతీస్లాబ్‌ వద్ద గ్యాప్‌ ఏర్పడింది. దీంతో వంతెనపై నుంచి వెళ్లే స్కూటర్‌ నుంచి భారీ వాహనం వరకు అన్నీ కుదుపునకు లోనవుతున్నాయి. భారీ వాహనాలు వెళ్లినపుపడు జరిగే కుదుపునకు వంతెన కూలుతుందా అనే అంతగా చిన్న వాహనదారులు భయపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు గ్యాప్‌ల మధ్య ఇటీవల పోసిన తారు పూర్తిగా చెదిరిపోయింది. దీంతో గ్యాప్‌ మరింత ఎక్కువైంది. ఇటీవల పలువురు ద్విచక్ర వాహనదారులు కుదుపుల కారణంగా అదుపుతప్పి కిందపడ్డారు. ఆరు నెలల క్రితం ఓ భారీ వాహనం సడెన్‌గా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి వచ్చిన ఓ ద్విచక్రవాహనదారుడు ముందు వాహనాన్ని ఢీకొని కిందపడ్డాడు. వెనకాల నుంచి వచ్చిన మరో వాహనం అతడి తలపై నుంచి వెళ్లడంతో దుర్మరణం చెందాడు. ఇదే కాకుండా అనేక మంది రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనదారులు అదుపుతప్పి కిందపడి గాయపడ్డారు.

వినాయక నిమజ్జనానికి ఇబ్బందే..
ప్రస్తుతం గణపతి నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. మరో ఐదు రోజుల్లో నిమజ్జనం ప్రారంభమవుతుంది. కరీంనగర్‌ మండలంతోపాటు, కార్పొరేషన్‌ పరిధిలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను మానకొండూర్‌ చెరువుతోపాటు, అల్గునూర్‌ శివారులోని కాకతీయ కాలువలో ఏటా నిమజ్జనం చేస్తారు. ఈ ఏడాది కూడా నిమజ్జనానికి మానకొండూర్‌ చెరువు వద్ద ఏర్పాట్లు మొదలయ్యాయి. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై మూడు రోజులు గడిచింది. ఈ క్రమంలో వంతెనపై ఉన్న గుంతలతో భారీ విగ్రహాలు తీసుకొచ్చే వాహనాలు కుదుపునకు గురై విగ్రహాలు కిందపడే అవకాశం ఉంది. ఇలా అయితే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు.

మరమ్మతు షురూ..
వంతెన సమస్య మా దృష్టిలో ఉంది. దీనికి సబంధించిన ఇప్పటికే ప్రపోజల్స్‌ ప్రభుత్వానికి పంపించాం. రాజీవ్‌ రహదారిపై గుంతల మరమ్మతు మొదలైంది. వంతెన మరమ్మతు చేపడతాం. తాత్కాలికి మరమ్మతు కాకుండా ఈసారి తారు పూర్తిగా తొలగించి కొత్తగా తారు వేయాలని నిర్ణయించాం. నిపుణులతో వంతెనను పరిశీలించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తాం.  – బీవీ.రాజు, హెచ్‌కేఆర్‌ మేనేజర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top