ఆయకట్టు.. గట్టెక్కేట్టు..

Board Meeting Held In Nizamabad Collectorate - Sakshi

రబీకి సాగునీటి ప్రణాళిక ఖరారు

2.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు

25 నుంచి ఎస్సారెస్పీ జలాల విడుదల

సమావేశంలో పోచారం శ్రీనివాస్‌  

సాక్షి, నిజామాబాద్‌ :  రబీ సీజన్‌లో ఉమ్మడి జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మొత్తం 2.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించాలని జిల్లా సాగునీటి పారుదల సలహాబోర్డు(డీఐఏబీ) నిర్ణయించింది. మొత్తం 20.08 టీఎంసీల నీటిని వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో బోర్డు సమావేశం జరిగింది. కలెక్టర్‌ ఎం.ఆర్‌.ఎం.రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్‌ సింధే, నల్లమడుగు సురేందర్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆకుల లలిత, జెడ్పీ చైర్‌పర్సన్లు దాదన్నగారి విఠల్‌రావు, దఫేదార్‌ శోభ, కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ, నీటి పారుదల, రెవెన్యూశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శ్రీరాంసాగర్, నిజాంసాగర్, పోచారం, రామడుగు, కౌలాస్‌నాలా ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసే తేదీలు, తడులను ప్రకటించారు. 

నేను స్పీకర్‌గా ఈ సమావేశానికి రాలేదు. బాన్సువాడ ఎమ్మెల్యేగా హాజరయ్యాను. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీటి నిల్వ అతి తక్కువగా ఉంది. దీనిని దృష్టిలోఉంచుకుని నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటున్నాం. రైతులు సహకరించాలి. నిజాంసాగర్‌ ఆయకట్టు పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు వివరించి రానున్న రోజుల్లో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటాం. 
– స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి

శ్రీరాంసాగర్‌ ద్వారా 37,449 ఎకరాలకు నీరు 
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాల్వల ద్వారా డిసెంబర్‌ 25 నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఆయకట్టుకు ఏడు తడుల్లో నీటిని అందిస్తారు. లక్ష్మి కాలువకు మూడు టీఎంసీలు, కాకతీయకు 0.7 టీఎంసీలు, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకానికి 0.8 టీఎంసీల కేటాయింపులు జరిపారు. మొత్తం 4.5 టీఎంసీల నీటిని 37,449 ఎకరాలకు విడుదల చేయాలనే నిర్ణయం జరిగింది. 

గుత్ప, అలీసాగర్‌’ల ద్వారా ఎనిమిది తడులు 
గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల ద్వారా ఈ నెల 26 నుంచి నీటిని విడుదల చేస్తారు. మొత్తం ఎనిమిది తడుల్లో నీటిని అందిస్తారు. అలీసాగర్‌కు 4.5 టీఎంసీల నీటిని 45వేల ఎకరాలకు, గుత్ప ఎత్తిపోతల ద్వారా 3.5 టీఎంసీల నీటిని 35వేల ఎకరాలకు అందించనున్నారు. 

తొలి తొమ్మిది డి్రస్టిబ్యూటరీలకే.. 
నిజాంసాగర్‌ ప్రాజెక్టులో కేవలం 3.99 టీఎంసీలే నీరున్నందున మొదటి నుంచి తొమ్మిది డి్రస్టిబ్యూటరీలకే విడుదల చేయాలని నిర్ణయించింది. ఆరు తడులు.. ఆన్‌ఆఫ్‌ విధానంలో రోజుకు 200 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువకు విడుదల చేయనున్నారు. 10 నుంచి 40వ డిస్ట్రిబ్యూటరీల పరిధిలోని ఆయకట్టుకు పంట చివరలో కేవలం రెండు తడుల్లో నీటిని ఇవ్వాలని భావిస్తున్నారు. 

రామడుగు ఆయకట్టుకు ఏడు తడులు 
రామడుగు ప్రాజెక్టులోని 0.74 టీఎంసీల నీటిని ఏడు తడుల్లో అందిస్తారు. డిసెంబర్‌ 26 నుంచి కాలువలకు నీటి విడుదల ప్రారంభమవుతుంది. పది రోజుల వ్యవధికి ఒక తడి చొప్పున విడుదల చేస్తారు. 

కౌలాస్‌నాలా ద్వారా ఆరుతడి పంటలకే.. 
కౌలాస్‌నాలా ఆయకట్టు కింద కేవలం ఆరుతడి పంటలకే సాగు నీటిని విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయించారు. డిసెంబర్‌ 16 నుంచే నీటి విడుదల ప్రారంభమవుతుంది. ఐదు తడులు ఇవ్వనున్నారు. 

బీ–జోన్‌కే సాగునీళ్లిస్తామంటున్న అధికారులు 
పోచారం ప్రాజెక్టు నీటి విడుదల విషయంలో నీటి పారుదలశాఖ అధికారుల తీరుపై సమావేశంలో చర్చ జరిగింది. పోచారం ప్రాజెక్టు 1.82 టీఎంసీల నీళ్లతో నిండుకుండలా ఉంది. సుమారు పది వేలకు పైగా ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించవచ్చు. కానీ అధికారులు మాత్రం కేవలం బీ–జోన్‌ పరిధిలోని 3,500 ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించగలమని తేల్చి చెప్పారు. దీనిపై స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీ జోన్‌తో పాటు, ఏ జోన్‌ పరిధిలోని 7,500 ఎకరాలకు కూడా సాగునీరందించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే రెవెన్యూ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షించి పూర్తి ఆయకట్టుకు నీటిని అందించాలని ఆదేశించారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు సంబంధించి అలీసాగర్‌కు ఎగువ ప్రాంతంలో ఉన్న ఆయకట్టుకు సాగునీటిని అందించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తాం. సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.రివర్స్‌ పంపింగ్‌ కోసం ఎస్సారెస్పీ నుంచి శివం కమిటీలో కేటాయించిన 2.78 టీఎంసీలను రిజర్వులో 
ఉంచుతాం.
– మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top