ఈ పురస్కారం నాకు గర్వకారణం..

Best Hero Award for Chiranjeevi From Sakshi Excellence Awards

‘సాక్షి ఎక్స్‌లెన్స్‌’ బెస్ట్‌ హీరో అవార్డు చిరంజీవికి అందజేత

సాక్షి, హైదరాబాద్‌: ‘‘గత శనివారం సైరా షూటింగ్‌ చాలా ముమ్మరంగా జరుగుతుండటం వల్ల నేను అవార్డ్‌ ఫంక్షన్‌కు హాజరుకాలేకపోయాను. కానీ నా మీద ఎంతో అభిమానంతో ‘సాక్షి’ చైర్‌పర్సన్‌ భారతీగారు అవార్డుని నాకు అందజేయాలనుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డును అందజేయటానికి ‘సాక్షి’ సంస్థ ప్రతినిధులు పెద్దలు శ్రీ రామచంద్రమూర్తిగారు, సోదరుడు రామ్‌గారు వచ్చి కలవటం సంతోషంగా ఉంది’’అని నటుడు చిరంజీవి అన్నారు. ‘సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డ్స్‌–2017’కు సంబంధించి బెస్ట్‌ హీరో అవార్డును చిరంజీవి స్వగృహంలో ఆయనకు బుధవారం అందజేసింది ‘సాక్షి’ మీడియా. ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి, సాక్షి ఫీచర్స్‌ ఎడిటర్‌ ప్రియదర్శిని రామ్‌ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ..‘‘భారతీ గారు నాకు సోదరి లాంటి వారు. నా మీద ఎంతో అభిమానంతో అవార్డుతోపాటు ఓ చాక్లెట్‌ బాక్స్‌ పంపారు.

ఇది ఆమె తియ్యని మనసుకు నిదర్శనం. ‘సాక్షి’ గ్రూప్‌ వారు గత నాలుగేళ్లుగా ఈ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు ఇస్తున్నారు. గతంలో నేను కూడా ఈ అవార్డు వేడుకల్లో పాల్గొన్నాను. ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వాళ్లందరినీ గుర్తించి వారిని ఇలా ప్రోత్సహించటం చాలా గొప్ప విషయం. అవార్డు గ్రహీతలందరికీ నా అభినందనలు. అలాగే జీవిత సాఫల్య పురస్కారాన్ని స్వీకరించిన కృష్ణ, విజయనిర్మల గార్లకు, ఇదే అవార్డును స్వీకరించిన చుక్కా రామయ్య గారికి నా అభినందనలు. ఇదే విధంగా ‘సాక్షి’ ఎల్లప్పుడూ ఔత్సాహికులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. నా విషయానికొస్తే అవార్డు నాకు రావటానికి దోహదపడింది ‘ఖైదీ నంబర్‌ 150’ సినిమా. 9 ఏళ్ల తర్వాత వచ్చిన నా కమ్‌ బ్యాక్‌ చిత్రాన్ని ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించారు.

ఆ విధంగా ప్రజల్లో నా స్థానం సుస్థిరం అని మరోసారి రుజువైంది. వాళ్ల ప్రేమను నిజం చేస్తూ వచ్చిన ఈ అవార్డును అందుకోవటం నాకు గర్వంగా, ఆనందంగా ఉంది’’అన్నారు. సైరా చిత్రం గురించి మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ..‘‘ఇది చాలా మంచి రోజు. నాకు ఈ అవార్డును అందించిన రోజు ఆగస్టు 15. ఈ సందర్భంగా నేను చేస్తున్నది దేశభక్తిని తెలియజేసే సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది. స్వాతంత్య్ర సమర యోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవితగాధ ఆధారంగా తీస్తున్న సినిమా సైరా. దేశం యావత్తూ గర్వించే గొప్ప సినిమా చరిత్రలో నిలిచిపోతుంది..జైహింద్‌’’ అంటూ ముగించారు.

అవార్డు స్వీకరించిన ఆనందాన్ని మనవరాళ్లు సమార, సంహిత, నివృతితో పంచుకుంటున్న చిరంజీవి 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top