
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో అప్రమ త్తంగా ఉండాలని అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఆదేశించారు. శనివారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఆ శాఖ కార్యదర్శి మహేశ్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ తదితరులతో ఆయన సమావేశమయ్యారు. వరుసగా వర్షాలతో విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వైద్య శాఖ అధికారుల సమన్వయంతో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు.
ఐటీడీఏ పరిధిలోని వైద్యారోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, అపరిశుభ్ర వాతావరణం లేకుండా పంచాయతీలను అప్రమత్తం చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలలు, స్కూళ్లలో వైద్య శిబిరాలు నిర్వహించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.