స్తంభించిన ‘బ్యాంకింగ్‌’!

Bank Employees Strike in Hyderabad - Sakshi

వేతనసవరణ కోసం సమ్మెకు దిగిన బ్యాంకు ఉద్యోగులు

వినియోగదారుల సేవలకు బ్రేక్‌

ఇబ్బందులకు గురైన వ్యాపారులు, ప్రజలు

యథావిధిగా పనిచేసిన ప్రైవేట్‌ బ్యాంకులు

నేడు కూడా కొనసాగనున్న సమ్మె

బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లసాధనకు వారు శుక్రవారం ఆందోళన బాటపట్టారు. హిమాయత్‌నగర్‌లో ఇలా ప్లకార్డులు చేతబూనినిరసన తెలిపారు.

సాక్షి, సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్‌ : వేతన సవరణతో పాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం బ్యాంకు ఉద్యోగసంఘాలు చేపట్టిన సమ్మెతో ఎక్కడిక్కడ బ్యాంకుల సేవలు నిలిచిపోయాయి. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోజువారి వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం బ్యాంకులపైన ఆధారపడిన వ్యాపారవర్గాలు సైతం ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె సమాచారం తెలియకపోవడంతో చాలామంది ఖాతాదారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు వచ్చి నిస్సహాయంగా తిరిగి వెళ్లారు. మరోవైపు  ప్రైవేట్‌ బ్యాంకులు, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు యథావిధిగా  కొనసాగాయి. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ తెలుగు రాష్ట్రాల విభాగం ఆధ్వర్యంలో  రెండు రోజుల సమ్మెకు పిలుపున్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి రోజు బ్యాంకు ఉద్యోగులు అబిడ్స్, కోఠి, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో  ఆందోళన చేపట్టారు. అబిడ్స్, బ్యాంక్‌ స్ట్రీట్‌లో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా  ఏర్పాటు చేసిన నిరసన సభలో మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని  ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తూ లాభాలు లేవనే నెపంతో ఉద్యోగులకు వేతన సవరణ చేయకపోవడం అన్యాయమన్నారు. కార్పొరేట్‌ సంస్థలు ఎగవేసిన వేల కోట్ల రూపాయలను తిరిగి వసూలు చేయకపోవడం దారుణమన్నారు.

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌
మొండి బాకీల జోలికి వెళ్లకుండా చిన్నచిన్న రుణాలు పొందిన పేద మధ్యతరగతి ప్రజలను మాత్రం ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉందన్నారు. కొత్త పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బ్యాంకు ఉద్యోగుల 12 డిమాండ్లను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. యునైటెడ్‌ ఫెడరేషన్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ కన్వీనర్‌ ఆర్‌. శ్రీరామ్, యూఎఫ్‌బీఎ రాష్ట్ర కన్వీనర్‌ బీఎస్‌. రాంబాబులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలలో బ్యాంకు యూనియన్ల నాయకులతోఉద్యోగుల వేతన సవరణ 12.25 శాతం నుంచి 15 శాతం పెంచిదని  తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకపోవడంతో రెండు రోజుల సమ్మె అనివార్యం అయ్యిందని  అన్నారు,. మొండి బాకీల వల్ల తీవ్ర నష్టం వచ్చిందన్నారు. వచ్చిన లాభాలలో ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం అందుకు సుముఖంగా లేదన్నారు. తమ సమ్మెతో తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ. 30వేల కోట్ల లావాదేవిలు స్తంభించినట్లు పేర్కొన్నారు.బ్యాంకుల బంద్‌ వల్ల  శుక్రవారం  జంటనగరాల్లోని సుమారు  6వేల బ్యాంకుల వరకు మూతపడ్డాయి. సుమారు 70 వేలమంది బ్యాంకు ఉద్యోగులు, అధికారులు సమ్మెలోపాల్గొన్నారు. శనివారం కూడా ఈ సమ్మె కొనసాగనుంది.ఏఐబీవోసీ ప్రధాన కార్యదర్శి ఎం. చుక్కయ్య, సిఐటీయు నాయకులు వీరయ్య, నాబార్డ్‌ ఎంప్లాయీస్‌ యూనియాన్‌ నాయకులు కైలాశ్‌పతి, అసిస్టెంట్‌ జీఎస్‌ ఎం.శ్రీనివాస్, ఎఐబీఈవో నాయకులు రవీంద్రనాథ్, ఉదయ్‌భాస్కర్, కుమార్, రమణతో పాటు వందలాది ఉద్యోగులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top