వెలుగుల తళుకులు.. లాడ్‌బజార్‌ జిలుగులు

Bangles Offers in Laad bazaar Charminar - Sakshi

పెళ్లిళ్ల సీజన్‌తో కళకళలాడుతున్న మార్కెట్‌  

ఆఫర్లు ప్రకటించిన గాజుల వ్యాపారులు

పగలు, రాత్రి సందడే సందడి  

శాలిబండ: హైదరాబాద్‌ నగర చరిత్రలో చార్మినార్‌కు ఎంత పేరు, గర్తింపు ఉన్నాయో.. లాడ్‌బజార్‌ కూ అలాగే ఉన్నాయి. ఈ రెండింటినీ విడదీసి చూడాలంటే ఎవరికీ మనసు రాదు. చార్మినార్‌ను చూడాలని వచ్చిన ప్రతి ఒక్కరూ లాడ్‌బజార్‌లో గాజులు కొనాల్సిందే. ఎప్పుడూ రద్దీగా ఉండే ఇక్కడి గాజుల దుకాణాలు ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కొనగోలుదారులతో కిటకిటలాడుపోతున్నాయి. కేవలం నగరవాసులే కాదు.. తెలంగాణ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమకు నచ్చిన గాజులను ఖరీదు చేస్తున్నారు. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా మహిళలు తమకు ఇష్టమైన రంగు రంగుల కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. ఒక్కసారి లాడ్‌బజార్‌లో అడుగు పెడితే చాలు ఆకలి, దప్పులను కూడా మరిచిపోయి గంటల తరబడి దుకాణాల్లో గడిపేస్తున్నారు. 

రూ.5 నుంచి 10 వేల ఖరీదైన గాజులు
లాడ్‌బజార్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ లభించే గాజులు ప్రపంచంలో మరెక్కడా దొరకవు. అలాగని ధరలు ఆకాశంలో ఉంటాయనుకోవడం కూడా పొరపాటే. ఇక్కడ రూ.5 నుంచి రూ.10 వేల వరకు ఖరీదు చేసే గాజులు లభ్యమవుతాయి. పైగా అందరికీ కావాల్సిన డిజైన్లు వేలల్లో ఉంటాయి. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా పెద్దవాళ్లు, యువతులు, పిల్లలు ఇక్కడి గాజులంటే మోజు పెంచుకుంటున్నారు.  

చార్మినార్‌ చెంతనే వ్యాపారం
చార్మినార్‌ పడమర వైపు పాదం దగ్గర పుట్టిన ఒక వెలుగుల వీధి లాడ్‌బజార్‌. ప్రస్తుతం లాడ్‌బజార్‌లో దాదాపు 250కి పైగా దుకాణాలు రోజూ తమ వ్యాపార లావాదేవీలు చేస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లతో ఇక్కడి వ్యాపారులు వినియోగదారులకు మరింత చేరువయ్యారు. ఆఫర్లకు ఆకర్షితులవుతున్న వినియోగదారులు గాజుల కొనుగోలు కోసం ఉత్సాహం చూపుతున్నారు. సాధారణ రోజుల్లో రద్దీగా ఉండే లాడ్‌బజార్‌.. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో మరింత బిజీగా మారిపోయింది. ప్రస్తుతం లాడ్‌బజార్‌లో వ్యాపారాలు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. విద్యుత్‌ దీపాల కాంతిలో లాడ్‌బజార్‌ రాత్రి పగలు ఒకేలాగా కనిపిస్తోంది. అద్దాల పెట్టెల్లో ఉన్న రంగు రంగుల రాళ్ల గాజులు ఛమక్‌ ఛమక్‌మంటూ వినియోగదారుల కళ్లను తాకుతున్నాయి. మెటల్, డైమండ్స్, సీసం, బ్రాస్, ఫైబర్, మిర్రర్, ఎనామిల్‌ తదితర వెరైటీ గాజులు చూసే కొద్దీ ఏది తీసుకోవాలో తెలియకుండా చేస్తున్నాయి.   

పెళ్లంటే ఇక్కడికి రావాల్సిదే.. 
ప్రస్తుతం వివాహ ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు అధికంగానే జరుగుతున్నాయి. ఈ సీజన్‌లో లాడ్‌బజార్‌ గాజుల దుకాణాలను సందర్శించకుండా వివాహ వేడుక చేయని వారుండరు. వధువుకు విభిన్న రూపాల్లోని గాజులను ఖరీదు చేసి తీసుకెళుతున్నారు. అంతేకాదు.. పెళ్లి కూతురును చేసే సమయంలో ఆహ్వానితులుగా వచ్చే అతిథులందరికీ గాజులను అందజేయడం సంప్రదాయం. అందుకే మార్కెట్‌లోని సరుకు వేగంగా అమ్ముడైపోతోంది. ధరలు కూడా అందుబాటులో ఉండడంతో దూర ప్రాంతాల నుంచి కూడా జనం లాడ్‌బజార్‌కు వస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top