పేరుకే నిషేధం!

Ban On BG 3 Cotton Seeds Not Implemented In Telangana - Sakshi

బీజీ–3 కేన్సర్‌ కారకమని తెలిసినా అధికారుల చర్యలు శూన్యం

మార్కెట్లో యథేచ్ఛగా అందుబాటులో..

ఖరీఫ్‌లో రైతులకు అంటగట్టే యత్నం 

బీజీ–3 కలుపునివారణకు గ్లైపోసేట్‌ వినియోగం తప్పనిసరి

దీంతో రైతులకు అనారోగ్యంతోపాటు పర్యావరణంగా సమస్యలు

రెండు, మూడేళ్లుగా ఈ రకం పత్తిని పండిస్తున్నా పట్టించుకోని అధికారులు

రాష్ట్ర పత్తి విత్తనాల శాంపిళ్లలో 28% బీజీ–3 ఉన్నట్లు డీఎన్‌ఏ ల్యాబ్‌ల్లో నిర్ధారణ

జనం ఆందోళనను పట్టించుకోని అధికారులు.. దళారులతో లింకులు

సాక్షి, హైదరాబాద్‌: బీజీ–3 పత్తి (హెచ్‌టీ) విత్తనంపై నిషేధం అమలు తూతూమంత్రంగా సాగుతోంది. దీన్ని వినియోగిస్తే కేన్సర్‌ వ్యాధి వస్తుందని తెలిసినా.. విచ్చలవిడిగా మార్కెట్లో ఈ విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. వచ్చేనెల నుంచి ఖరీఫ్‌ సీజన్‌ మొదలవుతుండటంతో మళ్లీ రైతులకు వీటిని కట్టబెట్టేందుకు దళారులు సిద్ధమయ్యారు. బీజీ–2కు బీజీ–3 పత్తి విత్తనానికి తేడా గుర్తించని స్థితి ఉండటంతో దీన్నే అవకాశంగా తీసుకొని అక్రమదందాకు తెరలేపారు. రెండు మూడేళ్లుగా ఇదే తీరులో బీజీ–3 పత్తి విత్తనాన్ని గ్రామాల్లో పండిస్తున్నప్పటికీ.. అడ్డుకోవడంలో వ్యవసాయశాఖ ఘోరంగా విఫలమైంది. గతేడాది కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం తెలంగాణలో 15% బీజీ–3 పత్తి సాగైంది. అనధికారికంగా చూస్తే దాదాపు 25% సాగవుతుందని అంచనా. ఇంత పెద్ద మొత్తంలో సాగవుతున్నా వ్యవసాయశాఖ తూతూమంత్రపు చర్యలకే పరిమితమైంది. ఈ రకం పత్తి విత్తనాన్ని విక్రయించేవారిపై నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తున్నారు. దీంతో బీజీ–3 పత్తి విత్తన దందాకు చెక్‌ పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. పైపెచ్చు ఈ పత్తి విత్తనానికి వ్యవసాయశాఖ అధికారులు కొందరు వంత పాడుతున్నారు. అనుమతిస్తే తప్పేంటన్న ధోరణిలో కొందరు కీలకాధికారులున్నారు. దీంతో బీజీ–3 పత్తి విత్తనం చాపకింద నీరులా రాష్ట్రంలో విస్తరిస్తుంది. 
 
గ్లైపోసేట్‌తో కేన్సర్‌ 
రాష్ట్రంలో ఖరీఫ్‌లో ఎక్కువగా పత్తి సాగవుతుంది. ఖరీఫ్‌లో పత్తి సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాల్లో ఉంటుంది. ఆ తర్వాత వరిని 23.75 లక్షల ఎకరాల్లో సాగుచేస్తారు. అయితే.. 2018–19 ఖరీఫ్‌లో పత్తి సాధారణం కంటే ఎక్కువగా ఏకంగా 44.91 లక్షల ఎకరాల్లో సాగైంది. అంటే 2.91 లక్షల ఎకరాల్లో అదనంగా సాగైంది. దేశంలో పత్తి సాగు అత్యధికంగా చేసే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. దీంతో తెలంగాణపై ప్రపంచంలోని బహుళజాతి పత్తి విత్తన కంపెనీలు దృష్టిసారించాయి. బీజీ–2 పత్తి విత్తనం ఫెయిల్‌ కావడంతో మోన్‌శాంటో కంపెనీ రౌండ్‌ ఆఫ్‌ రెడీ ఫ్లెక్స్‌ (ఆర్‌ఆర్‌ఎఫ్‌) అనే కీటక నాశినిని తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలను అభివృద్ధి చేసి ప్రపంచవ్యాప్తంగా అమ్మింది. మన దేశంలో బీజీ–3కి అనుమతి నిరాకరించడంతో దీన్ని అడ్డదారిలో విస్తరించే పనిలో కంపెనీలు నిమగ్నమయ్యాయి. బీజీ–3లో వచ్చే కలుపు నివారణకు గ్లైపోసేట్‌ అనే ప్రమాదకరమైన పురుగుమందును వాడతారు. బీజీ–3 పండిస్తున్నారంటే గ్లైపోసేట్‌ కచ్చితంగా వాడాల్సిందే. ఈ గ్లైపోసేట్‌ అత్యంత ప్రమాదకరమైందని, దీని వల్ల కేన్సర్‌ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్ధారించింది. 
 
28 శాతానికిపైగా బీజీ–3 విత్తనాలు 
తెలంగాణ వ్యవసాయశాఖ అధికారిక నివేదిక ప్రకారం.. 2017–19 మధ్య 1062 పత్తి విత్తన శాంపిళ్లను హైదరాబాద్‌ మలక్‌పేటలోని డీఎన్‌ఏ ల్యాబ్‌లో పరీక్షించింది. అందులో ఏకంగా 302 శాంపిళ్లలో నిషేధిత బీజీ–3 విత్తనాలు ఉన్నట్లు తేలింది. అంటే ఏకంగా 28.43% అన్నమాట. ఇంత పెద్ద ఎత్తున బీజీ–3 విత్తనం సాగవుతున్నా అధికారులు తూతూమంత్రపు చర్యలకే పరిమితమవుతున్నారు. వ్యవసాయశాఖ వర్గాలు బీజీ–3ని ఉత్పత్తి చేస్తున్న 8 కంపెనీలపై చర్యలు తీసుకోవాలని భావించినా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. వచ్చే ఖరీఫ్‌ కోసం దాదాపు 1.30 కోట్ల పత్తి ప్యాకెట్లను రైతులకు సరఫరా చేయాలని దళారులు ప్రయత్నాల్లో ఉన్నారు. గతేడాది మార్కెట్లో 68,766 లీటర్ల గ్లైపోసేట్‌ను వ్యవసాయశాఖ వర్గాలు పట్టుకున్నాయి. కానీ సీజ్‌ చేయలేదు. దీంతో గ్రామాల్లో విషం ఏరులై పారుతోంది. తినే తిండి, గాలి, వాతావరణం కలుషితమై జనజీవనానికి జబ్బులను తెచ్చి పెడుతుంది. 
 
బీజీ–3పై తూతూమంత్రపు చర్యలు 
బీజీ–3కి అడ్డుకట్టవేయాలని పైకి చెబుతున్నా వ్యవసాయ శాఖ సీరియస్‌గా తీసుకోవడంలేదు. తయారీదారులపై చర్యలు తీసుకోకుండా, మార్కెట్లోకి ప్రవేశించాక చేసే దాడులతో వచ్చే ప్రయోజనముండదు. అధికారుల చిత్తశుద్దిని శంకించాల్సి వస్తోంది.  – నర్సింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు 
 
క్యాన్సర్‌ కారకం 
గ్లైపోసేట్‌తో కేన్సర్‌ వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2015లోనే నిర్ధారించింది. దేశంలో ఈ అమ్మకాలపై అనేక పరిమితులున్నాయి. కానీ విచ్చలవిడిగా వాడటం వల్ల జీవవైవిధ్యానికి ప్రమాదం ఏర్పడనుంది. దీనిపై సర్కారు చర్యలు తీసుకోవాలి. – డాక్టర్‌ కమల్‌నాథ్, జనరల్‌ సర్జన్, హైదరాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top