ఇక బడిబాట

Badibata Programme In Medak - Sakshi

పాపన్నపేట(మెదక్‌): బడీడు పిల్లలంతా బడిలో ఉండేలా అవగాహన కల్పించేందుకు.. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల వైపు మళ్లించేందుకు విద్యాశాఖ ‘బడిబాట’కు మరోసారి సన్నద్ధమైంది. ఈనెల 14 (శుక్రవారం) నుంచి 19 వరకు పండుగ వాతావరణంలో ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేం దుకు ఆదేశాలిచ్చింది. ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రభుత్వ బడులు సాధించిన మెరుగైన ఫలితా లను విస్తృతంగా ప్రచారం చేసి నమోదు శాతం పెంచేందుకు పక్కా ప్రణాళిను అమలు చేయబోతున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు సన్మానాలు చేయనున్నారు. ప్రభుత్వ బడిని బతికించుకునేందుకు ప్రైవేటును తలదన్నే ప్రచార వ్యూహాలు సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో ‘గ్రామ విద్యా రిజిస్టర్‌’ (ఏఈఆర్‌)తప్పకుండా నిర్వహించాలని తద్వారా బడి బయట ఉన్న విద్యార్థుల వివరాలు గుర్తించవచ్చని భావిస్తున్నారు.

బడీడు పిల్లలు బడిలో ఉండడమే ఉద్దేశం.. 
ప్రభుత్వ బడుల్లో నమోదు శాతం పెంచేందుకు దశాబ్ద కాలంగా విద్యాశాఖ బడిబాట కార్యక్రమాన్ని చేపడుతోంది. విద్యాసంవత్సరం ఆరంభం నుంచి వారం రోజుల పాటు నిర్దేశించిన షెడ్యూల్‌ కనుగుణంగా పండుగ వాతావరణంలో బడిబాట నిర్వహిస్తున్నారు. జిల్లాలో 902 ప్రభుత్వ పాఠశాలలుండగా సుమారు 83 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇప్పటికీ కొంత మంది పిల్లలు అక్కడక్కడ ఇటుక బట్టీల్లో.. యాచక వృత్తిలో.. పశువుల కాపరులుగా.. హోటళ్లు, కిరాణ దుకాణాల్లో బాల కార్మికులుగా బతుకీడుస్తున్నారు.

బడీడు గల పిల్లలందరినీ బడిలో చేర్పించడం.. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ‘బడిబాట’ ప్రధాన  ఉద్దేశం. అందుకే అంగన్‌వాడీ పూర్తి చేసిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించడం.. బాలికల విద్యను ప్రోత్సహించడం.. హాజరు నమోదు తక్కువగా ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టడం.. పోషకుల సమావేశం నిర్వహించడం.. గుణాత్మక విద్యా సాధనకు చేస్తున్న కృషి వివరించి స్వచ్ఛంద సంస్థలు, పూర్వ విద్యార్థులు, గ్రామ పెద్దలు, దాతల సాయాన్ని తీసుకొని పాఠశాల అభివృద్ధికి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, పదో తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను, ఉపాధ్యాయులను సన్మానించడం లాంటివి ప్రాధాన్య అంశాలుగా గుర్తించారు. 10 జీపీఏ సాధించిన విద్యార్థులు, హెచ్‌ఎంలతో కలసి కలెక్టర్‌ ధర్మారెడ్డి, జేసీ నగేశ్, డీఈఓ రవికాంత్‌రావు ఇప్పటికే విందు కార్యక్రమాన్ని పూర్తి చేశారు.

బడిబాట షెడ్యూల్‌  ..

  • ఈనెల 14న ‘మన ఊరి బడి’: పాఠశాలలకు రంగులు వేయించడం, ఇంటింటి సర్వే నిర్వహించడం, కరపత్రాలు పంచడం, ర్యాలీలు నిర్వహించడం, బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పిండం, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలతో కలసి పాఠశాల అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం చేయాలి. నాణ్యమైన  విద్యను అందించేందుకు, విద్యాప్రమాణాలు పెంపొందించేదుకు తీర్మానాలు చేయాలి.
  • 15న ‘బాలిక విద్యా’ కార్యక్రమాలు: బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న హెల్త్, హైజిన్‌ కిట్స్‌ పంపిణీ, వాటి ప్రాధాన్యత, కస్తూర్బా బాలికల పాఠశాల ప్రవేశం, అక్కడి సౌకర్యాలు, విద్యార్థినులకు పాఠశాలల్లో నేర్పుతున్న మార్షల్‌ ఆర్ట్స్, మహిళా సాధికారత విషయాలు తెలియజేయాలి.
  • 17న ‘సామూహిక అక్షరాభ్యాసం’: గ్రామపెద్దలను, ప్రజాప్రతినిధులను పిలిచి విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించాలి. అందుకు కావాల్సిన పలకలు, బలపాలు సమకూర్చుకోవాలి. పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలి.
  • 18న ‘స్వచ్ఛ పాఠశాల’ (హరితహారం):  పాఠశాల ప్రాంగణాన్ని, తరగతి గదులను, పాఠశాలలో తాగునీటి ట్యాంకులను, మరుగుదొడ్లను శుభ్రం చేసుకోవాలి. తరగతుల్లో బోధనాభ్యసన చార్టులు అంటించాలి. హరితహారం నిర్వహించడం చేయాలి.
  • 19న ‘పాఠశాల యాజమాన్య కమిటీ (బాల కార్మికుల విముక్తి) సమావేశాలు’: బాల కార్మికుల విముక్తికి పాఠశాల యాజమాన్య కమిటీ తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి పాఠశాలలో ఎస్‌ఎంసీ సమావేశాలను నిర్వహించాలి. టాస్క్‌ఫోర్స్‌ కమిటీ, ఎస్‌ఎంసీ కమిటీలతో కలసి, బాలకార్మికులు ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడికి వెళ్లి వారిని పాఠశాలల్లో చేర్పించాలి. పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను పాఠశాలకు పిలిచి వారిని సన్మానిం చాలి. టెన్త్, ఏడో తరగతి ఫలితాలు వివరిం చాలి. మౌలిక వసతుల వివరాలు, మధ్యాహ్న భోజనం, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌లు, ఎన్‌ఎంఎంఎస్‌ స్కాలర్‌షిప్‌లతో ఒక పాఠశాల ప్రొఫైల్‌ తయారు చేసుకోవాలి.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top