మాటలు కలిపాడు..మట్టుపెట్టాడు

Auto Driver Killed Old Woman And Steal Gold In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలోని సీతారాం నగర్‌లో ఈనెల 3న సాయమ్మ అనే వృద్ధురాలిని చంపి చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీపీ కార్తికేయ బుధవారం వెల్లడించారు. పుట్టి సాయమ్మ ఈనెల 3న హైదరాబాద్‌ నుంచి సీతారాంనగర్‌ కాలనీలోని తన ఇంటికి ఆటో ఎక్కి రాగా ఆటో డ్రైవర్‌ పల్లెపు మల్లేష్‌ వృద్ధురాలికి సంబంధించి అనేక విషయాలు అడిగాడు. అనంతరం ఇంట్లో నిద్రిస్తున్న సాయమ్మను చంపి ఆమెపై ఉన్న బంగారు గుండ్లు, రెండు తులాల బంగారం, కమ్మలు, మట్టెలు ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసుకొని 5వ టౌన్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. ఆటో డ్రైవర్‌పై అనుమానం రావడంతో సీసీ పుటేజీ ఆధారంగా ఆటోను గుర్తించారు. ఆటో ముందుభాగంలో మరమ్మతులు ఉండడంతో దాని ఆధారంగా పోలీసులు ఆటోను గుర్తించారు. దీంతో పల్లెపు మల్లేష్‌ను విచారించగా చోరీ, హత్య వివరాలు బట్టబయలయ్యాయి. మల్లేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీపీ తెలిపారు. ఈ కేసును నార్త్‌ సీఐ శ్రీనాథ్‌రెడ్డి, 5వ టౌన్‌ ఎస్‌ఐ జాన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు వేణుగోపాల్, శేఖర్‌బాబు, వెంకటస్వామి త్వరగా ఛేదించారు. వీరిని సీపీ అభినందించారు. 

నేరస్తుడి నేరాల చిట్టా బారెడు.. 
నాగారంలోని ఒడ్డెర కాలనీకి చెందిన పల్లెపు మల్లేష్‌ కరడుగట్టిన నేరస్తుడు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్‌ జిల్లాలో 1997 నుంచి నేరాలు చేస్తూనే ఉన్నట్లు సీపీ తెలిపారు. అతడు హత్యలు, చోరీలు చేయడంలో ఆరితేరాడు. 1997లో నిజామాబాద్‌ రూరల్‌ పరిధిలో కేసు నమోదైంది. 1997 నుంచి 2006 వరకు ఐదు చోరీలు నిజామాబాద్‌ 5వ టౌన్‌ పరిధిలో జరిగాయి. 2010లో ఐదు, 2014లో మూడు చోరీలు చేశాడు. 2008లో భీమమ్మ అనే మహిళను హత్యచేశాడు. 2011లో జైలు పాలయ్యాడు. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా నేరాలు చేస్తున్నాడు. అతడిపై నిజామాబాద్‌ రూరల్, భీంగల్, కమ్మర్‌పల్లి, 5వ టౌన్, మాక్లూర్, సిద్దిపేట, దుబ్బాక పోలీసుస్టేషన్ల పరిధిలో అనేక కేసులు నమోదయ్యాయి.   
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top