పూడ్చిన శవాలను బయటకు తీసి కాల్చేందుకు యత్నం 

Attempt to Pull out the Corpses for the Rain - Sakshi

పోలీసులకు సమాచారం అందడంతో ఆగిన వ్యవహారం 

వర్షాలు కురియకపోవడానికి ఖననం చేయడమేనని.. చింతలకుంట వాసుల మూఢనమ్మకం 

గ్రామస్తులకు కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు 

గట్టు/ కేటీదొడ్డి (గద్వాల): వర్షాలు సరిగా కురియకపోవడానికి ఆ గ్రామస్తులు ఆరు నెలల క్రితం మృతి చెందిన ఇద్దరు వ్యక్తులను ఖననం చేయడమేనని భావించారు. చివరకు పూడ్చిన ఆ శవాలను వెలికితీసి దహనం చేస్తేనే ఫలితం ఉంటుందని నమ్మారు. ఆనుకున్నదే తడువుగా దానిని ఆచరణలో పెట్టాలని గ్రామస్తులంతా నిర్ణయించుకున్నారు. ఈ విషయం పోలీసులకు చేరడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. వివరాలిల్లోకి వెళితే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలంలోని చింతలకుంట గ్రామం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ఆరు నెలల క్రితం మృతి చెందిన ఇద్దరి (రెండు సామాజిక వర్గాలు) ని ఖననం చేయడంతోనే ఈ ఏడాది వర్షాలు కురియడం లేదని గ్రామస్తులు భావించారు. ఈ ఇద్దరికి శరీరంపై తెల్లమచ్చ (కుష్ఠువ్యాధి లక్షణాలు)లు ఉన్నాయని వారి మృతదేహాలను వెలికితీసి దహనం చేయాలని ఆదివారం ఉదయం నిర్ణయించుకున్నారు. ఈ విషయం కాస్త పోలీసులకు చేరడంతో వారు వెంటనే రంగంలోకి దిగారు. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా మృతదేహాలను వెలికితీస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో గ్రామస్థులు తమ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఎలాంటి మూఢనమ్మకాలు ఆచరించవద్దని గ్రామస్తులకు ఎస్‌ఐ బాలవెంకటరమణ కౌన్సెలింగ్‌ ఇచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top