మిస్సింగ్‌ కాదు.. డబుల్‌ మర్డర్‌! 

Police Solved Eight Years Of Couple Missing Case In Mahabubnagar District - Sakshi

8 ఏళ్లకు వీడిన దంపతుల అదృశ్యం మిస్టరీ 

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తొలుత భర్త, ఆపై అతని భార్య హత్య 

శ్మశానవాటిక కోసం గుంత తవ్వుతుండగా బయటపడ్డ ఎముకలు

దేవరకద్ర రూరల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం పేరూర్‌లో భార్యాభర్తల మిస్సింగ్‌ వెనకున్న మిస్టరీని ఎనిమిదేళ్ల తర్వాత పోలీసులు ఛేదించారు. దంపతుల అదృశ్యాన్ని హత్యగా తేల్చారు. వివాహేతర సంబంధమే అందుకు కారణమని సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

సీఐ రజితరెడ్డి, గ్రామస్తుల కథనం ప్రకారం దేవరకద్ర మండలంలోని ఇస్రంపల్లికి చెందిన బుర్రన్‌ పేరూర్‌లో తన బావమరుదులు నానేష్, మహమ్మద్‌ రఫీతో కలిసి బొగ్గు అమ్మేవాడు. ఈ క్రమంలో పేరూర్‌కే చెందిన దంపతులు బోయ శాంతమ్మ (32), బోయ ఆంజనేయులు (37)తో బుర్రన్‌కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో బుర్రన్‌ దగ్గర వారు రూ. 20వేలు అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చాలంటూ బుర్రన్‌ తరచూ వారి ఇంటికి వెళ్లే క్రమంలో శాంతమ్మతో బుర్రన్‌ వివాహేతర సంబ«ం«ధం ఏర్పర్చుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు తన భార్యతో మాట్లాడితే చంపుతానని బుర్రన్‌ను హెచ్చరించాడు. 

అడ్డొస్తున్నాడని.. గొంతు నులిమి.. 
తన వద్ద తీసుకున్న డబ్బు ఇవ్వకపోవడంతోపాటు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో ఆంజనేయులును హతమార్చాలని బుర్రన్‌ నిర్ణయించుకున్నాడు. 2014 ఏప్రిల్‌ 19న మాట్లాడుకుందామంటూ ఆంజనేయులను పెద్దమందడి మండలంలోని పెద్దమునగల్‌ చేడ్‌ గ్రామ శివారులోని ఓ పొలం వద్దకు తీసుకెళ్లి నానేష్, రఫీతో కలసి గొంతు నులిమి చంపాడు.

అనంతరం ఈ విషయాన్ని శాంతమ్మకు చెప్పాడు. ఆమె ఈ హత్యోదంతాన్ని బయటకు చెబుతాననడంతో బావమరుదుల సాయంతో ఆమెను గ్రామ శివారులోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లి చీర కొంగును గొంతుకు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపాడు. ఈ హత్యలు బయటపడకుండా ఉండేందుకు మృతదేహాలను పూడ్చి పెట్టారు. 

డీఎన్‌ఏ పరీక్షతో కేసు ఛేదన.. 
2020 ఏప్రిల్‌ 17న మండలంలోని పేరూర్‌ శివారులో శ్మశానవాటిక నిర్మాణం కోసం గుంతలు తవ్వుతుండగా ఓ చీర, ఎముకలు బయటపడ్డాయి. ఈ సమాచారం అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు... గత పదేళ్లలో తప్పిపోయిన మహిళల సమాచారాన్ని సేకరించే క్రమంలో శాంతమ్మ పేరు రావడంతో మృతురాలి కుమారుడు శ్రీకాంత్‌కు డీఎన్‌ఏ టెస్టు చేశారు. అది ఎముకలతో సరిపోలడంతో మృతి చెందింది శాంతమ్మగా నిర్ధారించి దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు సర్పంచ్‌ను కలిసి నిజం చెప్పారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. మరో నిందితుడు రఫీ ఏడాది క్రితం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top