గీత దాటని అధికారపక్షం | as CM KCR orders all TRS MLAS attends at assembly | Sakshi
Sakshi News home page

గీత దాటని అధికారపక్షం

Dec 17 2016 3:24 AM | Updated on Aug 14 2018 10:54 AM

అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ అధినేత ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజైన శుక్రవారం ప్రతిఒక్కరూ సభకు హాజరయ్యారు.

- సీఎం ఆదేశాలు పక్కాగా అమలు
- అసెంబ్లీలో తొలి రోజు నూరు శాతం హాజరు
- సభ ముగిసే వరకు చివరిదాకా సీట్లలోనే ఎమ్మెల్యేలు

సాక్షి, హైదరాబాద్‌:
అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమ అధినేత ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలి రోజైన శుక్రవారం ప్రతిఒక్కరూ సభకు హాజరయ్యారు. తొలి గంటన్నర సేపు జరిగిన ప్రశ్నోత్తరాలు, ఆ తర్వాత అరగంటపాటు జరిగిన జీరో అవర్‌లో పూర్తిస్థాయిలో పాల్గొన్నారు. సభలో ఎలా వ్యవహరించాలనే విషయం సహా వివిధ అంశాలపై సీఎం కేసీఆర్‌ గురువారం చేసిన దిశానిర్దేశం మేరకు నడుచుకున్నారు. ఒక్క సభ్యుడూ సభ నుంచి బయటకు రాలేదు. టీ విరామ సమయంలోనూ వారు లాబీల్లోకి రాకుండా సీట్లకే అతుక్కుపోయారు.

ప్రతిపక్ష సభ్యులు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దని... దురుసుగా మాట్లాడొద్దని, నోరు జారొద్దని సీఎం చేసిన సూచనలు బాగానే పనిచేశాయి. పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరుగుతున్న సమయంలో ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ మాట్లాడిన సందర్భంలో అధికారపక్ష సభ్యులు ఎదురుదాడికి దిగుతారేమోననే వాతావరణం కనిపించినా అంతా సంయమనం పాటించారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దుపై తానొక్కడినే మాట్లాడతానని సీఎం కేసీఆర్‌ ముందే ప్రకటించడంతో సభ్యులకు ఎవరికీ అవకాశం రాలేదు. ఉదయం 10 గంటలకు మొదలైన సభ మధ్యాహ్నం 3.15 గంటల దాకా జరిగింది.

అసెంబ్లీలో ‘వ్యూహ కమిటీ’ భేటీ
శాసనసభ, శాసన మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై మంత్రులతో కూడిన అసెంబ్లీ వ్యూహ కమిటీ శుక్రవారం అసెంబ్లీ ప్రారంభానికి ముందే సమావేశమైంది. శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు చాంబర్‌లో సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో ‘రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితి’పై శాసన మండలిలో లఘు చర్చ గురించి ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కె. తారక రామారావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సమావేశమై చర్చించారు. మొత్తంగా ముందు అనుకున్న ప్రకారమే ఎక్కడా గీత దాటకుండా అధికార టీఆర్‌ఎస్‌ తొలిరోజు సభను ముగిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement