సైనికుడా.. వందనం | Army Day Special Story In Sakshi | Sakshi
Sakshi News home page

Jan 15 2019 10:21 AM | Updated on Jan 15 2019 10:21 AM

Army Day Special Story In Sakshi

భైంసాటౌన్‌(ముథోల్‌) : మనం ఈరోజు ప్రశాంత జీవనం గడుపుతూ సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం భారత సైనికులు.. 24 గంటలు సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తూ ఎడారి ఎండల్ని, కాశ్మీరు మంచును, మేఘాలయా వర్షాలను లెక్కచేయకుండా దేశరక్షణలో ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతారు. కోట్లాది భారతీయుల కోసం తమ కుటుంబాలకు దూరంగా మంచుగడ్డల్లో, ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తున్నారు. కేవలం దేశరక్షణకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల రక్షణలోనూ ముందుంటున్నారు. దేశానికి అన్నం పెట్టేది రైతన్నే అయినా.. దేశాన్ని కాపాడేది సైనికుడు.. అందుకే ముందుగా జై జవాన్, ఆ తరువాతే జై కిసాన్‌ అన్నారు. దేశసేవ కోసం జిల్లా నుంచి ఎంతోమంది సైనికులు సరిహద్దులో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈనెల 15న సైనిక దినోత్సవం. నిరంతరం దేశానికి కాపలా కాసే సైనికులను స్మరించుకునే రోజు ఇది. ఈ నేపథ్యంలో కథనం.. 

ఆర్మీ ‘డే’ నేపథ్యం.. 
అనేక పోరాటాల ఫలితంగా 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించింది. ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు భారతదేశానికి బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రాన్ని సంపాదించి పెట్టారు. స్వాతంత్య్ర భారతదేశాన్ని భారత సైనికులు కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. 1948లో చివరి బ్రిటిషన్‌ కమాండర్‌ జనరల్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో భారతదేశ మొట్టమొదటి సైనిక కమాండర్‌గా కేఎం కరియప్ప జనవరి 15న బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఈ రోజున ‘జాతీయ సైనిక దినోత్సవం’గా జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవానులకు ఢిల్లీలోని అమరజవాను జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వారి త్యాగాలను స్మరించుకుంటారు. దేశసేవలో ఉత్తమ సాహసాలను ప్రదర్శించిన జవానులకు సేవా అవార్డులు సైతం అందజేస్తారు. 

ప్రభుత్వాలు ప్రోత్సహించాలి 
దేశరక్షణలో భాగంగా విధులు నిర్వర్తించే జవాన్లకు ప్రభుత్వం వారి పదవీ విరమణ అనంతరం ఐదెకరాల ప్రభుత్వ స్థలం కేటాయిస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భూమి కేటాయిస్తాయి. అయితే గతంలో పదవీ విరమణకు ముందే జవాన్లకు ప్రభుత్వం ఐదెకరాల భూమి కేటాయించేది. కానీ 2009 నుంచి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం ఆర్మీ జవాన్లకు పదవీ విరమణ తరువాతే భూమి కేటాయించాలని నిర్ణయించింది. దీంతో గతంలో మాదిరే ముందుగానే ప్రభుత్వం భూమిని కేటాయించాలని జవాన్లు కోరుతున్నారు. తమపై ఆధారపడే కుటుంబసభ్యులకు చేదోడువాదోడుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుగానే ఐదెకరాల స్థలం కేటాయిస్తే ఎందరో యువకులు దేశరక్షణలో పాలు పంచుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ప్రభుత్వాలు సైతం యువత దేశరక్షణలో రాణించేలా వారిని ప్రోత్సహించాలని జవాన్లు కోరుతున్నారు.
 
లక్ష్యమే కనిపించింది 
మాది భైంసా మండలం లింగా 2 గ్రామం. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో జరిగిన పాక్‌ కాల్పుల్లో నాచేతి నుంచి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో గాయమైంది. ఆ రోజు చుట్టూ పొగమంచు ఆవరించి ఉంది. కాసేపు ఏం జరిగిందో తెలియలేదు. శత్రువుల నుంచి బుల్లెట్ల వర్షం కురుస్తున్నా సుమారు గంటసేపు ఉగ్రమూకలతో పోరాడా. గాయాలు కావడంతో సైనిక అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చారు. చికిత్స పొందాలని సూచించడంతో స్వగ్రామానికి వచ్చా. – దుప్పి విశ్వనాథ్, జవాను, లింగ 2 

యూనిఫాం అంటే ఇష్టంతో.. 
మాది నిర్మల్‌ జిల్లా ఖానా పూర్‌లోని శాంతినగర్‌. అమ్మ లక్ష్మి, నాన్న నర్సయ్య వ్యవసాయం చేస్తారు.  నేను కూడా వ్యవసాయంలో నాన్నకు సాయం చేస్తూ చదువుకున్నా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి యూనిఫాం జాబ్‌ అంటే చాలా ఇష్టం. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని కసి ఉండేది. మొదటగా కానిస్టేబుల్‌ ఎంపిక పరీక్షలకు వెళ్లినా సెలెక్ట్‌ కాలేదు. అయితే తరువాత కఠోర సాధనతో 2008లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో మొదటి ప్రయత్నంలోనే ఎంపికయ్యాను. ప్రస్తుతం పంజాబ్‌లో విధులు నిర్వర్తిస్తున్నా. – కడుకుంట్ల ప్రవీణ్‌కుమార్, జవాన్‌

దేశసేవ కోసమే 
మాది భైంసాలోని కిసాన్‌గల్లి. అమ్మ గంగాబాయి, నాన్న రాములు. పదోతరగతి వరకు భైంసాలోని సరస్వతి శిశుమందిర్‌లో విద్యాభ్యాసం జరిగింది.  2002లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికయ్యా. ప్రస్తుతం నాయక్‌గా విధులు నిర్వర్తిస్తున్నా.  – కార్తీక్, నాయక్, భైంసా 

జైహింద్‌ మన నినాదం కావాలి 
మాది భైంసా పట్టణంలో ని గణేశ్‌నగర్‌. అమ్మ భూ మాబాయి, నాన్న సాయ న్న. అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. నా విద్యాభ్యాసం భైంసాలోని సర స్వతి శిశుమందిర్‌లో సాగింది. చిన్నప్పటి నుంచే దేశభక్తి భావాలు ఎక్కువ. 2000 సంవత్సరంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికయ్యా. ప్రస్తుతం హవల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. పిల్లలకు గుడ్‌మార్నింగ్, గుడ్‌నైట్‌లకు బదులు జైహింద్, జైభారత్‌ అనే నినాదాలు నేర్పించాలి. దీంతో వారిలో దేశం పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. – ఆకుల దత్తాత్రి, హవల్దార్, భైంసా   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement