మనకు 29 టీఎంసీలు.. ఏపీకి 17.5 టీఎంసీలు

AP Telangana Krishna Water Sharing - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు కృష్ణా బోర్డు పంచింది. లభ్యత జలాల్లో తెలం గాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.50 టీఎంసీలను కేటాయించింది. కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత, అవసరాలు, కేటాయింపులపై చర్చించేందుకు గురువారం హైదరాబాద్‌లోని జల సౌధలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌ ఆర్కే జైన్, సభ్య కార్యదర్శి హరికేశ్‌ మీనా, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈ నరహరిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తొలుత ప్రాజెక్టుల్లో లభ్యత జలాలపై చర్చించారు. శ్రీశైలంలో ప్రస్తుతం కనీస నీటిమట్టం 834 అడుగులకు దిగువన 827.40 అడుగుల్లో 46.98 టీఎంసీల నీరు ఉందని, ఇందులో 800 అడుగుల దిగువ వరకు నీటిని తీసుకునేపక్షంలో 18 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని లెక్కగట్టారు. ఇక సాగర్‌లో ప్రస్తుతం 524.2 అడుగుల మట్టంలో 157 టీఎంసీల నీరుండగా కనీస నీటిమట్టం 510 అడుగులకు దిగువన 505 అడుగుల వరకు కనిష్టంగా 33.71 టీఎంసీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉందని తేల్చారు.

మొత్తంగా 51.71 టీఎంసీలు ఉండగా వాటిని పంచాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి ఇరు రాష్ట్రాలు సమ్మతి తెలపడంతో తెలంగాణకు 29 టీఎంసీలు, ఏపీకి 17.50 టీఎంసీలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులకు వీలైనంత ఎక్కువ కాల్వ నిర్వహించేలా చూడాలని సూచించింది. ఇక ఏపీ అవసరాల కోసం ఎడమ కాల్వ కింద చేసిన కేటాయింపులను కేవలం తెలంగాణలోని పాలేరు రిజర్వాయర్‌ కింద అవసరాలకు విడుదల చేసిన సమయంలోనే వాడుకోవాలని తెలిపింది.

ఇరు రాష్ట్రాలకు నీరు ఇలా...
తెలంగాణకు కేటాయించిన నీటిలో ఆగస్టు వరకు కల్వకుర్తి కింద మిషన్‌ భగీరథ అవసరాలకు 3.50 టీఎంసీలను బోర్డు కేటాయించింది. అలాగే సాగర్‌ కింద ఆగస్టు వరకు మిషన్‌ భగీరథకు 5 టీఎంసీలు, హైదరాబాద్‌ తాగనీటికి 8.50 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్‌పీ) కింద చెరువులు నింపేందుకు 3 టీఎంసీలు, సాగర్‌ ఎడమ కాల్వ కింద రబీ పంటలకు 9 టీఎంసీలను కేటాయించింది. ఇక ఏపీకి శ్రీశైలం నుంచి హంద్రీనీవాకు 3 టీఎంసీలు, సాగర్‌ నుంచి కుడి కాల్వకు 8 టీఎంసీలు, ఎడమ కాల్వకు 3 టీఎంసీలు, కేడీఎస్‌కు 3.50 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top