గాంధీలో మళ్లీ అదే సీన్‌ | Sakshi
Sakshi News home page

గాంధీలో మళ్లీ అదే సీన్‌

Published Fri, Jun 12 2020 4:32 AM

Another Dead Body Missing Case At Mortuary At Gandhi Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి మార్చురీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కరోనా వైరస్‌ బారిన పడి మూ డ్రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో మరణించిన బేగంపేటకు చెందిన వ్యక్తి (48) మృతదేహం తారుమారైన ఘటన మరకముందే తాజాగా గురువారం మరో వ్యక్తి (37) మృతదేహం కనిపించకుండా పోవ డం వివాదాస్పదంగా మారింది. తీరా కు టుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని అధికారులను నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. ఒకరికి ఇవ్వాల్సిన మృతదేహాన్ని మరొకరికి ఇచ్చినట్లు తేలింది. అయితే ఈ అంశాన్ని గాంధీ వైద్యులు కానీ.. పోలీసులు కానీ ఇప్పటివరకు అధికారికంగా ధ్రువీకరించలేదు.

అసలేమైందంటే..? 
మెహిదీపట్నానికి చెందిన రషీద్‌ఖాన్‌ (37) దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతూ చికిత్స కోసం ఈ నెల ఏడో తేదీన నగరంలోని మెడిసిటీ ఆస్పత్రిలో చేరాడు. కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో 8న ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తర లించారు. తొమ్మిదో తేదీ రాత్రి ఆయన మృతిచెందాడు. ఇదే సమయంలో.. గాం ధీలో కరోనాతో ప çహాడీషరీఫ్‌కు చెంది న మహమూద్‌ (40) మరణించాడు. ఇరువురి మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని ఇరువురి కుటుంబసభ్యులకు చేరవేశారు. దీంతో బుధవారం (10వ తేదీన) ఉదయం పçహాడీషరీఫ్‌ మృతునికి సంబంధించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి చేరుకుని ఒక మృతదేహాన్ని చూసి, ఇది తమదేనని చెప్పి వెంట తీసుకెళ్లి అం త్యక్రియలు పూర్తి చేశారు. ఇటు మరణించిన మెహిదీపట్నం వ్యక్తికి సంబంధించిన కుటుంబసభ్యులు గురువారం ఉదయం ఆస్పత్రికి చేరుకున్నారు. మార్చురీలోకి వెళ్లి మృతదేహాలను పరిశీలించగా, వాటిలో రషీద్‌ఖాన్‌ మృతదే హం కన్పించకపోవడంతో వారు అధికారులను నిలదీశారు.

వార్డులన్నీ తిరిగి.. చివరికి మారిపోయి నట్లు గుర్తించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి సహా, స్థానిక డీసీపీ కల్మేశ్వర్‌లు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. ఒకవేళ రషీద్‌ చనిపోయి ఉండకపోతే ఆస్పత్రిలోనే ఉండి ఉంటారని భావించి, ఆ మేరకు కుటుంబ సభ్యులతో కలసి ఆస్పత్రిలోని ఐసీయూ, ఐసోలేషన్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులందరినీ పరిశీలించారు. వారిలో సదరు వ్యక్తి కన్పించకపోవడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. అంతా కలసి చివరకు మళ్లీ మార్చురీకి చేరుకున్నారు. ఈ నెల 10న మార్చురీకి చేరుకున్న వారి మృతదేహాలతో పాటు మార్చురీ నుంచి మృతదేహాలను తీసుకెళ్లిన వారి వివరాల ను ఆరా తీశారు. మెహిదీపట్నంకు చెందిన రషీద్‌ మృతదేహాన్ని పహాడీషరీఫ్‌కు చెందిన మహమూద్‌గా భావించి సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆ మేరకు వారిని ఆస్పత్రికి పిలిపించారు. మహమూద్‌ మృతదేహం గాంధీ మార్చురీలోనే ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఇరువురు కుటుంబసభ్యులతో చర్చించి సమస్యను సద్దుమణిగేలా చేశారు. కాగా, మహమూద్‌ మృతదేహాన్ని కూడా అంత్యక్రియల కోసం జీహెచ్‌ఎంసీ సిబ్బందికే అప్పగించడం కొసమెరుపు.

అధ్వానంగా రికార్డుల నిర్వహణ.. 
మార్చురీకి వచ్చే మృతదేహాలను భద్రపరిచే విషయంలోనే కాదు వాటికి సంబంధించిన కేసు షీట్లు, రికార్డుల నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు మరోసారి స్పష్టమైంది. కరోనా వైరస్‌తో చనిపోయిన వారి మృతదేహాలను పూర్తిగా కవర్‌ కట్టిపెట్టడం, వాటికి రికార్డ్‌ ట్యాగ్‌లు లేకపోవడం, గుర్తింపు కోసం వచ్చిన బంధువులు కూడా ఎక్కడ తమకు వైరస్‌ సోకుతుందో అనే భయంతో దూరం నుంచే వాటిని చూడాల్సి రావడం, మృతదేహాల ముఖం పూర్తిగా కన్పించకపోవడం, అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనూ పూర్తిగా తెరిచి చూపించకపోవడం సమస్యకు కారణమవుతోంది. ఇకపై మృతదేహాల గుర్తింపు పక్కాగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. మృతదేహానికి మృతుని పేరు, వయసు, చిరునామాతో కూడిన ట్యాగ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు గుర్తింపు కోసం వచ్చే బంధువులను కూడా ఫొటో, వీడియో రూపంలో రికార్డు చేయాలని నిర్ణయించారు.

Advertisement
Advertisement