1..2..3 సిటీలో దశలవారీగా మెట్రో | Sakshi
Sakshi News home page

1..2..3 సిటీలో దశలవారీగా మెట్రో

Published Thu, Mar 21 2019 7:47 AM

Ameerpet to Hitech City Metro Services Starts - Sakshi

మహానగరంలోని ‘మెట్రో’ ప్రయాణంలో మరో ముందడుగు పడింది. నగరంలో కీలకమైన అమీర్‌పేట్‌– హైటెక్‌సిటీ మార్గంలో రైళ్లు బుధవారం నుంచిఅందుబాటులోకి వచ్చాయి. ఈ రూట్‌లో సేవలను ఉదయం గవర్నర్‌ నరసింహన్‌ ప్రారంభించగా.. సాయంత్రం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రతిరోజు మాదాపూర్‌ వెళ్లే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్‌ ఇక్కట్ల నుంచి ఊరట లభించినట్లయింది. అయితే, ఆయా స్టేషన్ల వద్ద వాహన పార్కింగ్‌ పెద్ద సమస్యగా మారింది.

సాక్షి,సిటీబ్యూరో/మాదాపూర్‌: గ్రేటర్‌ వాసుల కలల మెట్రో రైలు మార్గాలు దశలవారీగా అందుబాటులోకి వస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో 200 కిలోమీటర్లకు పైగా మెట్రో మార్గం అందుబాటులో ఉండగా.. తర్వాత 56 కి.మీ మెట్రో మార్గంతో మన గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం రెండోస్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఎల్బీనగర్‌–మియాపూర్‌(29 కి.మీ), నాగోల్‌–హైటెక్‌సిటీ(27 కి.మీ) రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తుండగా ఈ మార్గాల్లో నిత్యం 2 లక్షల మంది జర్నీ చేస్తున్నారు. నగరంలో 2017 నవంబర్‌ 28న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ రూట్లో మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. గతేడాదిలో ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ రూట్లో మెట్రో అందుబాటులోకి వచ్చింది.

తాజాగా బుధవారం నుంచి అమీర్‌పేట్‌–హైటెక్‌సిటీ రూట్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో ఎంజీబీఎస్‌–జేబీఎస్‌(10 కి.మీ) మార్గంలో కూడా మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని, వచ్చేఏడాదిలో ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా మెట్రో మార్గం అందుబాటులోకి వస్తుందని మెట్రో అధికారులు చెబుతున్నారు. అన్ని మార్గాలు అందుబాటులోకి వస్తే నగరంలో నిత్యం 15 లక్షల మంది మెట్రోలో జర్నీ చేసి ట్రాఫిక్‌ ఇక్కట్ల నుంచి నుంచి విముక్తి పొందుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, మెట్రో రెండోదశ మార్గంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్‌ సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నగరంలో మెట్రో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు కోటిన్నర మందికి పైగా జర్నీ చేశారు. ట్రాఫిక్‌ ఝాంజాటం, కాలుష్యం ఊసు లేకుండా మెట్రో జర్నీపై సిటీజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మెట్రో స్టేషన్ల వద్ద పార్కింగ్‌ వసతుల లేమి ప్రయాణికులకు శాపంగా పరిణమిస్తోంది.

నగర మెట్రో మైలురాళ్లు ఇవీ..  
1. హైదరాబాద్‌ మెట్రో రైలు లిమిటెడ్‌ ప్రారంభం    మే 14, 2007
2. ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మైటాస్‌తో నిర్మాణ ఒప్పందం కుదిరింది సెప్టెంబర్‌ 19, 2008
3. మైటాస్‌తో నిర్మాణ ఒప్పందం రద్దు జూలై 7, 2009
4. రెండోమారు ఆర్థిక బిడ్లు తెరిచింది జూలై 14, 2010
5. ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌తో నిర్మాణ ఒప్పందం కుదిరింది సెప్టెంబర్‌ 4, 2010
6.మెట్రో డిపో నిర్మాణానికి ఉప్పల్‌లో 104 ఎకరాల కేటాయింపు జనవరి 2011
7. ఫైనాన్షియల్‌ క్లోజర్, కామన్‌ లోన్‌ అగ్రిమెంట్‌ కుదిరింది మార్చి 2011
8. హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ఏరియాకు సెంట్రల్‌ మెట్రో యాక్ట్‌ వర్తింపు జనవరి 2012
9. 104 ఎకరాల మియాపూర్‌ డిపోల్యాండ్‌ను ఎల్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్‌కు కేటాయింపు మార్చి 2012
10. మెట్రో గ్రౌండ్‌ వర్క్స్‌ ప్రారంభం ఏప్రిల్‌ 26, 2012
11. కియోలిస్‌ సంస్థకు మెట్రో రైళ్ల నిర్వహణకు కాంట్రాక్టు కేటాయింపు మే 2012
12. మెట్రోకు రాయదుర్గంలో 15 ఎకరాల స్థలం కేటాయింపు ఆగస్టు 2012
13. కుత్బుల్లాపూర్‌ కాస్టింగ్‌ యార్డులో 62 ఎకరాల హెచ్‌ఎంటీ స్థల లీజు సెప్టెంబర్‌ 2012
14. బోగీల తయారీకి హ్యుదాయ్‌ రోటెమ్‌ కంపెనీతో ఒప్పందం సెప్టెంబరు 2012
15. మెట్రో రైలు పనుల ప్రారంభం     నవంబర్‌ 25, 2012
16. కేంద్ర ప్రభుత్వం నుంచి సర్దుబాటు నిధి రూ.1,458 కోట్ల విడుదలకు ఆమోదం మే 2013
17. హైదరాబాద్‌ మెట్రో మూడు కారిడార్ల ఏర్పాటుకునోటిఫికేషన్‌ విడుదల చేసింది సెప్టెంబర్‌ 2014
18. రైల్వే బోర్డు నుంచి హెచ్‌ఎంఆర్‌కు సిగ్నలింగ్‌ టెలికం సిస్టంకుఅనుమతి జనవరి 20, 2015
19. వేలీవ్‌ చార్జీలు లేకుండా మెట్రో రైలు ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణానికిరైల్వేశాఖ అనుమతి జనవరి 23, 2015
20. మెట్రో కారిడార్‌–3 స్టేజ్‌–1కు ఆర్‌డీఎస్‌ఓ సంస్థ నుంచి స్పీడ్‌ సర్టిఫికెట్‌ మే 8, 2015
21. నాగోల్‌– మెట్టుగూడ (8కి.మీ)కు సీఎంఆర్‌ఎస్‌ ధ్రువీకరణ జారీ ఏప్రిల్‌ 20, 2016
22. మెట్రోకు ప్రత్యేక విద్యుత్‌ టారిఫ్‌ను వర్తింపజేస్తూ ప్రభుత్వ నిర్ణయం ఏప్రిల్‌ 27, 2016
23. ఆర్‌డీఎస్‌ఓ నుంచి 80 కి.మీ వేగంతో మెట్రో రైళ్లు దూసుకెళ్లేందుకు అనుమతి జూన్‌ 17, 2016
24. మియాపూర్‌–ఎస్‌ఆర్‌నగర్‌ మార్గంలోప్రయాణికుల రాకపోకలకు సీఎంఆర్‌ఎస్‌ అనుమతి ఆగస్ట్‌ 16, 2016
25. మెట్రో ప్రాజెక్టును 2018 నవంబర్‌ 30 నాటికి పూర్తికితెలంగాణ ప్రభుత్వ ఆదేశాల జారీ ఆగస్ట్‌ 16, 2016
26. హెచ్‌ఎంఆర్‌ ప్రాజెక్టుకు భద్రతను మంజూరు చేస్తూమున్సిపల్‌ శాఖ ఆదేశాలు ఆగస్ట్‌ 22, 2017
27. కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ నుంచి మెట్టుగూడ–అమీర్‌పేట్‌ మార్గానికిఅనుమతి నవంబర్‌ 20, 2017
28. నాగోల్‌–అమీర్‌పేట్, మియాపూర్‌–అమీర్‌పేట్‌ రూట్లోమెట్రో పరుగు ప్రారంభం నవంబర్‌ 28, 2017  
29. ఎల్బీనగర్‌–అమీర్‌పేట్‌ రూట్లో మెట్రో ప్రారంభం 2018

Advertisement
Advertisement