పనులు ఉరకలెత్తాలి

All Project Tracking In Project Harish Rao - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టు పనులను ఉరకలెత్తించి నిర్దిష్ట కాలంలో సంబంధిత ఆయకట్టుకు నీరందేలా చూడా లని అధికారులను నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్‌ పనులు, భూసేకరణ, పునరావాసం పనుల తీరును మంత్రి వీడియో సమావేశం ద్వారా గురువారం సమీక్షించారు.. మిడ్‌ మానేరు , ఛనాకా– కొరటా బ్యారేజి, కొమురంభీం ప్రాజెక్టు, గొల్ల వాగు, ర్యాలీ వాగు, నీలవాయి ప్రాజెక్టు, జగన్నాథపూర్, మత్తడి వాగు, సాత్నాల, స్వర్ణ, గడ్డన్న వాగు, ఎన్టీఆర్‌ సాగర్, వట్టి వాగు, పీపీ రావు, ప్రాజెక్టుల తీరును తెలుసుకొని హరీశ్‌ అధికారులకు సూచనలు చేశారు.

అక్టోబరు నాటికి ఛనాకా–కొరటా నీరు 
ఛనాకా– కొరటా ప్రాజెక్టులో ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్‌ నాటికి నీరు నింపి 13 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించేలా చేయాలని మంత్రి ఆదేశించారు. కొమురంభీం ప్రాజెక్టు కింద గత ఏడాది 20 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వగా, ఈ ఏడాది కనీసం అదనంగా మరో 5 వేల ఎకరాలకు ఇవ్వాలని, రైల్వే క్రాసింగ్‌ పనులను పూర్తి చేసి మరో 15 వేల ఎకరాలకు అందించాలన్నారు. ఈ ప్రాజెక్టు పరిధిలో ఇంకా 280 ఎకరాల భూసేకరణ పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌ను ఆదేశించారు. దీనికి రూ. పది కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. గొల్లవాగు ప్రాజెక్టులో ఫీల్డ్‌ ,చానల్స్, మిగిలిన చిన్న చిన్న పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. నీలవాయి ప్రాజెక్టు లో 8 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా ఖరీఫ్‌ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు.

జన్నాథపూర్‌ ప్రాజెక్టు బ్యారేజీ పనులు పూర్తయ్యయాని చెప్పారు. ఎన్టీ ఆర్‌ సాగర్‌ ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది అదనంగా మరో 3 వేల ఎకరాలకు నీరు ఇస్తామన్నారు. వట్టి వాగు ద్వారా ఈ ఏడాది 16 వేల ఎకరాలకు నీరు ఇచ్చేలా చూడాలన్నారు. దీని ఆధునీకరణకు రూ.26 కోట్లకు ప్రతిపాదనలు పంపాలని ఇంజనీర్లను ఆదేశించారు. డీపీ రావు ప్రాజెక్టు ఈ ఏడాది అదనంగా మరో 3,500 ఎకరాలకు నీరిస్తామని మంత్రి చెప్పారు.

మత్తడి వాగు ప్రాజెక్టు ద్వారా 1200 ఎకరాలకు నీరిచ్చే పనులపై కలెక్టర్‌ సమీక్ష జరిపి ఈ ఖరీఫ్‌కు పైలట్‌ ప్రాజెక్టును విజయవంతం చేయాలని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ దివ్యను కోరారు. లోయర్‌ పెన్‌ గంగకు గాను జూలై చివరికల్లా భూసేకరణ చేపట్టాలన్నారు. సాత్నాల ప్రాజెక్టు ద్వారా ఈ ఏడాది 6 వేల ఎకరాలకు నీరు ఇవ్వాలని ఆదేశించారు. గడ్డన్న వాగు ద్వారా 12వేల ఎకరాలకు నీరిస్తామని, మిగిలిన మరో 2 వేల ఎకరాలకు కాలువల ఆధునీకరణ ద్వారా నీరు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

మిడ్‌ మానేరు ద్వారా 76 వేల ఎకరాలకు నీరు 
మిడ్‌ మానేరు కింద 76వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ప్యాకేజీల వారీగా పనుల తీరును కాంట్రాక్టర్లతో ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నారు. మిడ్‌ మానేరు పునరావాస చర్యల కోసం రూ.33 కోట్లకు అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు. ఆర్థికశాఖతో మాట్లాడి ఈ ప్రక్రియను హరీశ్‌ వెంటనే పూర్తిచేయించారు. ఈ సమీక్షలో మంత్రి జోగు రామన్న, సాగు నీటి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్, ఈఎన్‌సీలు హరిరామ్, అనిల్‌ కుమార్, సీఈలు భగవంతరావు, శంకర్, వెంకటేశ్వర్లు ( క్వాలిటీ కంట్రోల్‌ ), సంబంధిత జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top