అందరూ ఆహ్వానితులే.. | Sakshi
Sakshi News home page

అందరూ ఆహ్వానితులే..

Published Fri, Dec 15 2017 1:55 AM

all are Welcome to the World Telugu Conferences - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ తెలుగు మహాసభలకు హైదరాబాద్‌ మహానగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు రవీంద్రభారతి, ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం, తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ సారస్వత పరిషత్తు తదితర వేదికలు తెలుగు వెలుగులతో జిగేల్‌ మంటున్నాయి. నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారులు రంగురంగుల విద్యుత్‌ దీపకాంతులతో తళుకులీనుతున్నాయి. శుక్రవారం ప్రారంభం కానున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నట్లు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణాచారి తెలిపారు.

గురువారం వారు ‘తెలంగాణ సాహిత్య వైభవం’పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సిధారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. ఐదు రోజుల తెలుగు పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, తెలుగు వారందరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటే సమున్నత లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ వేడుకలు భవిష్యత్‌ తరాలకు మార్గనిర్దేశం అవుతాయన్నారు. ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంను తెలుగుదనం ఉట్టిపడేలా కళాత్మకంగా, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా అలంకరించినట్లు చెప్పారు. ప్రాంగణానికి నలువైపులా ఎనిమిది ద్వారాల్లో ప్రముఖులకు, ప్రతినిధులకు, సాధారణ ప్రజలకు విడివిడిగా ఏర్పాట్లు ఉన్నాయన్నారు.

రవీంద్రభారతిలో కిట్ల పంపిణీ..
హైదరాబాద్‌కు చెందిన ప్రతినిధులకు గురువారం మహాసభల కిట్లను పంపిణీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఈ పంపిణీ కొనసాగనుంది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే అతిథులు, ప్రతినిధులకు హెచ్‌ఎండిఏ కమిషనర్‌ చిరంజీవులు నేతృత్వంలోని ప్రపంచ తెలుగు మహాసభల ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ, జూబ్లీ బస్‌ స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిట్లను అందజేస్తారు. ఇందుకోసం అన్ని చోట్లా ఆహ్వాన కమిటీ ప్రతినిధులు ప్రత్యేకంగా విధులు నిర్వహిస్తున్నట్లు సిధారెడ్డి తెలిపారు. ఇప్పటికే పలు దేశాలు, రాష్ట్రాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నారని, వారందరినీ ఆహ్వాన కమిటీ సాదరంగా ఆహ్వానించి వారి బస కేంద్రాలకు తోడ్కొని వెళుతోందని చెప్పారు.

సుమారు 6,000 మంది ప్రతినిధులకు వివిధ హోటళ్లలో బస ఏర్పాట్లు చేశారు. భోజనం, వసతి అన్నీ అక్కడే ఉంటాయి. మహాసభలకు వెళ్లేందుకు, తిరిగి వారిని హోటళ్లకు తీసుకెళ్లేందుకు రవాణా శాఖ వాహనాలను ఏర్పాటు చేసింది. ఇందుకు 150 బస్సులను సిద్ధంగా ఉంచారు. అలాగే ఎల్బీ స్టేడియం వద్ద 60 ఆహార విక్రయ శాలలు, 25 పుస్తక ప్రదర్శన శాలలు సిద్ధమయ్యాయని చెప్పారు. మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట్, వరంగల్, జనగామ తదితర సమీప జిల్లాలకు చెందిన ప్రతినిధులు కిట్ల కోసం రవీంద్రభారతికి రావలసిన అవసరం లేదని సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నర్సింహారెడ్డి తెలిపారు. వారికి బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశామన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement