మోత ఆగింది...

Alcohol Seized Excise Department Mahabubnagar - Sakshi

జడ్చర్ల టౌన్‌ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత గ్రామాల్లో పోలింగ్‌ నిర్వహణకు సమయం వచ్చేసింది. జిల్లాలోని 719 గ్రామపంచాయతీలకు గాను రెండో విడతలో 245 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే, ఇందులో రెండింటి పాలకవర్గాలకు ఇంకా గడువు ఉండడంతో 243 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్‌ విడుదల చేశారు. కాగా, ఈ జీపీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే వరకు 58 ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 185 పంచాయతీల్లో శుక్రవారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అభ్యర్థుల ప్రచారానికి బుధవారం సాయంత్రంతో గడువు ముగియగా.. ప్రజలను నేరుగా కలుస్తూ వారిని ఆకట్టుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నయ్యారు. ఇందుకోసం మద్యం, మాంసం పంపిణీకి తెర తీసినట్లు తెలుస్తోంది. ఎన్నికలు జరగనున్న జీపీల్లో బుధవారం సాయంత్రం నుంచే మద్యం దుకాణాలను మూసివేశారు. కానీ ఇప్పటికే అభ్యర్థులు తాము ప్రజలకు అందజేసేందుకు కావాల్సిన మద్యాన్ని గ్రామాల్లోకి చేరవేసినట్లు సమాచారం.

మేమున్నాం... 
ఎన్నికల సందర్భంగా ఎలాంటి జంకు లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని జడ్చర్ల సీఐ బాల్‌రాజ్‌ ఆధ్వర్యంలో జడ్చర్ల మండలంలోని పోలేపల్లి, ఉదండాపూర్, వల్లూరు గ్రామాల్లో బుధవారం పోలీసు కవాతు నిర్వహించారు. పోలీసు సిబ్బందితో ఆయన ఆయా గ్రామాల్లో కవాతు నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని ప్రజలను కోరారు.

జడ్చర్లలో మద్యం స్వాధీనం 
జడ్చర్ల మండలం గంగాపూర్‌ సమీపంలో స్పెషల్‌ పార్టీ అధికారి చంద్రకాంత్‌ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్చర్ల నుంచి వాహనంలో తరలిస్తున్న రూ.57వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. జడ్చర్ల నుంచి ఇతర ప్రాంతాలకు రెండు వాహనాల్లో తరలిస్తున్న ఐదు కాటన్ల బీర్లు, 12కాటన్ల లిక్కర్‌ను వారు స్వాధీనం చేసుకుని జడ్చర్ల ఎక్సైజ్‌ అధికారులకు అప్పగించారు. కాగా, ఈ మద్యాన్ని అమ్మపల్లి, కోడ్గల్‌ గ్రామాలకు చెందిన అభ్యర్థుల కోసం చేరవేస్తున్నట్లు సమాచారం.

ఏడు మండలాల్లో
గ్రామపంచాయతీ ఎన్నికలు రెండో విడతగా జిల్లాలోని ఏడు మండలాల్లో జరగనున్నాయి. మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్, జడ్చర్ల, నవాబుపేట, మహబూబ్‌నగర్‌ రూరల్‌తో పాటు హన్వాడ మండలాల్లోని 243 పంచాయతీలు, 2,068 వార్డులో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఈ విడతలో 58 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగతా 185 పంచాయతీల్లో మాత్రమే పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఏకగ్రీవ పంచాయతీలివే... 
రెండో విడత ఎన్నికలు ఏడు జరగనున్న మండలాల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల వివరాలిలా ఉన్నాయి. మిడ్జిల్‌ మండలంలో 24 పంచాయతీలకు గాను చిల్వేర్, మసిగొండ్లపల్లి, కొత్తపల్లి, మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలంలో 26 జీపీలకు లాల్యానాయక్‌ తండా, తెలుగుగూడెం, ఓబ్లాయిపల్లి తండా, రేగడిగడ్డ తండా, బొక్కలోనిపల్లి జీపీలు, రాజాపూర్‌ మండలంలో 24 జీపీలకు ఖానాపూర్, పలుగుగుట్ట తండా, బోడగుట్ట తండా, కొర్ర తండా, బీబీనగర్, రాఘవాపూర్‌ జీపీలు, హన్వాడ మండలంలో 35 జీపీలకు నాయినోనిపల్లి, వెంకటమ్మ కుంట తండా, అత్యకుంట తండా, నాగంబాయి తండా, కిష్టంపల్లి, కొనగట్టుపల్లి, రామునాయక్‌తండా జీపీలు, జడ్చర్ల మండలంలో ఎన్నికలు జరగాల్సిన 43 జీపీలకు కొత్తతండా, ఖానాపూర్, గోప్లాపూర్, చిట్టెబోయినపల్లి, చిన్నపల్లి, మాటుబండ తండా, ఈర్లపల్లి, నసురుల్లాబాద్‌ జీపీలు ఏకగ్రీవమయ్యాయి.

ఇక బాలానగర్‌ మండలంలో 37 జీపీలకు అప్పాజిపల్లి, బిల్డింగ్‌ తండా, పల్గుమీది తండా, గౌతాపూర్, నామ్యాతండా, జీడి గుట్ట తండా, ఈదమ్మగడ్డ తండా, నేరళ్లపల్లి, ఏడుగుట్టల తండా, మొదంపల్లి జీపీలు, నవాబుపేట మండలంలోని 54 జీపీలకు గాను కాకర్‌జాల్, చెన్నారెడ్డిపల్లి, తిమ్మయ్యపల్లి, కారూర్, వెంకటేశ్వర తండా, కేశవరావుపల్లి, మల్లారెడ్డిపల్లి, కోళ్లగుట్ట తండా, ఇప్పటూర్, ఆర్‌సీ.పూర్, బట్టోనిపల్లి తండా, పల్లెగడ్డ, పుట్టోనిపల్లి తండా, లింగన్నపల్లి,  కొత్తపల్లి తండా, లోకిరేవు, మెట్టుగడ్డ తండా, పుర్సంపల్లి, నీర్‌సాబ్‌ తండా పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవంగా కొలువుదీరాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top