భగ్గుమన్న ‘బాసర’ విద్యార్థులు

Agitation By Students In Basar IIIT - Sakshi

ఆందోళనలతో అట్టుడికిన ఐటీ క్యాంపస్‌

సెలవులిచ్చి.. మెస్‌లను మూసిన అధికారులు

తిండిలేక సొమ్మసిల్లి  పడిపోయిన విద్యార్థులు

పలు డిమాండ్లను ఒప్పుకున్న వీసీ

నిర్మల్‌: తమ సమస్యల పరిష్కారం కోసం బాసరలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన రెండోరోజూ కొనసాగింది. ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న ‘ట్రబుల్స్‌’పై ట్రిపుల్‌ ఐటీయన్లు గళమెత్తారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఉదయం నుంచి మంగళవారం రాత్రి వరకు ఆందోళనలు నిర్వహించారు. దీంతో అధికారులు సోమ వారం రాత్రి నిరవధిక సెలవులు ప్రకటించి, మెస్‌లను మూసివేశారు. అయినా విద్యార్థులు ఇళ్లకు వెళ్లకుండా మంగళవారం అక్కడే బైఠాయించారు. గవర్నర్‌ నరసింహన్, ఐటీ మంత్రి కేటీఆర్‌ వచ్చేంత వరకు కదిలేది లేదని భీష్మిం చు కొని కూర్చున్నారు. చివరకు విద్యార్థుల పలు డిమాండ్లకు ఇన్‌చార్జి వీసీ అశోక్‌ ఒప్పుకున్నా వారు సంతృప్తి చెందలేదు.  

సొమ్మసిల్లిన విద్యార్థులు 
అధికారులు సెలవులు ప్రకటించడంపై విద్యార్థులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ తర్వాత కళాశాలతో పాటు మెస్‌లను మూసి వేసినా ఇళ్లకు వెళ్లకుండా రోజంతా ఎండలోనే బైఠాయించారు. పలుమార్లు ఇన్‌చార్జి వీసీ అశోక్‌ సంప్రదింపులు జరిపినా విద్యార్థులు స్పందించలేదు. ఎండలో తిండి లేకుండా ఉండటంతో చాలామంది విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని అప్పటికప్పుడు తోటి విద్యార్థులే గదుల్లోకి తీసుకెళ్లి సపర్యలు చేశారు. ఇంత జరిగినా అధికారులు మెస్‌లను తెరవకపోవడం, తమకు భోజనం అందించకపోవడంతో విద్యార్థులు మరింత ఆగ్రహించారు. స్థానిక పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం రాత్రి పలువురు విద్యార్థులు ఇంటిబాట పట్టారు. 

ట్విట్టర్‌ ద్వారా కేటీఆర్‌ దృష్టికి.. 
తమ సమస్యలపై ఆర్జీయూకేటీ విద్యార్థులు నేరుగా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారా వినతులను పంపించారు. దీనికి స్పందించిన  కేటీఆర్‌ సోమవారం రాత్రి వీసీతో మాట్లాడి, తన వద్దకు విద్యార్థుల బృందాన్ని పంపాలని, వారి తో మాట్లాడి పరిష్కరిస్తానని సూచించినట్లు తెలిసింది.  

సమస్యల పరిష్కారానికి కృషి: ఈటల  
జమ్మికుంట: కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వస్తున్న మంత్రి ఈటల రాజేందర్‌ను మోత్కులగూడెం చౌరస్తా వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు కలిశారు. బాసర ట్రిపుల్‌ ఐటీలో తమ పిల్లలకు తాగునీరు లేక అలమటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈటల హామీ ఇచ్చారు.  

రాత్రి మెస్‌లు తెరిచిన అధికారులు
బాసర: విద్యార్థుల ఆందోళనతో మంగళవారం రాత్రి మెస్‌లు తెరిపించారు. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ అనంతరం వెళ్లిపోవాలని సూచించారు. సెలవులు ఎప్పటి వరకు అన్నది త్వరలో ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top