‘విద్యుత్‌’ విభజనపై మళ్లీ ‘సుప్రీం’కు! 

Again to Supreme Court For Division of power employees - Sakshi

జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ మార్గదర్శకాలపై సమీక్ష కోరనున్న తెలంగాణ 

విభజన కోసం ఉద్యోగులందరినీ పరిగణనలోకి తీసుకోనున్న కమిటీ 

రిలీవ్‌ చేసిన ఉద్యోగులనే విభజించాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్‌ ఉద్యోగుల విభజనపై తాజాగా జస్టిస్‌ డీఎం ధర్మాధికారి ఏకసభ్య కమిటీ జారీ చేసిన మార్గదర్శకాల్లోని కొన్ని అంశాలను పునః సమీక్షించాలని సుప్రీంకోర్టును కోరనుంది. ‘ఉమ్మడి ఏపీ విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల్లో కేటాయింపులు చేయదగినవారందరినీ ఏపీ, తెలంగాణకు జరిపే తుది కేటాయింపుల కోసం పరిగణనలోకి తీసుకోవాలి. తెలంగాణ నుంచి ఏకపక్షంగా రిలీవ్‌ అయిన 1,157 మందితోపాటు తెలంగాణలో ఏకపక్షంగా చేరిన 514 మంది ఉద్యోగులు సైతం పరిగణనలోకి వస్తారు. రాష్ట్ర విభజన జరిగిన తేదీన ఉద్యోగులు ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి కేటాయింపులు జరపాలి’’ అనే నిబంధనపై పునః సమీక్ష కోరాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ నిబంధన అమలు చేయాల్సివస్తే రాష్ట్ర కేడర్‌తోపాటు విద్యుత్‌ సంస్థల ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ మళ్లీ విభజించక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. ఏపీకి రిలీవ్‌ చేసిన 1,157 మంది ఉద్యోగులతోపాటు తెలంగాణలో చేరిన 514 మంది ఉద్యోగులను మాత్రమే పరిగణనలోకి తీసుకుని విభజన ప్రక్రియను పూర్తి చేసేలా అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరనుంది. తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు శనివారం సమావేశమై ఈ మేరకు తీర్మానించాయి.  

తెలంగాణకు నష్టమే ! 
జస్టిస్‌ ధర్మాధికారి మార్గదర్శకాలతో తెలంగాణకు నష్టం జరగనుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏపీ, తెలంగాణ మధ్య ఏర్పడిన విద్యుత్‌ ఉద్యోగుల విభజన వివాద పరిష్కారానికి రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ధర్మాధికారి నేతృత్వంలో సుప్రీంకోర్టు గతేడాది ఏకసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఉద్యోగుల విభజనపై తాజాగా ఈ కమిటీ జారీ చేసిన మార్గదర్శకాలపట్ల తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. విద్యుత్‌ ఉద్యోగులను సాధ్యమైనంత వరకు వారి ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుని, వారి సొంత జిల్లాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో ఆ రాష్ట్రానికే సర్దుబాటు చేయాలని పెట్టిన నిబంధన వల్ల తెలంగాణకు నష్టం జరగనుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏపీకి రిలీవ్‌ చేసిన 1,157 మంది ఉద్యోగుల్లో 621 మంది మాత్రమే సొంత రాష్ట్రం ఏపీకి వెళ్లడానికి ఆప్షన్‌ ఇచ్చారు. మిగిలిన 500 మందికి పైగా ఏపీ స్థానికత గల ఉద్యోగులు తెలంగాణ వైపే మొగ్గు చూపారు. వీరందరినీ మళ్లీ తెలంగాణకే కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలంగాణ విద్యుత్‌ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ధర్మాధికారి కమిటీ సూచించిన విధంగా, జిల్లాల స్థానికతను ప్రామాణికంగా తీసుకుని విభజన జరిపితే మరి కొంతమంది తెలంగాణకు వచ్చే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన సమయానికి మంజూరైన పోస్టులసంఖ్య విద్యుత్‌ ఉద్యోగుల కేటాయింపులకు సరిపోకపోతే, మిగులు ఉద్యోగులను తెలంగాణకే కేటాయించాల్సిన పరిస్థితి రావచ్చని ఓ సీనియర్‌ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top