ఆఫ్టర్‌ టెన్‌ ఇయర్స్‌..మనమూ రిచెస్ట్‌

After Ten Years Hyderabad Becomes Richest City - Sakshi

న్యూ వరల్డ్‌ వెల్త్‌ రిపోర్ట్‌ను వెల్లడించిన నైట్‌ఫ్రాంక్‌

రాబోయే పదేళ్లలో సంపన్న నగరం జాబితాలో భాగ్యనగరం

ప్రపంచ సంపన్న నగరంగా న్యూయార్క్‌

మరో దశాబ్ద కాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ అత్యంత సంపన్న నగరంగా అవతరించనుంది. అంతేకాదు విశ్వవ్యాప్తంగా సంపన్న నగరాల జాబితాలో ర్యాంక్‌ సాధించి గ్రేటర్‌ సిటీ బాద్‌షా కానుందని నైట్‌ఫ్రాంక్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన న్యూ వరల్డ్‌ వెల్త్‌ రిపోర్ట్‌లో వెల్లడించింది. దేశంలో ఫార్మా రాజధానిగా భాసిల్లుతున్న హైదరాబాద్‌లో ఐటీ, బీపీఓ, రియల్టీ రంగాలు శరవేగంగా పురోగమిస్తుండటంతో పలు దిగ్గజ కంపెనీలు, బహుళ జాతి సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నట్లు ఈ నివేదికలో వెల్లడించింది.

కాగా, ప్రపంచ సంపన్న నగరాల జాబితాలో అమెరికాలోని న్యూయార్క్‌ 3 ట్రిలియన్‌ డాలర్ల సంపదతో అగ్రభాగాన నిలవగా.. మన దేశ వాణిజ్య రాజధాని ముంబై 0.96 ట్రిలియన్‌ డాలర్ల సంపదతో 12వ ర్యాంక్‌ సాధించడం విశేషం. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన ఢిల్లీ, బెంగళూరు సైతం రాబోయే పదేళ్లలో సంపన్న నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయమని ఈ నివేదిక తెలిపింది. సుమారు 90 దేశాల్లోని 100 నగరాల్లో వ్యాపార, వాణిజ్య, పెట్టుబడులు తదితర అంశాలను అధ్యయనం చేసి టాప్‌–20 సంపన్న నగరాల జాబితాను ఈ నివేదిక ప్రకటించింది. 
– సాక్షి, హైదరాబాద్‌

హైదరా‘బాద్‌షా’ఇలా... 
హైదరాబాద్‌ రాబోయే పదేళ్లలో సంపన్న నగరాల జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయమని ఈ నివేదిక అంచనా వేసింది. బల్క్‌ డ్రగ్, ఫార్మా, ఐటీ, బీపీఓ ఎగుమతులు, రియల్‌ ఎస్టేట్, నిర్మాణ రంగాలు హైదరాబాద్‌ నగరానికి ఆర్థిక రంగంలో చోదక శక్తులుగా నిలవనున్నాయని ఈ నివేదిక పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో 2.07 బి. డాలర్ల మేర ఫార్మా ఎగుమతు ఉండటం విశేషమని పేర్కొంది.

ఐటీ ప్రగతి ఇలా...
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐసీటీ, హార్డ్‌వేర్‌ పాలసీలతోపాటు ఇమేజ్, ఇన్నోవేషన్, డ్రోన్‌ పాలసీ, సైబర్‌ సెక్యూరిటీ పాలసీలు ఐటీ రంగ వృద్ధికి దోహదం చేస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా తెలంగాణ ఐటీ ఎగుమతులు గతేడాది రూ.1.09 లక్షల కోట్ల మేర ఉన్నాయని తెలిపాయి. కాగా గ్రేటర్‌ కేంద్రంగా పలు దిగ్గజ సంస్థలకు చెందిన 647 ఐటీ కంపెనీల బ్రాంచీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 

టాప్‌–5 సంపన్ననగరాలివే..
1.న్యూయార్క్‌(3 ట్రి.డా.)  
2.టోక్యో(2.50 ట్రి.డా.) 
3.శాన్‌ఫ్రాన్సిస్‌కో(2.40 ట్రి.డా.) 
4.లండన్‌(2.40 ట్రి.డా.) 
5.బీజింగ్‌(2.10 ట్రి.డా.)(సంపద ట్రిలియన్‌ డాలర్లలో)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top