కల్తీ...మాయ..!

Adulteration Oil Food Distribution Nalgonda - Sakshi

 ‘‘జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌ రోడ్డులోని ఓ దుకాణంలో సరిగ్గా ఏడు నెలల క్రితం కల్తీ నూనె విక్రయాలు జరుపుతుండగా వినియోగదారులు జిల్లా అధికారులకు ఫిర్యాదుచేశారు. దీంతో సదరు అధికారులు దుకాణంపై దాడులు చేయగా కల్తీ నూనె విక్రయాలు బట్టబయలు అయింది. అంతటితో ఆగకుండా వినియోగదారులు పెద్ద ఎత్తున ఆ దుకాణం వద్ద ధర్నాకు దిగారు. అయినా జిల్లాలో నేటికీ కల్తీ నూనె విక్రయాలు ఆగలేదు.’’   

సూర్యాపేట : జిల్లాలో కల్తీ మంచినూనె వ్యాపారం జోరుగా సాగుతోంది. జిల్లా కేంద్రమైన సూర్యాపేటతో పాటు కోదాడ, హుజూర్‌నగర్, తుంగతుర్తి, తిరుమలగిరి, నేరేడుచర్ల ప్రాంతాల్లోనూ ఈ వ్యాపారం సాగుతున్నట్లు సమాచారం. నూనె కల్తీ చేసి మార్కెట్‌లో విక్రయిస్తూ సదరు వ్యాపారులు రూ.కోట్లు గడిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఐఎస్‌ఐ మార్క్‌ లేకుండానే స్థానికంగా వివిధ వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన కల్తీ నూనెను మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న బ్రాండ్ల పేరిట విక్రయిస్తున్నారు. బ్రాండెడ్‌ లోగోతో గుర్తించలేనంతగా చిన్న మార్పు చేస్తున్నారు. బ్రాండెడ్‌ పేరిట వాటిని అమ్ముతున్నారు.

సదరు వ్యాపారులు గ్రామీణ ప్రాంతాల మార్కెట్‌పై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. దీనికి తోడు ఐదు లీటర్ల క్యాన్‌కు అదనంగా వివిధ ఆఫర్లను ప్రకటించి ప్రజలకు అంటగడుతున్నారు. కోదాడ, హుజూర్‌నగర్, తిరుమలగిరి, తుంగతుర్తి, నేరేడుచర్లతో పాటు సూర్యాపేట కూరగాయల మార్కెట్‌ రోడ్డు, రైతుబజార్‌ మార్కెట్‌లోని అంబేద్కర్‌ విగ్రహం సమీపంలో, ఎంజీ రోడ్డులో ఎక్కువగా ఇలాంటి విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ ప్రాంతాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వలసవచ్చి తాత్కాలికంగా నివసించే కార్మికులు అధికంగా ఉంటారు. తక్కువ ధరలో ఆకర్షణీయమైన ప్యాకెట్లతో నూనె దొరుకుతుందని సదరు కార్మికులు, ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా తమ ఆరోగ్యాలను దెబ్బతీసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. 

తూకంలో మోసాన్ని అరికడతాం.. 
మంచినూనె డబ్బాలు, ప్యాకెట్ల తూనికల్లో ఏమైనా తేడాలు , మోసం ఉంటే చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు పర్యవేక్షిస్తాం. తూకంలో జరిగే మోసాలపై వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదు. కల్తీ జరిగినట్లు మాకు ఫిర్యాదులొస్తే చర్యలుతీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, తూనికలుకొలతల అధికారి, సూర్యాపేట

కల్తీ నూనెలతో కేన్సర్‌ 
కల్తీ నూనెలతో గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. జంతు కళేబరాలతో ఆయిల్‌ తయారు కావడంతో కేన్సర్‌ సోకే ప్రమాదం ఉంది. ఈ నూనెతో అతి రోస్కిమరోíనిస్‌ అనే పదార్థం ఉండడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఐఎస్‌ఐ మార్కు ఉన్న నూనెలనే వాడాలి.– డాక్టర్‌ వూర రాంమూర్తియాదవ్, సూర్యాపేట

క్రిమినల్‌ కేసులు తప్పవు 
బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో కల్తీ నూనెలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇప్పటికే జిల్లాలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో కేసులు నమోదుచేశాం. కల్తీ నూనెల వల్ల పేద ప్రజలు అనారోగ్యాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కల్తీ నూనెలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులతో పాటు జైలుకు పంపించి, భారీ జరిమానా విధిస్తాం.  – తారాసింగ్, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్, సూర్యాపేట

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top