పీహెచ్‌సీకి జిల్లాస్థాయిలో ప్రశంస | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీకి జిల్లాస్థాయిలో ప్రశంస

Published Thu, Jul 12 2018 8:58 AM

Admiration To The PHC - Sakshi

బొంరాస్‌పేట: మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) సేవలకు జిల్లా స్థాయిలో ఉత్తమ పీహెచ్‌సీగా గుర్తింపు అభించింది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీఎంఅండ్‌హెచ్‌ఓల సమక్షంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ రవీంద్రయాదవ్‌ బుధవారం ప్రశంసలు అందుకున్నారు. స్థానిక పీహెచ్‌సీలో పెరిగిన కాన్పులు, ఓపీలకు అందించిన సేవల విషయంలో ప్రగతి సాధించినందుకుగానూ జిల్లా అధికారుల అభినందనలు లభించాయని డాక్టర్‌ రవీంద్ర చెప్పారు.

మండల వైద్య ఆరోగ్య సిబ్బంది, మండల ప్రజల సహకారంతో పీహెచ్‌సీ గుర్తింపు దక్కిందన్నారు. మెరుగైన సేవలు కొనసాగిస్తూ మండలానికి ప్రత్యేకను తెచ్చేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈమేరకు ఎంపీడీఓ హరినందనరావు తదితర మండలస్థాయి అధికారులు అభినందనలు తెలియజేశారు.

జిల్లా ఉత్తమ పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌గా నర్సిములు

మర్పల్లి: జిల్లా కలెక్టర్‌ సమక్షంలో జిల్లా వైద్యాధికారి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ సూపర్‌వైజర్‌గా ప్రశంస పత్రం అందుకోవడం సంతోషంగా ఉందని పట్లూర్‌ పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌ నర్సిములు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవంను పురస్కరించుకొని జిల్లాలో జనాభా నియంత్రణ కోసం అత్యుత్తమ సేవలు అందించిన వైద్యశాఖ సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్, జిల్లా వైద్యాధికారి దశరథ్‌ పలువురికి ఆవార్డులు, ప్రశంస పత్రాలు అందజేశారు.

ఈ క్రమంలో పట్లూర్‌ పీహెచ్‌సీ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న నర్సిములుకు బుధవారం కలెక్టర్‌ సమక్షంలో ఆవార్డుతో పాటు ప్రశంసపత్రం అందజేసినట్లు నర్సిములు తెలిపారు. ఈ అవార్డుతో తనపై మరింత పనిభారం పెరగనుందని ఆయన అన్నారు. ఆవార్డు, ప్రశంస పత్రం అందజేసిన జిల్లా కలెక్టర్‌కు, జిల్లా వైద్యాధికారి దశరథ్‌కు నర్సిములు కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement
Advertisement