బీసీలకు 94 ఎంపీపీలు!

94 MPPs to BCs - Sakshi

కొలిక్కి వచ్చిన మండల పరిషత్‌ల లెక్కలు

నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాల్లో ఎస్సీలకు 98, ఎస్టీలకు 59 స్థానాలు

షెడ్యూల్డ్‌ మండలాల్లో 16, నాన్‌ షెడ్యూల్డ్‌ మండలాల్లో 30 ఎస్టీ మహిళలకే రిజర్వ్‌

ఎస్సీ మహిళలకు 49,బీసీ మహిళలకు 47 ఎంపీపీల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మండల ప్రజాపరిషత్‌ (ఎంపీపీ)ల రిజర్వేషన్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. మొత్తం 32 జిల్లా ప్రజాపరిషత్‌ల పరిధిలోని 535 మండల ప్రజాపరిషత్‌ (రాష్ట్రంలోని గ్రామీణ రెవెన్యూ మండలాలు)లలో 33 మండలాలు షెడ్యూల్డ్‌ ఏరియాల్లో ఉన్నాయి. మిగతా నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లోని 502 మండలాల్లో 50 శాతం అంటే 251 మండలాల్లోని ఎంపీపీ స్థానాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వాటిలో ఎస్టీలకు 59 రిజర్వ్‌కాగా, ఎస్సీలకు 98, బీసీలకు 94 రిజర్వ్‌ అయ్యాయి. ఈ కేటగిరిలన్నింటిలోనూ మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వ్‌ చేశారు. మిగతా 251 అన్‌ రిజర్వ్‌డ్‌గా పరిగణిస్తుండగా అందులోనూ మహిళలకు 50 శాతం ఎంపీపీ స్థానాలు రిజర్వ్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ విధంగా ఈ కేటగిరీలో మహిళలకు 125, పురుషులు/మహిళలు పోటీపడే విధంగా 126 ఎంపీపీ స్థానాలు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని వివిధ మండలాలవారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన ఈ వర్గాల ఎంపీపీ స్థానాలు రిజర్వ్‌ చేశాక ఓటర్ల జాబితా ఆధారంగా బీసీలకు ఎంపీపీ స్థానాలు కేటాయించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్డు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 32 జిల్లాల్లోని మండలాలవారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు సందర్భంగా ఈ లెక్కలు తేలాయి. ఈ మేరకు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ నీతూ కుమారీ ప్రసాద్‌ ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్లను ఖరారు చేశారు. 

మహిళలకు 267 ఎంపీపీ స్థానాలు రిజర్వ్‌ 
అన్ని కేటగిరిల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించాలన్న నిబంధన నేపథ్యంలో వివిధ ఎంపీపీల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు సంబంధించి మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. షెడ్యూల్డ్, నాన్‌ షెడ్యూల్డ్‌ ప్రాంతాలు కలుపుకుని ఎస్టీ, ఎస్సీ, బీసీలకు సంబంధించి మొత్తం 142 స్థానాలు మహిళలకు రిజర్వ్‌ చేశారు. షెడ్యూల్డ్‌ ఏరియాల మండలాల్లోని ఎంపీపీల్లో మహిళలకు 16, నాన్‌ షెడ్యూల్డ్‌ మండలాల్లో 30 ఎంపీపీలు ఎస్టీ మహిళలకు, 49 ఎస్సీ మహిళలకు, 47 బీసీ మహిళలకు ఎంపీపీ అధ్యక్ష స్థానాలు రిజర్వయ్యాయి. అంతేకాకుండా అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో 125 ఎంపీపీ స్థానాలు మహిళలకు కేటాయించారు. మొత్తం కలిపి మహిళలకు 267 ఎంపీపీ అధ్యక్ష స్థానాలు ఖరారయ్యాయి. ఇవే కాకుండా మిగతా అన్‌ రిజర్వ్‌డ్‌ ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లోనూ పురుషులతో మహిళలు పోటీ పడే అవకాశాలున్నాయి.

పునర్విభజనతో మారిన పలు మండలాల లెక్కలు... 
జిల్లా, మండల పరిషత్‌ల పునర్విభజన సందర్భంగా షెడ్యూల్డ్‌ మండలాలుగా ఉన్న బయ్యారం, గార్ల, గంగారంలను సరిగ్గా లెక్కించ లేదు. తాజాగా దాన్ని సరిచేయడంతో వాటిని షెడ్యూల్డ్‌ మండలాల జాబితాలో చేర్చారు. గతంలో జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో చేర్చడంతో జనగామ జిల్లా నుంచి ఆ మండలాన్ని మినహాయిం చారు. దీంతో ఆ జిల్లాలో మండలాల సంఖ్య 12కు తగ్గింది. కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో బీసీలకు మరో ఎంపీపీ స్థానాన్ని అదనంగా కేటాయించారు. ఆ మేరకు ఆ జిల్లాలో అన్‌ రిజర్వ్‌డ్‌ కేటగిరీలో ఒక స్థానం తగ్గింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ రిజర్వేషన్లలో మార్పుల కారణంగా మహిళా రిజర్వేషన్లలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో చోటుచేసుకున్న మార్పుల గురించి పీఆర్‌ కమిషనర్‌ తెలియజేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top