దేవుడి భూమిపై బడా నేత కన్ను! | political leader trying to kabza temple land | Sakshi
Sakshi News home page

దేవుడి భూమిపై బడా నేత కన్ను!

Sep 26 2017 2:02 AM | Updated on Sep 17 2018 5:10 PM

సాక్షి, హైదరాబాద్‌: అది దేవాదాయశాఖ పరిధిలో ఉన్న మఠం.. సికింద్రాబాద్‌ ఆర్పీ రోడ్డులో ఉన్న ఈ మఠానికి అనుబంధంగా దేవాలయం, దాదాపు ఎకరం ఖాళీ స్థలం ఉంది. అందులో పేదలు, ఇతర వ్యక్తులు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడా స్థలంపై ఓ బడా నేత కన్ను పడింది. అందులో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చేలా చేసి.. అటు వారి ఓట్లను రాబట్టుకోవడం, ఇటు సొంత వ్యవహారాలకు వాడుకోవడం లక్ష్యంగా పావులు కదుపుతున్నట్లు తెలిసింది. దేవాలయాల భూములను ఏ ఇతర అవసరాలకు కూడా కేటాయించకూడదన్న నిబంధన ఉండటంతో... అసలు అది దేవాలయ భూమి కాదని ఆ శాఖ అధికారులే తేల్చేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.

‘తేల్చేందుకు’ రంగం సిద్ధం
సికింద్రాబాద్‌ ఆర్పీ రోడ్డులో ఉన్న మఠం పరిధిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. గతంలో దాతలు ఆ ఆలయానికి భూములను విరాళంగా ఇచ్చారు. అందులో మూడున్నర వేల గజాల స్థలం ఖాళీగా ఉండేది. అందులో కొందరు పేదలు, స్థానిక నేతల సహకారంతో కొంతమంది ఇతర వ్యక్తులు తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు స్థానికంగా ఉన్న ఓ బడా నేత తన ఓటు బ్యాంకు పెంచుకునేందుకు ఆ స్థలాన్ని బస్తీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ డబుల్‌ బెడ్రూం పథకం కింద ఇళ్లను నిర్మించి, పెద్ద సంఖ్యలో కుటుంబాలను అందులో చేర్చాలని చూస్తున్నారు. దీంతోపాటు కొంతమందికి పట్టాలిప్పించి ఇళ్లు నిర్మించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇక ఈ స్థలానికి సమీపంలో మరో దేవాలయానికి చెందిన వెయ్యి గజాల భూమి కూడా ఉంది. దానిని కూడా ఇదే తరహాలో మార్చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే రెవెన్యూ రికార్డుల్లో ఈ స్థలం కూడా దేవాలయ భూమిగా ఉంది. దాంతో ఆ భూమి తమది కాదంటూ దేవాదాయశాఖ పేర్కొనేలా ఓ ఉన్నతాధికారితో ‘ఒప్పందం’చేసుకున్నట్టు సమాచారం. ఆ అధికారి ఆ స్థలం దేవాలయభూమి కాదని ‘తేల్చేందుకు’ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం భూ రికార్డుల ప్రక్షాళన జరుగుతుండటంతో.. అది దేవాలయ భూమి కాదని రికార్డుల్లో నమోదయ్యేలా రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement