ఉధృతంగా ప్రాణహిత!

84,900 cusecs flood at Kaleshwaram - Sakshi

     కాళేశ్వరం వద్ద 84,900 క్యూసెక్కుల వరద 

     మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో మరింత పెరిగే అవకాశం 

     గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులకు ఊపిరి 

     ఎల్లంపల్లి, కడెం, ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ప్రవాహాలు 

సాక్షి, హైదరాబాద్‌: ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రాష్ట్రంలోనూ గడిచిన మూడు రోజులుగా స్థిరంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో ప్రవాహ ఉధృతి పెరుగుతోంది. దీంతో గోదావరిలో ప్రాణహిత కలిసే కాళేశ్వరం ప్రాంతంలో వరద శనివారం ఏకంగా 84,900 క్యూసెక్కులకు చేరింది. మహారాష్ట్రలోని గడ్చిరోలీతోపాటు ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆదివారం ప్రవాహ ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. 

గోదావరి ప్రాజెక్టులకు ఊపిరి: గోదావరి ప్రాజెక్టుల్లోకి నీటి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎస్సారెస్పీలోకి శనివారం 6,160 క్యూసెక్కుల మేర ప్రవాహాలు కొనసాగాయి. ప్రాజెక్టు వాస్తవ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలుగా కాగా, ప్రస్తుతం 11.50 టీఎంసీలకు చేరింది. ఈ సీజన్‌లో ప్రాజెక్టులోకి 5.33 టీఎంసీల కొత్త నీరు చేరింది. కడెం ప్రాజెక్టులోకి 8,742 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో అక్కడ వాస్తవ నిల్వ 7.60 టీఎంసీలకు గానూ 5.53 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లిలోకి 1,068 క్యూసెక్కుల నీరు వస్తుండగా నిల్వలు 20 టీఎంసీలకు గానూ 6.07 టీఎంసీలకు చేరాయి. కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టికి స్థిరంగా వరద కొనసాగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 32 వేల క్యూసెక్కుల ప్రవాహాలు వచ్చాయి. దీంతో ప్రాజెక్టులో నిల్వ 129 టీఎంసీలకు గానూ 43 టీఎంసీలకు చేరింది. తుంగభద్రకు 6 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా అక్కడా నిల్వలు 41 టీఎంసీలకు చేరుకున్నాయి. 

ప్రాజెక్టుల పనులకు ఆటంకం 
ప్రస్తుత వాటర్‌ ఇయర్‌ మొదలయ్యాక జూన్‌ రెండో వారంలో ప్రాణహితలో భారీ ప్రవాహాలు నమోదయ్యాయి. అప్పటి నుంచి స్థిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నా.. 15 వేల క్యూసెక్కుల నుంచి 25 వేల క్యూసెక్కుల మధ్యే వరద ఉధృతి ఉంటోంది. అయితే తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా కురుస్తున్న వర్షాలతో ప్రవాహం మరింత పెరిగింది. ఈ వరద ప్రభావం మేడిగడ్డ బ్యారేజీ పనులపై పడుతోంది. ఇక్కడ శనివారం కేవలం 1,150 క్యూసెక్కుల మట్టి పని మాత్రమే జరిగింది. మొత్తంగా 85 గేట్లు ఉండగా 25 గేట్ల పనులను పూర్తిగా నిలిపివేశారు. మేడిగడ్డ పంప్‌ హౌజ్‌ పనులు కొనసాగుతున్నా, గ్రావిటీ కెనాల్‌ పరిధిలో మట్టి పని పూర్తిగా నిలిచిపోయింది. కాంక్రీట్‌ పని కేవలం 300 క్యూబిక్‌ మీటర్ల మేర మాత్రమే జరిగింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top