‘ప్రత్యేక’ కసరత్తు షురూ 

68 new Municipalities and Special Officers in 12,751 Panchayats - Sakshi

     68 కొత్త పురపాలికలు, 12,751 పంచాయతీల్లో ప్రత్యేకాధికారులు 

     రెండ్రోజుల్లో ప్రతిపాదనలివ్వాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్‌ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: వచ్చేనెల ఒకటి నుంచి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే 68 మున్సిపాలిటీలకు మున్సిపల్‌ కమిషనర్లు, 12,751 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారుల నియామకాలపై ప్రతిపాదనలను రెండ్రోజుల్లోగా పంపించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎస్‌.కె.జోషి ఆదేశించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారుల నియామకం, హరితహారం, మత్స్యశాఖ, పాడిగేదెల పంపిణీ, వివిధ కేసుల్లో మెడికల్, పోస్టుమార్టం నివేదికల జారీలో జాప్యం, లారీల సమ్మె తదితర అంశాలపై మంగళవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

12,751 గ్రామ పంచాయతీలకు ప్రత్యేకాధికారులు, 565 గ్రామ పంచాయతీ క్లస్టర్లకు ఇన్‌చార్జీలుగా పంచాయతీ కార్యదర్శులు, 68 కొత్త మున్సిపాలిటీలకు మున్సిపల్‌ కమిషనర్లుగా తహసీల్దార్లు, ప్రత్యేకాధికారులుగా ఆర్డీవోలు, లేదా జిల్లా స్థాయి అధికారులను నియమించేందుకు ప్రతిపాదనలను పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలకు పంపించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి ప్రత్యేకాధికారులు, ఇన్‌చార్జి కమిషనర్ల నియామకానికి ప్రతిపాదనలు పంపాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ కోరారు.

కొన్ని మండలాలకు ఒకటి కంటే ఎక్కువ కొత్త పురపాలికలుంటే అందుకనుగుణంగా ప్రత్యేక ప్రతిపాదనలు ఉండాలన్నారు. కొత్త పుర పాలికలు ప్రస్తుతమున్న బ్యాంకు ఖాతాలను మూసే సి జాతీయ బ్యాంకుల్లో కొత్తగా అకౌంట్లు తెరవాలని సూచించారు. పురపాలికల్లో టీయూఎఫ్‌ఐడీసీ ద్వారా చేపట్టే పనులు డిసెంబర్‌కు పూర్తి చేయాల న్నారు. పంచాయతీలకు స్పెషల్‌ ఆఫీసర్ల నియామకంపై పంచాయతీ రాజ్‌ మంత్రి ఆదేశాలు జారీ చేశారని, త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ పేర్కొన్నారు.  

పోస్టుమార్టం, వైద్య నివేదికల్లో జాప్యం వద్దు 
వివిధ కేసుల్లో పోస్టుమార్టం, వైద్య నివేదికలు జిల్లాల వారీగా పెండింగ్‌లో లేకుండా చూడాలని సీఎస్‌ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కేసుల దర్యాప్తును నిర్దిష్ట కాల పరిమితిలోగా పూర్తిచేసేందుకు వైద్య, పోస్టు మార్టం నివేదికల జారీలో జాప్యం లేకుండా చూడా లని డీజీపీ మహేందర్‌ రెడ్డి కలెక్టర్లను కోరారు. 20 నుంచి లారీల సమ్మెకు ప్రైవేటు యజమానులు పిలుపునిచ్చినందున నిత్యావసర వస్తువుల పంపిణీకి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని జోషి ఆదేశించారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top