పురపాలనలో కొలువుల మేళా!

558 posts replacement in municipalities - Sakshi

558 పోస్టుల భర్తీ 

సాక్షి, హైదరాబాద్‌: పురపాలనలో కొలువుల మేళాకు తెర లేవనుంది. కొత్తగా ఏర్పడ్డ 84 పురపాలికల్లో గుర్తించిన 558 పోస్టులను భర్తీ చేసేందుకు మున్సిపల్‌ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ప్రతిపాదిత ఫైలును ప్రభుత్వానికి పంపింది. దీనికి వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశముందని తెలుస్తోంది. కొత్త పోస్టుల నియామకాలేగాకుండా.. విలీన పంచాయతీల్లో పనిచేస్తున్న పంచాయతీరాజ్‌ ఉద్యోగులను కూడా మున్సిపల్‌ శాఖలో సర్దుబాటు చేసుకోనుంది. కొత్త ఉద్యోగాల నియామకంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.31 కోట్ల భారం పడనుంది. 

కొత్తగా 84 మున్సిపాలిటీలు
పట్టణీకరణ నేపథ్యంలో కేసీఆర్‌ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 84 మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. తద్వారా 173 గ్రామ పంచాయతీలను వీటిలో విలీనం చేయగా.. 131 పంచాయతీలను అప్పటికే మనుగడలో ఉన్న మున్సిపాలిటీల్లో కలిపేసింది. 2013లో మధిర, పెద్ద అంబర్‌పేట్, బడంగ్‌పేట్, ఇబ్రహీంపట్నం, అందోల్‌–జోగిపేట్, కల్వకుర్తి, అచ్చంపేట, బాదేపల్లి, దుబ్బాక, మేడ్చల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, మీర్‌పేట, జిల్లెలగూడ, జల్‌పల్లి, బాన్సువాడ మున్సిపాలిటీలు ఏర్పడగా.. గతేడాది అదనంగా 68 పురపాలికలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
 
ప్రతి మున్సిపాలిటీకి 36 మంది
మున్సిపల్‌ కార్యకలాపాల నిర్వహణకు 36 మంది ఉద్యోగులు అవసరం. అయితే, ఇందులో ఏడు పోస్టులు మున్సిపల్‌ కమిషనర్, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌–3, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ గ్రేడ్‌–3 (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌), టౌన్‌ ప్లానింగ్‌ అబ్జర్వర్‌ (టీపీబీఓ), జూనియర్‌ అకౌంటెంట్, హెల్త్‌ అసిస్టెంట్, బిల్‌ కలెక్టర్‌ పోస్టులు మాత్రం విధిగా భర్తీ చేయాల్సి ఉంటుందని తేల్చింది. ఈ లెక్కన ప్రస్తుతానికి 558 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని పురపాలకశాఖ నిర్ణయించింది. బిల్‌ కలెక్టర్‌ పోస్టుల్లో 71 పోస్టులు మాత్రం పీఆర్‌ నుంచి విలీనమయ్యే ఉద్యోగులతో సర్దుబాటు చేసుకోవచ్చని భావిస్తోంది. 

పీఆర్‌ టు మున్సిపల్‌ 
4,592 మంది
కొత్తగా మున్సిపాలిటీలుగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు పురపాలకశాఖలో విలీనం కానున్నారు. ఇప్పటికే ఆప్షన్‌ ఇచ్చిన ఉద్యోగుల వివరాలను సేకరించిన మున్సిపల్‌ శాఖ.. 4,592 మందిని తమ పరిధిలోకి తీసుకునేందుకు ప్రతిపాదనలు తయారు చేసింది. ఇందులో రెగ్యులర్‌ ఉద్యోగులు సహా కాంట్రాక్టు, ఎన్‌ఎంఆర్‌ సిబ్బంది సైతం ఉన్నారు. ఇదిలావుండగా, కొత్త పోస్టులు, పీఆర్‌ ఉద్యోగుల బదలాయింపునకు సంబంధించి ఆమోదించిన ఫైలు ప్రభుత్వానికి చేరింది. దీనికి త్వరలో జరిగే కేబినెట్‌ సమావేశంలో ఆమోదముద్ర పడే అవకాశముంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top