క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తే రూ.500 పారితోషికం

500 Rupees Reward Will Be Given For Identifying Each Tuberculosis Patient - Sakshi

కుష్టు, క్షయ వ్యాధులపై ఇంటింటి సర్వే 

జిల్లాలో పర్యటిస్తున్న 948 బృందాలు

రోజూ లక్ష మంది పరిశీలన 

రోగులకు చికిత్సలు, ఉచితంగా మందులు..

సాక్షి, నారాయణఖేడ్‌: కుష్టు, క్షయ(టీబీ) వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. గత ఏడాది పలువురిలో ఈ వ్యాధుల లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఈ రెండు వ్యాధులపై ఏకకాలంలో సర్వే నిర్వహించి నిర్మూలన చర్యలను చేపట్టాలని వైద్యశాఖ భావిస్తోంది. క్షయ, కుష్టు బాధితులు పెరుగుతుండడం ప్రభుత్వాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఆ వ్యాధులకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించి నయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

క్షయ, కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించాలని కేంద్రం ఆదేశాల మేరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాచరణ ప్రారంభించింది. జిల్లా స్థాయిలో సూపర్‌వైజర్లు, పీహెచ్‌సీల స్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు వ్యాధిగ్రస్తుల గుర్తింపుపై శిక్షణ పొందారు. వారు ఈ నెల 26న ప్రారంభించిన సర్వే సెప్టెంబర్‌ 12 వరకు పల్లెలు, పట్టణాల్లో కొనసాగనుంది. కేంద్ర ప్రభుత్వం చొరవతో 2007 నుండి సర్వే కొనసాగిస్తున్నారు. తాజాగా మూడో విడత సర్వేపై వైద్యారోగ్య శాఖ సిబ్బంది దృష్టిసారించారు.

కేసులు ఎక్కువగానే.. 
ప్రస్తుత కాలంలో కుష్టుతోపాటు క్షయ వ్యాధి రోగులు సైతం పెరుగుతున్నారు. వ్యాధి గాలిలోనే విస్తరించే అవకాశం ఉన్నందున బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ వ్యాధిపై నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు సైతం పోయే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ వ్యాధి విస్తరించడంతో కుష్టు, క్షయ వ్యాధుల రోగుల సంఖ్యను పక్కాగా లెక్కించి చికిత్సలు అందించాలని వైద్యాధికారులు భావిస్తున్నారు. 

పరీక్షలు ఇలా..
వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృందాలు ఇంటింటికీ వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తాయి. ఆశా కార్యకర్తలు మహిళలను, స్వచ్ఛంద పురుష కార్యకర్తలు పురుషులను పరీక్షిస్తారు. ఒకవేళ కుష్టు వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తే పీహెచ్‌సీకి పంపిస్తారు. క్షయవ్యాధి లక్షణాలపై ఆరా తీస్తారు. సాయంత్రం సమయంలో దగ్గు, జ్వరం వస్తుంటే వారి తెమడను తీసుకొని ఒక డబ్బాలో పొందుపరిచి క్షయ నియంత్రణ విభాగానికి పరీక్షల కోసం పంపిస్తారు. సీబీనాట్‌ పరికరంతో వ్యాధిని నిర్దారిస్తారు. 

జిల్లాలో 948 బృందాలు.. 
జిల్లాలో 948 బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. జిల్లాలో 15లక్షల మంది జనాభా ఉంది. 14లక్షల జనాభాకు అంటే 90శాతం మందిని సర్వే చేయాలనే లక్ష్యంగా వైద్యాధికారులు ఉన్నారు. రోజూ లక్ష మందిని పరిశీలించనున్నారు. సర్వే చేసేందుకు 948 మంది ఆశ కార్యకర్తలు, 243సబ్‌సెంటర్లకు సంబంధించి 243 ఏఎన్‌ఎంలు, 35మంది సూపర్‌వైజర్లు, 35మంది వైద్యాధికారులు సర్వేలో పాల్గొంటారు. నిత్యం పట్టణ ప్రాంతాల్లో 30 నివాసాలు, గ్రామీణ ప్రాంతాల్లో 26 ఇళ్లలో సర్వే చేస్తారు. రెండేళ్ల క్రితం సర్వే నిర్వహించి 45మంది కుష్టు రోగులను గుర్తించారు. గత ఏడాది 35మందిని గుర్తించగా ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేలో ఇప్పటివరకు నలుగురు కుష్టు రోగులను గుర్తించారు. వ్యాధుల బారిన పడినవారిని గుర్తించి ప్రాథమిక దశలోనే చికిత్సలు అందజేస్తారు. క్షయబారిన పడిన రోగులకు 6 నెలలు, 12నెలల కోర్సుగా ఏడాది పొడవునా ఉచితంగా మందులను అందజేయనున్నారు. క్షయ వ్యాధిబారిన పడిన రోగులు వ్యాధి నయం అయ్యే వరకు మందులు వాడుతుంటే వారికి ప్రతీ నెలా రూ.500 చొప్పున పోషకహారం తీసుకునేందుకు పారితోషికం అందజేస్తాయనున్నట్లు జిల్లా లెప్రసీ ఉపగణాంక అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు.

కుష్టు లక్షణాలు ఇవీ.. 

  •      చర్మ పాలిపోవడం, స్పర్శజ్ఞానం లేని మచ్చలు
  •      కాళ్లు, చేతులు, నరాల వాపు, నొప్పి, తిమ్మిర్లు 
  •      ముఖంపై చెవి బయట నూనె పూసినట్లుగా ఉండడం 
  •      కనుబొమ్మల వెంట్రుకలు రాలిపోతుండడం 
  •      ముఖం, కాళ్లు, చేతులపై నొప్పి లేని బుడిపెలు 
  •      కనురెప్పలు పూర్తిగా మూతపడకపోవడం 
  •      చేతివేళ్లు స్పర్శ కోల్పోయి వంకర పోవడం 

క్షయ లక్షణాలు ఇవీ.. 

  •      రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం 
  •      ఆకలి లేకపోవడం, పెరుగుదల లేకపోవడం 
  •      మెడపై వాచి గ్రంథులు, గడ్డలు రావడం 

పరీక్షించి ఉచిత మందులు.. 
జిల్లాలో కుష్టు, క్షయ వ్యాధుల గుర్తింపు కార్యక్రమం కొనసాగుతోంది. 14రోజులపాటు ఈ సర్వే నిర్వహిస్తాం. రోగులను గుర్తించి పూర్తిస్థాయిలో చికిత్సలు అందజేస్తాం. లక్షణాలు ఉంటే పరీక్షించి ఉచితంగా మందులను అందజేస్తాం. క్షయవ్యాధి గ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే వ్యాధిని వెంటనే నయం చేసుకునే వీలుంది. ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రైవేట్‌ వైద్యులు క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రభుత్వ ఆస్పత్రికి పంపిస్తే వారికి రూ.500 పారితోషికం అందజేస్తాం. ఆర్‌ఎంపీలు, విద్యావంతులు అవగాహన కల్పించి రోగులు చికిత్సలు పొందేలా చూడాలి. 
– డి.అరుణ, డీపీపీఎం జిల్లా కోఆర్డినేటర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top