తెలంగాణ ‘పవర్‌’ ప్రభాకర్‌రావు! 

50-year-long record has been created by the Genco-Transco CMD - Sakshi

ఒకే శాఖలో వివిధ హోదాల్లో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం

రాష్ట్రాన్ని విద్యుత్‌ సంక్షోభం నుంచి గట్టెక్కించిన వైనం

ఎకనామిక్‌ టైమ్స్‌ అవార్డు సహా పలు అవార్డులు సొంతం  

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వశాఖలో పదవీ విరమణ వయసు 58 ఏళ్లు. సేవలను గుర్తించి కొంత కాలం పొడిగించినా మరో ఐదేళ్లు మించి కొనసాగే అవకాశం అరుదుగా వస్తుంది. దీంతో ఒక వ్యక్తి ప్రభుత్వశాఖలో పనిచేసే సగటుకాలం 40 ఏళ్లు. కానీ ఒకే శాఖలో ఉద్యోగం సాధించి అంచెలంచెలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఏకంగా 50 ఏళ్ల పాటు కొనసాగుతూ రికార్డు సృష్టించారు జెన్‌కో–ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు. రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభాన్ని విజయవంతంగా పరిష్కరించి, నిరంతర విద్యుత్‌ సరఫరా చేయడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రభాకర్‌రావు విద్యుత్‌ సంస్థలో చేరి ఈ నెల 10 నాటికి 50 ఏళ్లవుతోంది.  

అకౌంట్స్‌ ఆఫీసర్‌ నుంచి.. 
ఏపీ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులో (ఏపీఎస్‌ఈబీ)లో అసిస్టెంటు అకౌంట్స్‌ ఆఫీసర్‌గా 1969 ఫిబ్రవరి 10న ప్రభాకర్‌రావు విధుల్లో చేరారు. 1992లో ఏపీఎస్‌ఈబీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్, చీఫ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌గా నియామకమయ్యారు. 1998లో బోర్డు మెంబర్‌ (అకౌంట్స్‌)గా నియమితులయ్యారు. ఐఏఎస్‌ అధికారులు, ఇంజనీర్లు కాని వారిని బోర్డు మెంబర్‌గా నియమించడం అదే ప్రథమం. 1999లో ఏపీఎస్‌ఈబీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలుగా విడిపోయింది. అప్పుడు ప్రభాకర్‌రావు ఏపీ ట్రాన్స్‌కో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా నియమితులయ్యారు. ప్రభుత్వంతో విభేదాలు రావడంతో 2002లో డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. మరో ఏడేళ్ల సర్వీసు ఉండగానే ఉద్యోగాన్ని వదిలేశారు. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ప్రభాకర్‌రావును మళ్లీ జెన్‌కో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా నియమించారు. 2009లో రోశయ్య సీఎం అయ్యాక ప్రభాకర్‌రావును జెన్‌కో జేఎండీగా నియమించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎం అయ్యాక కూడా అదే పదవిలో కొనసాగారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణ జెన్‌కో సీఎండీగా నియామకమయ్యారు. తర్వాత ట్రాన్స్‌కో సీఎండీగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఈ రెండింటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

లోటును పూడ్చిన ఘనత... 
మాములుగా ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పోస్టులను ఐఏఎస్‌లకు ఇస్తారు. సంస్థ ఉద్యోగి అయితేనే సాధక బాధకాలు తెలుస్తాయనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్‌ నాన్‌ ఐఏఎస్‌ అయిన ప్రభాకర్‌రావుకు జెన్‌కో సీఎండీగా బాధ్యతలు అప్పగిస్తూ మొదటి నిర్ణయం తీసుకున్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న నాడు తెలంగాణ విద్యుత్‌ రంగం సంక్షోభంలో ఉంది. పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు, గృహ విద్యుత్‌కు గంటల తరబడి కోతలు, వ్యవసాయానికి 4 గంటల వరకు కరెంటే అందేది. ఆ కరెంటూ తక్కువ సామర్థ్యం కూడినది కావడంతో మోటార్లు కాలిపోయేవి. ట్రాన్స్‌ ఫార్మర్లు పేలిపోయేవి. రాష్ట్రం ఏర్పడే నాటికి విద్యుత్‌ కొరత 2,700 మెగావాట్లు. ఆ లోటు ఎలా పూడుతుందో తెలియని పరిస్థితి. సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని ప్రభాకర్‌రావు నూటికి నూరుపాళ్లు నిలబెట్టారు. తెలంగాణ ఏర్పడిన ఆరో నెల నుంచే (2014, నవంబర్‌ 20) కోతలు ఎత్తివేశారు. 24 గంటల విద్యుత్‌సరఫరా ప్రారంభించారు. అప్ప ట్నుంచే రైతులకు 9 గంటల విద్యుత్‌ అందింది. 2018 జనవరి 1 నుంచి దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలోని 23 లక్షల పంపుసెట్లకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నారు. ఇటు నిదానంగా నడుస్తున్న విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల పనులను ప్రభుత్వం వేగం చేసింది. కొత్త విద్యుత్‌ ప్లాంట్లు నిర్మించింది.

దక్కించుకున్న అవార్డులు
విద్యుత్‌ రంగంలో అద్వితీయమైన కృషికి పలు అవార్డులు ప్రభాకర్‌రావు అందుకున్నారు. ‘ఎకనామిక్‌ టైమ్స్‌ అవార్డు–2018’, ‘సీబీఐపీ ప్రత్యేక గుర్తింపు అవార్డు–2018’ పొందారు. తెలంగాణ విద్యుత్‌ రంగం–పంపిణీలో మార్పులు, నిర్వహణపై ‘స్కోచ్‌ గోల్డ్‌ అవార్డు–2018’, తెలంగాణ ప్రభుత్వం మేడే సందర్భంగా ప్రదానం చేసిన ‘టీఎస్‌ జెన్‌కో, టీఎస్‌ ట్రాన్స్‌కో బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డు’, విద్యుత్‌ రంగంలో విశేష కృషికి గాను ‘డాక్టర్‌ బూర్గుల రామకృష్ణారావు అవా ర్డు–2016’ను ఆయన అందుకున్నారు. విద్యుత్‌ రంగంలో ప్రతిభ కనబరచినందుకుగాను ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ పవర్‌ యుటిలిటీస్‌’ నుంచి ‘ఇండియా పవర్‌ అవార్డు–2013’, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రాక్టికల్‌ అకౌంటెన్సీ, హైదరాబాద్‌ నుంచి ‘ఎక్స్‌లెన్సీ ఇన్‌ అకౌంటెన్సీ అండ్‌ ఫైనాన్స్‌’ అవార్డులు అందుకున్నారు. 

  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top