బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి

50 Percentage reservation for BCs - Sakshi

బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు చట్ట సభలు, స్థానిక సంస్థల్లో 50 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ డిమాండ్‌ చేశారు. చట్ట సభలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో ఆదివారం ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు ఏళ్లుగా అన్యాయం జరుగుతున్నా శాంతియుత పద్ధతిలో నిరసన తెలుపుతూ హక్కుల కోసం పోరాడుతున్నామని గుర్తుచేశారు. బీసీల హక్కుల గురించి అంతర్జాతీయ వేదికలకు, యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. త్వరలో దేశంలోని 29 రాష్ట్రాల్లో పర్యటించి బలమైన బీసీ ఉద్యమాన్ని తయారు చేస్తామని వెల్లడించారు. బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నీల వెంకటేష్, జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు.  

ఏపీ ఎన్నికల్లో బీసీలంతా జగన్‌ వెంటే..  
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో బీసీలంతా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నడుస్తారని ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. జగన్‌ ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో 41 మంది బీసీలకు, ఎంపీ అభ్యర్థుల్లో ఏడుగురు బీసీలకు చోటు కల్పించడం హర్షించదగ్గ పరిణామం అని అన్నారు. జగన్‌ పాదయాత్ర సందర్భంగా బీసీలకు ఇచ్చిన హామీ మేరకు టికెట్లను కేటాయించడంతో మాట తప్పడు మడమ తిప్పడు అని మరోసారి రుజువైందని కృష్ణయ్య అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్‌కి తాము పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నామని ఉద్ఘాటించారు. ఏపీ సీఎం చంద్రబాబు దుర్మార్గుడు అని.. అతడిని ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు.
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top