సిల్వర్‌ ఫాయిల్స్‌లో గోల్డ్‌ బిస్కెట్లు

1kg above gold was seized - Sakshi

దుబాయ్‌ నుంచి బంగారం తెచ్చిన క్యారియర్‌ 

1.75 కిలోల బంగారం స్వాధీనం 

కస్టమ్స్‌ అధికారుల అదుపులో సూడాన్‌ మహిళ 

సాక్షి, హైదరాబాద్‌: విదేశాల నుంచి బంగారం అక్రమ రవాణా చేసేందుకు కొత్త కొత్త పంథాలను స్మగ్లర్లు అనుసరిస్తుంటారు. అయితే వారి ఎత్తులకు పైఎత్తులు వేసి స్మగ్లర్ల ఆటలు కట్టిస్తుంటారు మన కస్టమ్స్‌ అధికారులు. ఓ మహిళ వినూత్న పద్ధతిలో బంగారాన్ని అక్రమంగా ఇక్కడకు తరలించినప్పటికీ కస్టమ్స్‌ అధికారుల ముందు చూపుతో అడ్డంగా బుక్కైపోయింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని అక్రమ రవాణా చేసిన ఓ సూడాన్‌ మహిళను శంషాబాద్‌ విమానాశ్రయం కస్టమ్స్‌ అధీనంలోని ఎయిర్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ అధికారులు శనివారం రాత్రి పట్టుకున్నారు. ఆమె నుంచి రూ.58.21 లక్షల విలువైన 1.79 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం రవాణాకు ఫాయిల్స్, టేపుల్ని వినియోగించింది. సూడాన్‌కు చెందిన తన్వీ ముసా అనే మహిళ మూడు నెలలుగా అనేకసార్లు దుబాయ్‌–హైదరాబాద్‌ల మధ్య ప్రయాణించింది.

ఈ ప్రయాణ వివరాలను ప్రొఫైలింగ్‌ చేసిన కస్టమ్స్‌ అధికారులు తన్వీ ముసాను కీలక స్మగ్లర్లకు సహకరించే బంగారం క్యారియర్‌గా అనుమానించారు. ఇక్కడకు వచ్చిన క్యారియర్ల నుంచి రిసీవర్లు బంగారాన్ని తీసుకుని సూత్రధారులకు అప్పగిస్తుంటారు. శనివారం రాత్రి దుబాయ్‌ నుంచి వస్తున్న విమానంలో సుడాన్‌కు చెందిన మహిళ మరోసారి హైదరాబాద్‌కు వస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి బంగారం తదితరాలు తీసుకువచ్చే ప్రయాణికులు ఎయిర్‌పోర్ట్‌లోని రెడ్‌ చానల్‌ ద్వారా బయటకు వస్తారు. తమ వద్ద ఎలాంటి వస్తువులు లేవని భావించే వారు గ్రీన్‌ చానల్‌ ద్వారా బయటకు వచ్చేస్తుంటారు. స్మగ్లర్లను పట్టుకోవడానికి కస్టమ్స్‌ అధికారులు ఇక్కడే కాపుకాస్తుంటారు.

శనివారం రాత్రి కూడా తన్వీ ముసాను అధికారులు గ్రీన్‌ చానల్‌ వద్దే అదుపులోకి తీసుకున్నారు. ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌ను తనిఖీ చేయగా మూడు పాలిథీన్‌ కవర్లలో ఉన్న బంగారం బిస్కెట్లు బయటపడ్డాయి. స్కానింగ్‌లో చిక్కకుండా ఉండటానికి స్మగ్లర్లు వాటికి సిల్వర్‌ ఫాయిల్స్‌ చుట్టి దానికి నల్లరంగు టేపు వేసి పంపారు. దీన్ని గుర్తించిన కస్టమ్స్‌ అధికారులు బంగారం స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్టు చేశారు. ఈ వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top