గౌరవ డాక్టరేట్‌ లేనట్టే!

17th Convocation Day Celebrations in Osmania University - Sakshi

17న ఓయూ స్నాతకోత్సవం స్వరాష్ట్రంలో తొలి వేడుక  

గౌరవ డాక్టరేట్‌కు ఎవరినీ ఎంపిక చేయని వైనం 14 ఏళ్లుగా ఇదే దుస్థితి  

గ్రాడ్యుయేషన్‌ డేకు సీఎం హాజరుకాకపోతుండడంపై అసంతృప్తి  

చారిత్రక విశ్వవిద్యాలయం.. వందేళ్ల వైభవం.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందినఉస్మానియా యూనివర్సిటీ ‘గౌరవం’ ఎవరికీ దక్కడం లేదు. 14 ఏళ్లుగా వర్సిటీ గౌరవడాక్టరేట్‌కు ఎవరినీ ఎంపిక చేయడం లేదు. ఇటీవల వందేళ్లు పూర్తి చేసుకున్న ఓయూస్నాతకోత్సవం ఈ నెల 17న జరగనుంది. స్వరాష్ట్రంలో నిర్వహించనున్న తొలి వేడుక ఇది. అయితే ఈసారి కూడా ఓయూ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం లేదని తెలుస్తోంది. తొలుతగౌరవ డాక్టరేట్‌ సీఎం కేసీఆర్‌కు ప్రదానం చేయాలని ప్రతిపాదించగా వ్యతిరేకత రావడంతో విరమించుకున్న అధికారులు.. ఆ తర్వాత మరెవరినీ ఎంపిక చేయలేదు. మరోవైపుస్నాతకోత్సవానికి సీఎం కేసీఆర్‌ హాజరుకాకపోతుండడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.  – ఉస్మానియా యూనివర్సిటీ   

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్‌ ఠాగూర్‌ ఆడిటోరియంలో ఈ నెల 17న ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవం జరగనుంది. అయితే ఈసారి కూడా ఓయూ గౌరవ డాక్టరేట్‌ ప్రదానం లేదని తెలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలందించిన గొప్ప వ్యక్తులను గుర్తించి గౌరవ డాక్టరేట్‌ అందజేస్తారు. కానీ గత 14 ఏళ్లుగా ఓయూ  గౌరవ డాక్టరేట్‌కు ఎవరినీ ఎంపిక చేయడం లేదు. ఇటీవల వందేళ్లు పూర్తయిన సందర్భంగా ఏదో ఒక రంగంలో విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాలని అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన సీఎం కేసీఆర్‌కు ఓయూ గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేయాలని అనుకున్నారు. కానీ కొందరు వ్యతిరేకించడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. మరొకరిని ఎంపిక చేయాలనే విషయంలో ఓయూ అధికారులు శ్రద్ధ చూపలేదు. 

నిబంధనలు కఠినం...
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఓయూ స్నాతకోత్సవం మొక్కుబడిగా జరగనుంది. గౌరవ డాక్టరేట్‌ ఎంపికకు నియమ నింబంధనలు అతి కఠినంగా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. అవి ఈ కాలం నాటి వ్యక్తులకు ఉండాలంటే చాలా అరుదు అంటున్నారు. ఉన్న వారిలోనే మంచి వారిని ఎంపిక చేసి గౌరవ డాక్టరేట్‌ను అందజేయవచ్చు. కానీ ఓయూ అధికారులు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని విస్మరిస్తున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కవి, గాయకులు అందెశ్రీని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. మారిన పరిస్థితితులకు అనుగుణంగా నిబంధనలు సడలించుకుంటే సమాజం, ప్రజల కోసం పనిచేసే వారిని ప్రోత్సహించేలా గౌరవ డాక్టరేట్‌  అందజేయొచ్చు. ‘ఓయూ గౌరవ డాక్టరేట్‌ ఎంపికకు ఈ కాలంలోనూ ప్లేటోలు, అరిస్టాటిల్స్‌ కనిపించరు కదా.!’ అని సీనియర్‌ అధ్యాపకులు వ్యాఖ్యానించడం గమనార్హం. ఉన్న వారిలోనే ఒకరిని ఎంపిక చేసి గౌరవ డాక్టరేట్‌ను అందచేస్తే ఓయూ విశిష్టత మరింత పెరుగుతుందన్నారు. 

ముఖ్య అతిథి ఎంపికపై అసంతృప్తి..  
ఓయూ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఐఐసీటీ డైరెక్టర్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ పేరును ఖరారు చేయడంపై పలువురు అధ్యాపకులు, విద్యార్థులు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. ఐఐసీటీ డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ నిత్యం ఓయూను సందర్శిస్తారని, తమ కంటే జూనియర్‌ అని పలువురు సీనియర్‌ అధ్యాపకులు పేర్కొన్నారు. వందేళ్ల ఓయూలో జరిగే 80వ స్నాతకోత్సవానికి జాతీయ స్థాయిలో పేరున్న వ్యక్తిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కోరారు. స్నాతకోత్సవానికి కేవలం గవర్నర్‌ మాత్రమే వస్తుండడం, సీఎం కేసీఆర్‌ హాజరు కాకపోవడంపై నిరాశతో ఉన్నారు.  దేశమంతటా పర్యటించే సీఎం కేసీఆర్‌ ఓయూకు రాకపోవడంపై విద్యార్థులు, అధ్యాపకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

తగ్గిన దరఖాస్తులు..
ఓయూ స్నాతకోత్సవం నిర్వహణపై సరిగా ప్రచారం లేకపోవడంతో దరఖాస్తుల సంఖ్య తగ్గింది. మే 31తో గడువు ముగియగా... డిగ్రీ, పీజీ పట్టాకు 600, పీహెచ్‌డీకి 380 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీరితో పాటు 292 మందికి బంగారు పతకాలు అందజేయనున్నారు.  గత ఆరేళ్లలో లక్షలాది మంది విద్యార్థులు పాస్‌ కాగా సరైన సమాచారం లేక కొద్ది మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. స్నాతకోత్సవ నిర్వహణపై ఇంత వరకు ఓయూ వీసీ ప్రొ.రాంచంద్రం ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టలేదు. అయితే డిగ్రీ, పీజీకి రూ.200 అపరాధ రుసుముతో జూన్‌ 4 వరకు, పీహెచ్‌డీ అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. స్నాతకోత్సవానికి ముందు దరఖాస్తు చేసుకుంటే తక్కువ ఫీజు ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని ప్రతి కాలేజీకి చేరవేయడంలో అధికారులు విఫలమయ్యారు.  వేదికపై కేవలం పీహెచ్‌డీ అభ్యర్థులకు మాత్రమే పట్టాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.  

ఓవైపు పరీక్షలు...
ఓయూలో డిగ్రీ, పీజీ, ఇతర కోర్సుల పరీక్షలు జరుగుతున్నాయి. గతంలో జరిగిన పరీక్షల ఫలితాలను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇలాంటి తరుణంలో స్నాతకోత్సవ పనులకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ఆరేళ్లుగా స్నాతకోత్సవం జరగకపోవడంతో ప్రభుత్వం, విద్యార్థుల ఒత్తిడి మేరకు ఎట్టకేలకు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే జూలై 24తో వీసీ ప్రొ.రాంచంద్రం పదవీ కాలం ముగుస్తుంది. తాను పదవిలో ఉండగానే స్నాతకోత్సవం నిర్వహించాలని ఆయన భావించారు. సిబ్బంది కొరత, వేసవి సెలవులకు అధ్యాపకులు వెళ్లడంతో జవాబు పత్రాల మూల్యాంకనం ఆలస్యమై ఫలితాల్లో జాప్యం జరుగుతోంది. ఒక పక్క పరీక్షలు, ఫలితాలు, మరో పక్క స్నాతకోత్సవం పనులతో సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కంట్రోలర్‌ ప్రొ.శ్రీరామ్‌ వెంకటేశ్‌ పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top