తెలంగాణలో మరో 16 పాజిటివ్‌ కేసులు | 16 New Corona Positive Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో మరో 16 పాజిటివ్‌ కేసులు

Apr 12 2020 1:28 AM | Updated on Apr 12 2020 1:33 PM

16 New Corona Positive Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మరో 16 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం శనివారం వెల్లడించింది. అలాగే మరో ఇద్దరు చనిపోయారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు బులెటిన్‌ విడుదల చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 503కు చేరింది. ఇందులో శనివారం 51 మందిని డిశ్చార్జి చేయగా, మొత్తంగా ఇప్పటివరకు 96 మందిని డిశ్చార్జి చేసినట్లైంది. అలాగే మృతుల సంఖ్య 14కు చేరింది. ఇక 393 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇటు ఇంకా 1,654 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు 27 జిల్లాల్లో వైరస్‌ వ్యాపించగా, మిగిలిన జిల్లాల్లో కొత్త కేసులు ఏమైనా వచ్చాయా అన్న సమాచారం కూడా వైద్యాధికారులు వెల్లడించలేదు. కాగా సూర్యాపేట జిల్లాలోనే కొత్తగా ఒక్కరోజే 11 పాజిటివ్‌ కేసులు బయటపడ్డట్లు సమాచారం. 

హైదరాబాద్‌లోనే ఇద్దరు..  
ఇక శనివారం మృతి చెందిన వారిలో హైదరాబాద్‌లోని బహుదూర్‌పూర్‌కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి ఉన్నారు. మర్కజ్‌కు వెళ్లిన ఈయన కరోనా బారిన పడటంతోమార్చి చివరి వారంలో గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఇటు నగరంలోని షేక్‌పేట బృందావన్‌ కాలనీకి చెందిన మరో వృద్ధుడు (73) కూడా మృతి చెందాడు. ఆయన అమెరికా నుంచి మార్చి 20న నగరానికి వచ్చాడు. దగ్గు, జలుబు, జ్వరంతో గచ్చిబౌలిలోని ఓ కార్పొరేట్‌ ఆస్ప్రతిలో చేరారు. వైద్యులు ఆయన నమూనాలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి పంపగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన భార్య (54)కు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించడంతో ఆమెకు కూడా కరోనా సోకినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమెను గాంధీకి తరలించి చికిత్స చేస్తున్నట్లు సమాచారం. 

పెరిగిన కంటైన్మెంట్‌ జోన్లు.. 
శుక్రవారం వరకు 130 ఉన్న కంటైన్మెంట్‌ జోన్లు (హాట్‌స్పాట్లు) శనివారం నాటికి ఏకంగా 243కు పెంచారు. కేసుల సంఖ్య పెరగడం, ఒకట్రెండు కేసులు నమోదైన చోట్ల కూడా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో కంటైన్మెంట్‌ జోన్ల సంఖ్యను పెంచారు. ఆయా ఏరియాల్లో ప్రభుత్వం అష్టదిగ్బంధం విధించింది. ఎవరూ బయటకు పోకుండా ఏర్పాట్లు చేసింది. ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఏకంగా 123 కంటైన్మెంట్‌ జోన్లు ప్రకటించారు. కంటైన్మెంట్‌ జోన్లు దాదాపు రెండింతలు పెరగడానికి ప్రధాన కారణం.. ఒకట్రెండు కేసులు నమోదైన ప్రాంతాలను కూడా కంటైన్మెంట్లుగా ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు ఏదైనా ఒక జిల్లాలోని ఒక గ్రామంలో ఒక కేసు నమోదైతే, దాన్ని ఒక కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి అష్టదిగ్బంధం చేస్తున్నారు. వాస్తవంగా నిబంధనల ప్రకారం కేసులు నమోదైన ప్రాంతానికి రెండు, మూడు కిలోమీటర్ల వరకు కంటైన్మెంట్లు ఉండాలి. కానీ ఇప్పుడు కిలోమీటర్ల లెక్కన కాకుండా కేసున్న ప్రతి చోటును జోన్లుగా చేశారు. కొన్ని కంటైన్మెంట్‌ జోన్లలో 10 ఇళ్లున్నా వాటిని ప్రత్యేకంగా దిగ్బంధం చేస్తున్నారు. అందుకే ఒకేసారి దాదాపు రెండింతలు జోన్లు నమోదైనట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కరోనా కేసులు, డిశ్చార్జి, మృతుల వివరాలు 

                                             శనివారం నమోదైనవి                 మొత్తం 

చికిత్స పొందుతున్నవారు                  16                                     393 
డిశ్చార్జి అయినవారు                        51                                      96 
చనిపోయినవారు                            02                                       14 
––––––––––––––––––––––––––––––––––     
మొత్తం    –    503 
––––––––––––––––––––––––––––––––––  

Advertisement
 
Advertisement
Advertisement