తరలిపోయిన వజ్ర బస్సులు

In 11 Vajra Buses 9 Moved To Another Depot In Nizmabad  - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : ఆర్టీసీ ‘వజ్ర’ం మెరవలేదు.. ఏసీ బస్సులు ప్రయాణికుల ఆదరణ పొందలేదు. రోడ్డు రవాణా సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్యాసెంజర్లు ఎక్కక పోవడంతో ఆదాయం కరువైంది. ఫలితంగా వీటి నిర్వహణ డిపోలకు గుదిబండగా మారింది. ఈ బస్సులు నడపడం వల్ల నష్టాలే మిగులుతుండడంతో ఆర్టీసీ పునరాలోచనలో పడింది. ప్రయాణికుల ఆదరణ లేని ప్రాంతాల నుంచి ఈ ఏసీ బస్సులను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్‌ డిపోకు కేటాయించిన 11 బస్సుల్లో ఇప్పటికే తొమ్మిది బస్సులు తరలి పోయాయి. 

గంటకో బస్సు.. 
ఆర్టీసీ 60 వజ్ర బస్సులను కొనుగోలు చేసి, వీటిని ముఖ్యమైన డిపోలకు కేటాయించింది. నిజామాబాద్‌ డిపో–1కు 9, డిపో–2కు రెండు బస్సులు కేటాయించారు. ప్రయాణికులు నగరంలోని బస్టాండ్‌కు రాకుండా నిర్దేశిత బస్టాప్‌ల నుంచి హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లేలా వీటిని ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని ముబారక్‌నగర్, అర్సపల్లి, వర్ని చౌరస్తా నుంచి హైదరాబాద్‌లోని మెహిదీపట్నం, కూకట్‌పల్లి ప్రాంతాలకు గంటకో బస్సు నడిపించాలని నిర్ణయించారు. 2017 మే నుంచి ఈ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఫుల్‌ ఏసీతో పాటు నాన్‌స్టాప్‌ బస్సులు కావడం, అతి వేగంగా వెళ్లే సౌకర్యం ఉండడంతో ప్రయాణికుల ఆదరణ బాగుంటుందని ఆర్టీసీ అంచనా వేసింది.  

ఆదాయం రాకనే.. 
వజ్ర బస్సులు ప్రయాణికులతో నిండుగా వెళ్తాయని భావించిన రోడ్డు రవాణ సంస్థ అంచనాలు తారుమారయ్యాయి. ఈ బస్సులకు ప్రయాణికుల ఆదరణ కరువైంది. ఒక్కోసారి ఒకరిద్దరు ప్రయాణికులతోనే హైదరాబాద్‌ వెళ్లాల్సి వచ్చింది. దీంతో లాభం సంగతి దేవుడెరుగు.. కనీసం డీజిల్‌ ఖర్చులు కూడా రాలేదు. ప్రతి ట్రిప్పుకూ నష్టాలే మిగిలాయి. ఇలా మొత్తంగా రూ.80 లక్షలకు పైగా ఆర్టీసీ నష్టపోయింది. ఈ నేపథ్యంలో వజ్ర బస్సుల విషయంలో అధికారులు పునరాలోచనలో పడ్డారు. 

వేరే డిపోలకు తరలింపు.. 
నిజామాబాద్‌ మినహా మిగతా రూట్లలో వజ్ర బస్సులకు మంచి ఆదరణ లభిస్తోంది. నిర్వహణ నష్టాలు లేకపోవడంతో ఆ రూట్లలో మరిన్ని బస్సులు ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆర్నెళ్ల క్రితం నిజామాబాద్‌ డిపో–1 నుంచి మూడు వజ్ర బస్సులు తరలించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మరో మూడు బస్సులను హైదరాబాద్‌కు, మరో మూడింటిని కామారెడ్డి డిపోకు తరలించుకు పోయారు. మొత్తంగా 11 బస్సులకు గాను ప్రస్తుతం రెండు బస్సులు మాత్రమే నిజామాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ఇవి కూడా నష్టాల్లో కొనసాగుతుండడంతో వీటిని కూడా తరలించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

ప్రయాణికుల ఆదరణ లేకే.. 
నిజామాబాద్‌ డిపో–1 పరిధిలో మొత్తం 11 వజ్ర బస్సులు ఉండేవి. మా డిపో పరిధిలో ఇంద్ర, గరుడ కలిపి మొత్తం 40 ఏసీ బస్సులు బస్టాండ్‌ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్నాయి. అందుకే ఈ వజ్ర బస్సులను ప్రయాణికులను ఆదరించలేదు. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, హైద్రాబాద్‌ డిపోల పరిధిలో ఈ బస్సులు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ఇక్కడ నష్టాలను చూసి ఉన్నతాధికారులు వజ్ర బస్సులను ఇతర డిపోలకు తరలించారు. 
– ఆనంద్, డిపో–1 మేనేజర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top