సకల హంగుల పట్టణాలు! 

10 Integrated Townships Around Hyderabad - Sakshi

హైదరాబాద్‌ చుట్టూ 10 ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు

కరీంనగర్‌ సమీపంలో మరొకటి 

50–100 ఎకరాల్లో అన్ని వసతులతో అభివృద్ధి 

వాక్‌ టు వర్క్‌ పద్ధతిలో నిర్మాణం  

గృహ, వాణిజ్య, కార్యాలయాల అవసరాలతో హబ్‌లు 

డెవలపర్లకు ప్రత్యేక రాయితీలు  

కొత్త చట్టంలో పొందుపరిచిన సర్కార్‌.. త్వరలో విధివిధానాలు

సాక్షి, హైదరాబాద్‌ : ఆధునిక వసతులు.. సకల హంగులతో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని చుట్టు పక్కల 10 చోట్ల వీటిని అభివృద్ధి చేసే దిశగా పురపాలక శాఖ ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు, భాగస్వామం ఈ కాలనీలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించింది. తాజాగా శాసనసభ ఆమోదించిన పురపాలక చట్టంలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ పాలసీని ప్రకటించింది. విస్తృత మౌలిక సదుపాయాల కల్పనతో సమీకృత భవన సముదాయా లను అభివృద్ధి చేయనున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్‌ చారిత్రక ఉనికిని కాపాడుకుంటూనే.. ఈ కొత్త టౌన్‌షిప్‌లకు డిజైన్‌ చేస్తోంది. భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకొని భాగ్యనగరంపై జనాభా తాకిడిని తగ్గించుకునేందుకు ఇవి దోహదపడతాయని భావిస్తోంది. 

జన, వాహన విస్పోటనం... 
ప్రస్తుతం నగర జనాభా ప్రతి చదరపు కిలోమీటరుకు 11,000 ఉండగా.. త్వరలోనే ఇది రెట్టింపయ్యే అవకాశముందని అం చనా. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న సిటీ, వాహనాల రద్దీతో కాలుష్య నగరాల జాబితాలో చేరే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళనలు చెందుతోంది. దేశంలో అత్యధికంగా కాలుష్యం వెదజల్లే నగరాల్లో ఢిల్లీ, కాన్పూర్, వార ణాసి, చెన్నై, లక్నో, బెంగుళూరు ఉండగా, తర్వాతి స్థానంలో హైదరాబాద్‌ ఉంది. వీటి సరసన భాగ్యనగరం చేరకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. కాంక్రీట్‌ జంగిల్‌గా మార
కుండా.. సిటీకి దూరంగా ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లను అభివృద్ధి పరచాలని పురపాలక శాఖ నిర్ణయించింది. 
ఈ క్రమంలోనే కాలుష్యరహిత నగరంగా చేయడమే కాకుండా, పెట్టుబడులను ఆకర్షించేందుకు విస్తృతంగా మౌలిక సదు పాయాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ముఖ్యంగా రోడ్లు, టౌన్‌షిప్‌లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ప్రపంచ శ్రేణి నగరాల సరసన నిలపాలని భావిస్తోంది.  

సకల సౌకర్యాలు.. డెవలపర్లకు ప్రోత్సాహకాలు.. 
ప్రపంచ ఉత్తమ నగరాల్లో హైదరాబాద్‌కున్న ఇమేజ్‌ను కాపాడుకుంటూ రాజధానిని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే రీజినల్‌ రింగ్‌రోడ్డును నిర్మించాలని ప్రతిపాదించింది. ప్రస్తుతానికి ఈ రోడ్డుపై ఒకింత స్తబ్ధత నెలకొన్నా.. టౌన్‌షిప్‌లపై మాత్రం ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు వెంట 10 చోట్ల ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లను వాక్‌ టు వర్క్‌ పద్ధతిలో నిర్మించేందుకు డిజైన్లను తయారు చేస్తోంది. దీంతోపాటు కరీంనగర్‌ సమీపంలో మరొకటి ఏర్పాటు చేయనున్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 100 ఎకరాలు, హెచ్‌ఎండీఏ పరిధి బయట 50 ఎకరాల్లో వీటిని నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ టౌన్‌ షిప్‌లలో రెసిడెన్షియల్, కమర్షియల్, ఆఫీస్, వినోద ఇతర్రతా అన్ని హంగులు ఉండేలా డిజైన్‌ చేయనుంది. ఈ ప్రాజెక్టులను నిర్మించడానికి ముందుకొచ్చే డెవలపర్లకు ప్రత్యేక రాయితీలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేసింది. 

ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌లు వచ్చేది ఇక్కడే..(ప్రాథమిక అంచనా) 
1). జాతీయ రహదారి 65, సదాశివపేట్‌ సమీపంలో 
2). జాతీయ రహదారి 161, ఆందోల్‌ రోడ్డులో 
3). రాష్ట్ర రహదారి 765(డి), మెదక్‌ రోడ్డు నర్సాపూర్‌ పరిసరాల్లో 
4). జాతీయ రహదారి 44, తూప్రాన్‌ పరిసరాల్లో 
5). రాష్ట్ర రహదారి 1, కరీంనగర్‌ రోడ్డు అహ్మదీపురం పరిసరాల్లో 
6). జాతీయ రహదారి 163, యాదగిరిగుట్ట సమీపంలో 
7). జాతీయ రహదారి 65, చౌటుప్పల్‌ దగ్గరలో 
8). రాష్ట్ర రహదారి 9, నాగార్జునసాగర్‌ రోడ్డు నాగిళ్ల దగ్గర 
9). రాష్ట్ర రహదారి 765, వెల్డండ సమీపంలో 
10). జాతీయ రహదారి 44, బెంగళూరు బాలానగర్‌ పరిసరాల్లో 
11). జాతీయ రహదారి 163, బీజాపూర్‌ హైవే, చెన్గొముల్‌ సమీపంలో 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top