
మహిళల మాటేది బాబూ!
ఎక్కడైనా ధర్నాలు చేయాలంటే ముందుండేది మేం! సమావేశాలు, రాస్తారోకోల్లోనూ మాదే ముఖ్య భూమిక. పార్టీ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో..
- సీట్లివ్వాల్సిందేనంటూ తెలుగు మహిళ డిమాండ్
- చాకిరీ చేయించుకోవడం తప్ప ప్రోత్సహించరా..?
సాక్షి, సిటీబ్యూరో: ‘ ఎక్కడైనా ధర్నాలు చేయాలంటే ముందుండేది మేం! సమావేశాలు, రాస్తారోకోల్లోనూ మాదే ముఖ్య భూమిక. పార్టీ చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో.. ఆందోళన కార్యక్రమాల్లో మమ్మల్ని ముందుంచుతున్నప్పటికీ, టిక్కెట్ల విషయంలో మాత్రం ఎందుకు గుర్తుకు రావడం లేదు? ’ అంటూ తెలుగు మహిళలు టీడీపీ అధిష్టానాన్ని ప్రశ్నించారు. పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా అన్ని కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న తమపై టిక్కెట్ల కేటాయింపులో వివక్ష ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు.
బుధవారం హైదరాబాద్‌జిల్లా టీడీపీ కార్యాలయంలో సమావేశమైన తెలుగు మహిళలు గ్రేటర్ పరిధిలో కనీసం ముగ్గురు మహిళలకైనా అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీలకు తగినన్ని సీట్లు.. బీసీ ముఖ్యమంత్రి అంటూ ప్రచారం చేస్తున్నప్పటికీ, మహిళలను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నించారు. టిక్కెట్లిస్తే మగవాళ్లకు తీసిపోని విధంగా గెలిచి చూపిస్తామన్నారు.
కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ మహిళలు 13 మంది ఉండటాన్ని ప్రస్తావించారు. ఎన్టీఆర్ మాదిరిగానే చంద్రబాబు కూడా మహిళలకు తగిన గుర్తింపు నివ్వాల్సి ఉందన్నారు. జిల్లా తెలుగు మహిళ నుంచి కనీసం ముగ్గురికి టిక్కెట్టివ్వాలని డిమాండ్ చేశారు. కేటాయించే ఒకటీ అరా సీట్లు సైతం పార్టీ నాయకుల భార్యలకో, కుటుంబీకులకో కేటాయించడం మరింత దారుణమన్నారు. ఈసారైనా అలా కాకుండా నిజమైన మహిళా కార్యకర్తలకే అవకాశం కల్పించాలని కోరారు.
తెలుగుమహిళ జల్లా అధ్యక్షురాలు శేషుకుమారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తెలుగుమహిళ నేతలు సీఆర్ స్వరూపరాణి, సుమిత్రాబాయి, కాంతమ్మ, ఫరీదాబేగం, అనూరాధ తదితరులు మాట్లాడారు. అనంతరం శేషుకుమారి విలేకరుల తో మాట్లాడుతూ సమావేశ నిర్ణయాన్ని పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి, జిల్లా అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు తెలియజేస్తామన్నారు. ఈ మేరకు వారికి వినతిపత్రాలు సమర్పించనున్నట్లు చెప్పారు.