breaking news
-
సామాజిక న్యాయంతో కేబినెట్ కూర్పు: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: ‘కర్ణాటకలో చేపట్టే కులగణన అంశంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిధ్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో చర్చించేందుకే ఢిల్లీకి వచ్చా. రాష్ట్రంలో మంత్రులకు శాఖల కేటాయింపుపై పెద్దగా చర్చ జరగలేదు. డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు లేకుండా శాఖల కేటాయింపుపై ఎలా చర్చిస్తాం? తెలంగాణ చేసింది కేవలం కులగణన సర్వే మాత్రమే కాదు. సామాజిక, ఆర్ధిక, ఉద్యోగ, రాజకీయ, ఉపాధి, విద్య అంశాల సర్వే. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి వ్యక్తిగత డేటా పూర్తిగా మా వద్ద ఉంది. 97 శాతం మంది సర్వేలో పాల్గొన్నారు. సర్వే చేయడంతో ఆగిపోకుండా ఆ మేరకు సామాజిక న్యాయంతో రాష్ట్ర కేబినెట్ కూర్పు చేశాం. చరిత్రలోనే తొలిసారి సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ జనాభాలో 15 శాతం ఉన్న ఎస్సీలకు 27 శాతం పదవులిచ్చాం. 4 మంత్రి పదవులతో పాటు స్పీకర్ పదవి ఎస్సీలకిచ్చాం. ఎస్టీలకు ఒక మంత్రి పదవి, డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇచ్చాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 8 మంది రెడ్లు, 4 వెలమలకు మంత్రులుగా అవకాశమిచ్చి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేవలం మూడు మంత్రి పదవులే ఇచ్చారు..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. పార్టీ అధిష్టానంతో భేటీ నిమిత్తం మూడ్రోజుల కిందట ఢిల్లీ వచ్చిన సీఎం.. బుధవారం తన అధికారిక నివాసంలో మీడియాతో చిట్‌చాట్ చేశారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీగా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేస్తాం. ఈ మేరకు ఇతర పార్టీలను కూడా కోరతాం. కేంద్రం ఆమోదిస్తే అధికారికంగానూ అమలు చేస్తాం.కులగణన ఆధారంగా నిమ్న వర్గాలకు అభివృధ్ధి, సంక్షేమ ఫలాలు అందించే విషయమై జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కమిటీని నియమించాం. ఆ కమిటీ సిఫారసుల మేరకు ముందుకు వెళతాం. స్థానిక సంస్థల ఎన్నికలు కోర్టులో కేసులు తేలిన వెంటనే నిర్వహిస్తాం. ప్రక్షాళన ప్రచారంలో నిజం లేదు పాత మంత్రుల్లో ఎవరైనా తమకు పనిభారం ఎక్కువగా ఉందని చెబితే, వారి శాఖల మార్పుపై నిర్ణయం తీసుకుంటాం. రాష్ట్ర మంత్రివర్గంలోకి కొత్తగా చేరిన వారికి తన వద్ద ఉన్న శాఖలను పంచుతా. శాఖల ప్రక్షాళనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. నా వద్ద 12 శాఖలు ఉన్నాయి. వీటినే కొత్త మంత్రులకు పంచాలని భావిస్తున్నా. మిగతా వారివద్ద ఏయే శాఖలున్నాయి, ఎక్కువ శాఖలున్న మంత్రులు ఎవరిపైనైనా పని భారం ఉందా? అన్న దానిపై చర్చిస్తాం. ఎవరైనా పనిభారం ఉందంటే శాఖలను మారుస్తాం. హైదరాబాద్‌లో అందరితో మాట్లాడి నిర్ణయం చేస్తాం. ‘కాళేశ్వరం’పై రెండ్రోజుల్లో ప్రజల ముందుకు.. కాళేశ్వరం అక్రమార్కులపై కచ్చితంగా చర్యలుంటాయి. రెండ్రోజుల్లో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి కాళేశ్వరంపై నా అభిప్రాయాన్ని, గతంలో జరిగిన తప్పిదాలను ప్రజల ముందు ఉంచుతా. కాళేశ్వరం ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు ఆరోపణలు చేస్తే, ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ మాత్రం కాళేశ్వరంలో అంతా బాగానే ఉందని చెప్పడం ఏంటి? రాష్ట్రాభివృద్ధికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డే వంద శాతం అడ్డంకి. తెలంగాణ సమస్యలపై ఆయన కేంద్ర కేబినెట్లో ఒక్కసారైనా మాట్లాడారా? రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. నిర్మలా సీతారామన్ చెన్నైకి, ప్రల్హాద్ జోషి కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారు. అలాంటిది తెలంగాణ మెట్రోకు కిషన్‌రెడ్డి ఎందుకు అడ్డుపడుతున్నారు? కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టే కిషన్‌రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ అంశాలపై రివ్యూ జరుపుతానంటే హైదరాబాద్ సచివాలయంలో లేదంటే.. ఢిల్లీలో.. ఎక్కడైనా అధికారులతో కలిసి సమీక్షకు నేను రెడీ. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రానికి శత్రువులు కేసీఆర్ కుటుంబం రాష్ట్రానికి దుష్మన్లు (శతువులు). వారిని, బీఆర్ఎస్ నేతలను నేను ఉన్నంతవరకు కాంగ్రెస్ పారీ్టలో చేర్చుకునేది లేదు. కేసీఆర్ ఫ్యామిలీ కొరివి దెయ్యాల ఫ్యామిలీ అని గతంలోనే చెప్పా. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత అసెంబ్లీ రౌడీ సినిమాలో ‘బాషా’బ్యాచ్ లాంటివాళ్ళు. వాళ్ల కుటుంబ పంచాయితీ ఆ సినిమా మాదిరిగానే ఉంది. మీడియా దృషిŠిట్న తమ వైపు తిప్పుకునేందుకు డ్రామాలు ఆడుతున్నారు. కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని కవిత చెప్పింది. ఇప్పటివరకూ దానిపై కేసీఆర్ మాట్లాడలేదు. అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు నక్సలిజం సామాజిక సమస్య. దేశంలో సామాజిక అసమానతలున్నంత కాలం నక్సలిజం అంతం కాదు. ఎవరూ అంతం చేయలేరు. సామాజిక అసమానతలను తొలగించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో చర్యలను చేపట్టింది. ప్రధానిగా ఇందిరాగాంధీ భూ సంస్కరణలు తీసుకువచ్చారు. ‘దున్నేవాడిదే భూమి’అనే నినాదం ఆదర్శంగా తెలంగాణలో నిరుపేదలకు లక్షల ఎకరాలు పంచారు. ఇళ్లు కట్టించారు. వీటివల్ల నక్సలిజం తగ్గింది. కులగణన సర్వే అమలుతోనూ నక్సలిజం తగ్గుతుంది. -
తెలంగాణ కొత్త మంత్రుల శాఖలు ఇవే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ఉత్కంఠకు తెరపడింది. ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.👉గడ్డం వివేక్- కార్మిక, మైనింగ్ శాఖలు👉వాకిటి శ్రీహరి- పశుసంవర్థక, స్పోర్ట్ అండ్ యూత్ శాఖలు👉అడ్లూరి లక్ష్మణ్- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖకాగా, ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం పెద్ద కసరత్తే చేసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో పార్టీ అధిష్టానం పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు.శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. అనంతరం నిర్ణయం తీసుకున్నారు. -
ప్రధాని మోదీతో భేటీ..‘బీజేపీ నేతలకు ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తప్పని సరి’
సాక్షి,ఢిల్లీ: దేశంలో కోవిడ్-19 కేసులు విజృంభిస్తున్న తరుణంలో బీజేపీ అధిష్టానం అప్రమత్తమైంది. ప్రధాని మోదీతో భేటీ అయ్యే నేతలు తప్పని సరిగా కోవిడ్-19 ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తన నివాసంలో ఢిల్లీ బీజేపీ నేతలకు ఇవాళ సాయంత్రం ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఏడుగురు ఎంపీలు, ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి చెందిన దాదాపు 70 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్ననున్నారు.అయితే, దేశంలో కోవిడ్-19 నమోదువుతున్న కోవిడ్-19 కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈరోజు (బుధవారం) 7 వేల మార్కును దాటాయి. దీంతో పార్టీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం మోదీతో భేటీ కానున్న నేతలు తప్పని సరిగా ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయించుకోవాలని సూచించింది. మరోవైపు దేశంలో కోవిడ్-19 కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం డేటాను విడుదల చేసింది. ఆ డేటా ఆధారంగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 306 కొత్త కేసులు నమోదు కాగా ఆరుగురు మరణించారు. కోవిడ్ కారణంగా కేరళలో ముగ్గురు, మహారాష్ట్ర (1),కర్ణాటక (2) మరణించారు.కేరళలో అత్యధికంగా ఒకే రోజు 170 కొత్త కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 114 కొత్త ఇన్ఫెక్షన్లు, 1,223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్ణాటకలో 100 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన డేటాలో పేర్కొంది. ఢిల్లీలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదుగా.. రాజధానిలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 757కు చేరుకుంది. కేరళ మొత్తం 2,000 యాక్టివ్ కేసులు మార్కును దాటడంతో అగ్రస్థానంలో ఉంది. తరువాత గుజరాత్, పశ్చిమ బెంగాల్,ఢిల్లీ ఉన్నాయి. -
మంత్రులకు శాఖల కేటాయింపుపై రేవంత్ క్లారిటీ.. హోం మంత్రి ఎవరికి?
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖ కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయించనున్నట్టు రేవంత్ వెల్లడించారు. దీంతో, ఏయే శాఖలను రేవంత్ వదులుకుంటారనే ఆసక్తి నెలకొంది. హోంశాఖ కేటాయింపు ఉంటుందా? అనేది తెలియాల్సి ఉంది. సీఎం ప్రకటనతో పాత మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో మార్పులు లేనట్టుగా తెలుస్తోంది.ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. 'నేను ఢిల్లీకి వచ్చింది.. తెలంగాణ, కర్ణాటకలో విజయవంతమైన కుల గణన వివరాలు పంచుకోవడానికి మాత్రమే. నేను హైదరాబాద్ వెళ్లగానే కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తాను. నా దగ్గర ఉన్న శాఖలనే మంత్రులకు కేటాయిస్తాను' అని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకితెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డినే ప్రధాన అడ్డంకిగా మారారని సీఎం రేవంత్ విమర్శించారు. 'కిషన్‌రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే. నేను అధికారంలో ఉన్నంత వరకూ కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ కుటుంబానికి నో ఎంట్రీ. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులు. నేను ఉన్నంత వరకు కవితకు కాంగ్రెస్‌లోకి ప్రవేశం లేదు. కవిత చేస్తున్న దంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామా. కేటీఆర్ చెప్పినట్టే కిషన్‌రెడ్డి నడుచుకుంటున్నారు. తెలంగాణపై ఒక్కరోజు కూడా కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించలేదు. రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు. చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు భూసేకరణ నేనే క్లియర్ చేశాను. సామాజిక అంతరాలు ఉన్నంత వరకు నక్సలిజం ఉంటుంది. నక్సలిజం ఎప్పటికీ అంతం కాదు. ఇప్పుడు కొంత తగ్గినా వివిధ రూపాల్లో మళ్లీ వస్తుంది’ అని చెప్పుకొచ్చారు. 11 శాఖల్లో ఏది.. ఎవరికి?మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ క్లారిటీ ఇవ్వడంతో కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్ వద్ద కీలకమైన విద్యాశాఖ, మున్సిపల్, హోంశాఖ, క్రీడా శాఖతో పాటు 11 శాఖలు ఉన్నాయి. ఈ శాఖల్లో ఏయే శాఖలు కొత్త మంత్రులకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విద్యాశాఖ, హోంశాఖపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. -
మంత్రి పదవి లేకపోయినా.. రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై తాజాగా రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని చెప్పుకొచ్చారు.కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను. నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే కారణంగా నేనే తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చాను.ఈరోజు నేను మంత్రిగా లేకపోయినా, పార్టీని బలపరిచే ప్రయత్నాల్లో, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతాను. ప్రజల సమస్యలు వినడంలో, వారి హక్కుల కోసం పోరాడడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో నేను ఎప్పటికీ ముందుంటాను. నా రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదు. కొన్నిసార్లు, పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుంది. అదే మార్గాన్ని నేను ఎంచుకున్నాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన మంత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం కోరుకుంటున్నాను.నాకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదు. ప్రజల పట్ల నా నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల నా కలలే నాకు ప్రేరణగా నిలిచాయి. అదే…— Komatireddy Raj Gopal Reddy (@rajgopalreddy_K) June 11, 2025 -
రేవంత్ మంత్రి వర్గంలో భారీ మార్పులు!.. హైకమాండ్‌కు జాబితా
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. తాజాగా మంత్రుల శాఖల మార్పుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైకమాండ్‌కు పంపించారు. ఇక, మంగళవారం శాఖల మార్పులపై సునీల్ కనుగోలుతో కలిసి సీఎం రేవంత్ కసరత్తు చేశారు. అనంతరం, అధిష్టానానికి కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పలువురికి శాఖల మార్పుపై రేవంత్ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే, పలువురు సీనియర్ మంత్రుల శాఖల మార్పుపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభిప్రాయంపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది.ఇక, సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్ ఫోన్లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. -
కమిషన్ విచారణకు కేసీఆర్.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరవుతున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తాజాగా ట్విట్టర్ వేదికగా..‘కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ.. ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గద. ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే. మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే!. బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని జన్మలైనా సరిపోవు. తెలంగాణ కన్నీళ్లు తుడిచిన కాళేశ్వరాన్ని అర్థం చేసుకోవడానికి మీ తెలివి సరిపోదు!. ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే వాస్తవం తెలంగాణని తెచ్చింది కేసీఆర్ నాయకత్వం.. తెలంగాణను సస్యశ్యామలం చేసింది కాళేశ్వరం!’ అని వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారిని కమిషన్ ముందు నుంచో బెడితే నీకు పైశాచిక ఆనందం వస్తుంది కానీ….ఆయన ఖ్యాతి ఇసుమంత కూడా తగ్గదు ఆయన ఎప్పటికీ తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టిన ధీరుడే…మీరంతా సూర్యుడిని అరచేత్తో ఆపాలనుకునే మూర్ఖులే! బ్యాగులు మోసే మీకు భగీరథ ప్రయత్నాలు అర్థం కావడానికి ఎన్ని… pic.twitter.com/aYrdkAwGXQ— KTR (@KTRBRS) June 11, 2025 -
ఎర్రవల్లి ఫాంహౌస్.. కేసీఆర్‌ను కలిసిన కవిత
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కలిశారు. తాజాగా కవిత.. ఎర్రవల్లికి వెళ్లి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ను కవిత కలవడం విశేషం. కవిత.. తన భర్త అనిల్‌తో కలిసి ఎర్రవల్లికి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, కేసీఆర్‌తో కలిసి కవిత.. బీఆర్కే భవన్‌కు రానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. కేటీఆర్ తనయుడు హిమాన్షు సైతం ఎర్రవల్లి ఫాంహౌస్‌కు చేరుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం ఉదయం 11.30కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. విచారణ కమిషన్ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ కోసం కేసీఆర్.. ఈరోజు ఉదయం 9 గంటలకు ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బయలుదేరనున్నారు. ఇక, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.బరాజ్‌లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్‌ల ప్రాంతం ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. -
నేడు కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం ఉదయం 11.30కి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. విచారణ కమిషన్ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. బరాజ్‌లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్‌ల ప్రాంతం ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన విచారణ కమిషన్ ఎన్నో అవకతవకతలను గుర్తించింది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా కీలక ప్రశ్నలను సంధిస్తోంది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు? బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలను ఎవరు తీసుకున్నారు? వాటికి మంత్రివర్గ ఆమోదం ఉందా? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)ను ఎందుకు ఏర్పాటు చేశారు? బరాజ్‌లలో నిరంతరం నీళ్లు నిల్వ చేయాలని ఆదేశించింది ఎవరు? వంటి అంశాలపై కమిషన్ లోతుగా ప్రశ్నిస్తోంది. విచారణ చివరి దశకు చేరడంతో ఈ నెల 6న మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కమిషన్ ప్రశ్నించింది. చివరగా బుధవారం కేసీఆర్‌ను ప్రశ్నించనుంది. ఇప్పటివరకు కమిషన్ గుర్తించిన అవకతవకతలను కేసీఆర్ ముందు ఉంచుతూ ఆయన నుంచి వివరణ కోరనున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ను ప్రశ్నించడంతో సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగియనుంది. వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి కమిషన్ తన నివేదికను అందజేసే అవకాశం ఉంది. హరీశ్‌రావు సహా ఇంజనీర్లు, నిపుణులతో కేసీఆర్ మంతనాలు కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో కేసీఆర్ సోమ, మంగళవారాల్లో పార్టీ నేత హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలపై ఈ భేటీలో లోతుగా చర్చించినట్లు సమాచారం. అలాగే పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు, సాగునీటిరంగ నిపుణులకు ఫోన్ చేసి ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై సందేహాలను కేసీఆర్ నివృత్తి చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్‌కు భారీగా తరలివచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ కుట్రతోనే తమ అధినేతను విచారణ పేరిట ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అధినేతకు సంఘీభావంగా తరలిరావాలని కొందరు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
సీఎం శాఖలు సీనియర్లకు!
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, ప్రస్తుత మంత్రుల శాఖల మార్పుపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు ముగిసింది. పార్టీలో సీనియార్టీ, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరికి, ఏ శాఖ కట్టబెట్టాలన్న దానిపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తవారికి పాత మంత్రుల శాఖలు శాఖల కేటాయింపు అంశంపై చర్చించేందుకు సోమవారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాం«దీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు శాఖల కేటాయింపుపై చర్చించారు. భేటీలో సీనియర్ మంత్రుల వద్ద, సీఎం వద్ద ఉన్న శాఖలతో పాటు ప్రాధాన్యత గల శాఖలపై కీలక చర్చలు జరిగాయి. హోంశాఖ సహా మునిసిపల్, విద్య, న్యాయ, మైనింగ్ వంటి కీలక శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి వద్దే ఉన్న నేపథ్యంలో వాటిని ఇతర సీనియర్ మంత్రులకు కేటాయించాలని పార్టీ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే ఎవరి శాఖల మార్పు జరుగుతుందనేది బుధవారం ఉదయం వెల్లడయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎవరూ పార్టీ వీడకుండా చూడండి మంత్రి పదవులు ఆశించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న నేతల అంశం సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. మంత్రి పదవులు లభించని సీనియర్ నేతలు సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ప్రేంసాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులకు ఎలాంటి భరోసా కల్పించాలన్న దానిపై చర్చించారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యేలు కానీ, వారి అనుచరులు కానీ ఎవరూ పార్టీని వీడకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. అవసరమైతే నేరుగా నేతలను తమతో మాట్లాడించాలని చెప్పినట్లు సమాచారం. అయితే సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో పాటు మరో మైనార్టీ నేతకు అవకాశం ఇస్తే సమన్యాయం జరిగినట్టవుతుందని ముఖ్యమంత్రి అన్నారని, దీనిపై మున్ముందు నిర్ణయం చేద్దామని హైకమాండ్ నేతలు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సాయంత్రం పార్టీ పెద్దల నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్ ఫోన్లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. త్వరలో వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చించారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో బహిరంగ సభలకు యోచన కులగణన, ఎస్సీల వర్గీకరణ, రాజ్యాంగ పరిరక్షణ సభలను తెలంగాణలో ఏర్పాటు చేయాలని రాహుల్‌గాంధీ భావిస్తున్నారని తెలిసింది. ఈ సభలను భారీ ఎత్తున నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను దేశమంతా వివరించే యోచనలో రాహుల్ ఉన్నారని, వాటి నిర్వహణపై కూడా చర్చ జరిగిందని సమాచారం. మరోవైపు 11 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరో బహిరంగ సభ నిర్వహణ యోచనలోనూ కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సభలకు ఖర్గే, రాహుల్, ప్రియాంకగాంధీ ఎవరో ఒకరు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు, తేదీలను త్వరలోనే ఖరారు చేయనున్నారని సమాచారం. -
మరోసారి.. కేసీఆర్‌తో హరీష్ రావు భేటీ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి భేటీ అయ్యారు. సోమవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హరీశ్ రావు హాజరయ్యారు. విచారణ అనంతరం నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన ఆయన.. కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలు, విచారణ తీరుపై కేసీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. వీరి భేటీ సుమారు 3గంటల పాటు సాగింది. అయితే, ఇవాళ మరోసారి హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. -
చర్చనీయాంశంగా మారిన జానారెడ్డి లేఖ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు నిరాశే మిగిలింది. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని అందులో జిల్లా నేతలు ఇద్దరికి చోటు దక్కుతుందని కొంతకాలంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అధిష్టానం కూడా ఆ దిశగా ఆలోచన చేయడంతో జిల్లాకు పక్కా మంత్రి పదవి దక్కుతుందని అంతా భావించారు. కానీ ఆదివారం ప్రకటించిన మంత్రివర్గంలో జిల్లా నేతలకు చోటు దక్కకపోవడంతో ఆశ నిరాశగానే మిగిలిపోయింది. అయితే మంత్రివర్గంలో మరో మూడు స్థానాలు ఖాళీగా ఉన్న నేపథ్యంలో మరోసారి జరిగే మంత్రివర్గ విస్తరణలోనైనా? అవకాశం దక్కుతుందా? ముఖ్యంగా ఎప్పటినుంచో మంత్రి పదవి ఆశిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అవకాశం ఇస్తారా? అన్న దానిపై జిల్లాలో జోరుగా చర్చసాగుతోంది.రాజగోపాల్‌రెడ్డికి మంత్రి వర్గంలో దక్కని చోటుఈసారి మంత్రి వర్గ విస్తరణలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చోటు దక్కలేదు. ఎన్నికల సమయంలో మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినందునే ఆయన బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారన్న చర్చ జరిగింది. అయితే మొదటి మంత్రివర్గంలో రాజగోపాల్‌రెడ్డి సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి చోటు దక్కడంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం మొగ్గు చూపకపోవడంతో రాజగోపాల్‌రెడ్డికి అప్పట్లో చోటు దక్కలేదు. ఇక పార్లమెంట్ ఎన్నికల సమయంలో అధిష్టానం రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడి భువనగిరి ఎంపీ గెలుపు బాధ్యతను ఆయనకు అప్పగించింది. ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన అన్నీ తానై ఆ బాధ్యతను భుజాన వేసుకుని భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. దీంతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని కాంగ్రెస్ వర్గాలతో పాటు జిల్లా అంతటా జోరుగా ప్రచారం సాగింది.వాయిదా పడుతూ విస్తరణ..పార్లమెంట్ ఎన్నికల నాటినుంచి మంత్రివర్గ విస్తరణ రేపు మాపు అంటూ వాయిదా పడుతూ వచ్చింది. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ వార్తలు వెలువడినా.. రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు నమ్మకంతో ఉన్నారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి నిరాశ ఎదురైంది. దీంతో ఆయన అలకవహించినట్లు చర్చ జరగడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఆదివారం రాత్రి వరకు వారికి అందుబాటులోకి రాలేదు.బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ ఇస్తారని మొన్నటి వరకు చర్చ మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ లంబాడా కోటాలో మంత్రి పదవిని ఇవ్వాలని గతంలోనే అధిష్టానాన్ని అడిగారు. ఆ దిశగా అధిష్టానం కూడా మొగ్గు చూపినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. జిల్లాకు ఇప్పటికే ఇద్దరు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నందున, మరో రెండు మంత్రి పదవులు ఇస్తే ఇతర సమస్యలు వస్తాయన్న ఆలోచనతో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ ఇస్తారని అసెంబ్లీ సమావేశాల సమయంలో జోరుగా చర్చ సాగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇద్దరిలో ఏ ఒక్కరికి కూడా బెర్తు దక్కలేదు.చర్చనీయాంశంగా మారిన జానా లేఖరెండు నెలల కిందట మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని విస్తృత ప్రచారం జరిగింది. అదే సమయంలో రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దాంతో రాజగోపాల్‌రెడ్డి ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. కొన్నాళ్ల తరువాత ఆ చర్చ సద్దుమణిగినా ప్రస్తుతం విస్తరణలో రాజగోపాల్‌రెడ్డికి, బాలునాయక్‌కు పదవులు దక్కలేదు. -
ఢిల్లీకి రేవంత్.. మంత్రుల శాఖలు ఫిక్స్!
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. ఈ సందర్భంగా కొత్త మంత్రులకు శాఖల కేటాయింపులపై హైకమాండ్‌తో చర్చించనున్నారు.వివరాల ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 10.20 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ క్రమంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై పార్టీ హైకమాండ్‌తో చర్చలు జరపనున్నారు. అలాగే, పార్టీ కార్యవర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ బహిరంగ సభలు పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సభల తేదీలను ఫైనల్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. కొత్త మంత్రులకు ఏయే శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే.. ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమ ఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేపథ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది. కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు, చాంబర్ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం అమలుకు ప్రాధాన్యం ఇచ్చింది. సుదీర్ఘకాలం తర్వాత పూర్తిగా ఎస్సీ, బీసీలతో మంత్రివర్గ విస్తరణ పూర్తిచేసింది. సీఎం కాకుండా.. కొత్తగా చేరిన ముగ్గురితో కలిపి మొత్తం 14 మంది మంత్రులలో 57 శాతం(8 మంది) ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారు. మొత్తం 14 మందిలో ఓసీలు ఆరుగురు, ఎస్సీలు 4, బీసీలు ముగ్గురు, ఎస్టీ ఒకరు ఉన్నారు. కొత్తగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు ఎస్సీలు. అడ్లూరి లక్ష్మణ్.. మాదిగ, గడ్డం వివేక్.. మాల సామాజికవర్గానికి చెందిన వారు కాగా వాకిటి శ్రీహరి బీసీల్లో అత్యధిక జనాభా గల ముదిరాజ్ వర్గీయుడు. -
స్కూలింగ్ బీజేపీలో.. కాలేజీ చంద్రబాబు వద్ద.. ఉద్యోగం రాహుల్ వద్ద
సాక్షి, హైదరాబాద్: ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించే వారికే నాయకుడిగా గుర్తింపు వస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారంతా నిరంతరం ప్రజల్లో ఉంటేనే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. తాను స్కూలింగ్ బీజేపీలో, కాలేజీలో టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద చేసి, ఉద్యోగం రాహుల్‌గాంధీ వద్ద చేస్తున్నా అని వ్యాఖ్యానించారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితోపాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, ఒడిశా గవర్నర్ హరిబాబు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శ్రీనివాసవర్మ, తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ. ‘ఇటీవల నీతి అయోగ్ సమావేశం అనంతరం భోజన సమయంలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. నీ సహచరుడు అక్కడున్నాడు అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూపించారు. అందుకు నేను స్పందిస్తూ.. నా స్కూలింగ్ అంతా మీ వద్ద (బీజేపీ) జరిగింది. కాలేజీ స్టడీ ఆయన (చంద్రబాబు) దగ్గర, ఇప్పుడు ఉద్యోగం రాహుల్‌గాంధీ వద్ద చేస్తున్నా అని బదులిచ్చాను. నాకు చాలామంది బీజేపీ నేతలతో స్నేహముందని వివరించాను’అని వెల్లడించారు. దత్తాత్రేయ ప్రజల మనిషి హోదాలతో సంబంధం లేకుండా నిత్యం ప్రజల మధ్య ఉన్న వ్యక్తి బండారు దత్తాత్రేయ అని సీఎం రేవంత్ కొనియాడారు. ‘దత్తాత్రేయ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. ప్రజల మనిషి. అందుకే అన్నిపార్టీల నేతలు ఈ కార్యక్రమానికి వచ్చారు. గౌలిగూడ నుంచి గవర్నర్ వరకు ఎన్నో పదవుల్లో కొనసాగిన దత్తాత్రేయ నిత్యం ప్రజలు, కార్యకర్తలతోనే ఉంటారు. హైదరాబాద్‌లో మాస్ నేతలు ఇద్దరే. ఒకరు పీ.జనార్ధన్‌రెడ్డి, మరొకరు బండారు దత్తాత్రేయ. నగర ప్రజలకు ఎలాంటి కష్టాలు వచ్చినా వీరిలో ఒకరికి చెప్పుకునేవారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునేవారు వీళ్లను ఆదర్శంగా తీసుకోవాలి’అని సూచించారు. కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు: రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టి పెరిగిన తాను తెలుగు రాష్ట్రాలను రెండో ఇళ్లుగా పరిగణిస్తానని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. బండారు దత్తాత్రేయతో తనకు మూడు దశాబ్దాల అనుబంధం ఉందని తెలిపారు. దత్తాత్రేయ కేంద్ర కార్మీక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కార్మీకుల కోసం ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, దేశవ్యాప్తంగా ఈఎస్ఐ, ఈపీఎఫ్ఓ సేవలు మెరుగపర్చడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ‘దక్షిణ భారతదేశానికి చెందిన వ్యక్తి దత్తాత్రేయ. ఇక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. కానీ, ఆయనను హరియాణా గవర్నర్‌గా నియమించారు. అక్కడ జీరో డిగ్రీ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటప్పుడు ఎలా పనిచేస్తారని ఆయననే అడిగాను. ఎక్కడున్నా ప్రజలకు సేవ చేయడమే తన ధర్మమని దత్తాత్రేయ చెప్పారు’అని కోవింద్ వివరించారు. లేఖలకు బ్రాండ్ అంబాసిడర్: చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో కృషి చేసిన వ్యక్తి బండారు దత్తాత్రేయ అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొనియాడారు. నిబద్ధత, అంకితభావం, జాతీయత, సేవ, సమగ్రత కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. అలాయ్ బలాయ్ అంటేనే దత్తాత్రేయ గుర్తొస్తారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను సీఎంగా ఉన్నప్పుడు పలు అంశాలపై దత్తాత్రేయ పెద్ద సంఖ్యలో లేఖలు రాశారని, ఆయన లేఖలకు బ్రాండ్ అంబాసిడర్ అని చమత్కరించారు. దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితం లేదు: వెంకయ్యనాయుడు బండారు దత్తాత్రేయకు వ్యక్తిగత జీవితమంటూ ఏమీ లేదని, ప్రజలే ఆయన జీవితమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ప్రస్తుత నాయకులు డైపర్స్ మార్చినట్టు పదవుల కోసం పార్టీలు మారుతుండటంతో రాజకీయాలు చులకన అయ్యాయని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు సంస్కారవంతంగా ఉండాలని సూచించారు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత దూషణలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయం: దత్తాత్రేయ రాజకీయాలంటే వృత్తి, వ్యాపారం కాదని బండారు దత్తాత్రేయ అన్నారు. సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లు సమాజంతో మమేకం అవ్వాలని, ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పోరాడితే పదవులు అవే వస్తాయని తెలిపారు. ప్రజలు, కార్యకర్తలే తన కుటుంబమని, వాళ్లే తన ఆస్తి అని చెప్పారు. అలాయ్‌బలాయ్ ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యకక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
కేబినెట్‌కు దూరంగా.. ఆ మూడు జిల్లాలు
సాక్షి, హైదరాబాద్: తాజా మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చోటు లభించగా, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రాతినిధ్యం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. తొలి విడత కేబినెట్లో చోటు దక్కని నాలుగు జిల్లాల్లో ఆదిలాబాద్ నుంచి వివేక్ మంత్రిగా ప్రమాణం చేయగా, గతంలో ప్రాతినిధ్యం ఉన్న మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల నుంచే మరో ఇద్దరు మంత్రులయ్యారు.అయితే కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి కేబినెట్లో ఇప్పటికే ఇద్దరు చొప్పున ఉండగా, ఇప్పుడు ఒకొక్కరి చేరికతో ఆ రెండు జిల్లాల ప్రాతినిధ్యం మూడుకు పెరిగింది. కరీంనగర్ నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తోడుగా ఇప్పుడు అడ్లూరి లక్ష్మణ్ చేరారు. సీఎం రేవంత్‌తోపాటు జూపల్లి కృష్ణారావులు మహబూబ్‌నగర్ నుంచి మంత్రివర్గంలో ఇప్పటికే ఉండగా కొత్తగా వాకిటి శ్రీహరి చేరారు. దీంతో ఇప్పటికే ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లా (భట్టి, పొంగులేటి, తుమ్మల) సరసన కరీంనగర్, మహబూబ్‌నగర్‌లు కూడా చేరాయి. భవిష్యత్‌లో ఏమవుతుందో..? మరోమారు కేబినెట్ విస్తరణ జరిగితే మాత్రం నిజామాబాద్ జిల్లాకు స్థానం ఖాయమని..సీనియర్ నేత పి.సుదర్శన్‌రెడ్డి పేరును ఈసారే ప్రకటించాల్సి ఉన్నా సామాజిక సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాక చివరి క్షణంలో తొలగించారని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇప్పటికే స్పీకర్ పోస్టు ఉన్న రంగారెడ్డి జిల్లా ఈసారికి చీఫ్ విప్ పదవితో సరిపెట్టుకోవాల్సిందేనని, మంత్రి పదవికి అనుకూల సమీకరణలు ఈ జిల్లాలో లేవని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అనూహ్య పరిణామాలు జరిగితే తప్ప రంగారెడ్డి జిల్లాకు మంత్రిపదవి కష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ నేతల కొరత కారణంగా కేబినెట్ బెర్తు ఎలా భర్తీ చేయాలో ఆ పార్టీ అధిష్టానానికి కూడా అర్థం కావడం లేదని తెలుస్తోంది. -
ఆ శాఖలతోనే సర్దుబాటు?
సాక్షి, హైదరాబాద్: కొత్త మంత్రులకు ఏఏ శాఖలు కేటాయిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి తన వద్ద ఉన్న శాఖల నుంచే కొన్ని శాఖలను కేటాయిస్తారా? లేక ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను ప్రక్షాళన చేస్తారా చూడాలి. అయితే..ఇప్పుడిప్పుడే పాలన కుదురుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి శాఖల ప్రక్షాళన వరకు వెళ్లే అవకాశం లేదని, తన వద్ద ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు విభజించే యోచనలో సీఎం ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం రేవంత్‌రెడ్డి వద్ద సాధారణ పరిపాలన శాఖతోపాటు హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, కార్మిక, పశుసంవర్థకం, మైనింగ్ తదితర శాఖలున్నాయి.ఇందులో మున్సిపల్ శాఖను రెండుగా విభజించి ఒకటి తన వద్దనే ఉంచుకొని, మరోటి ఇచ్చే అవకాశాలున్నాయి. ఇక, విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వబోనని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ముగ్గురూ తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలే కావడంతో అక్రమఫోన్ ట్యాపింగ్, ఇతర కీలక కేసులున్న నేప థ్యంలో ప్రాధాన్యమైన హోంశాఖను వారికి అప్పగించకపోవచ్చనే చర్చ జరుగుతోంది.కార్మిక, పశుసంవర్థకం, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల సంక్షేమం, మైనింగ్ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. దీనిపై నేడో, రేపో అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. కొత్తగా మంత్రుల కోసం సచివాలయంలో ఫ్లోర్లు, చాంబర్ల కేటాయింపు అనంతరం ఒకట్రెండు రోజుల్లో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు. కర్ణాటక తరహాలో పురపాలికల విభజన కర్ణాటకలో బెంగళూరు, పరిసర పట్టణ ప్రాంతాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రిగా ఉండగా, మిగిలిన కర్ణాటక రాష్ట్రానికి మరో మంత్రి ఉన్నారు. కర్ణాటకలో ఉన్న తరహాలోనే కోర్ ఏరియాకు ఒకరు, మిగిలిన మున్సిపాలిటీ లకు మరొకరిని మంత్రులుగా నియమిస్తారని సమాచారం. అయితే, కోర్ ఏరియాను తన వద్దే ఉంచుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. మూసీ పునరి్నర్మాణం, ఫోర్త్ సిటీ ఏర్పాటు తదితర కీలకాంశాలు చేపట్టాల్సి ఉన్నందున, హెచ్ఎండీఏ తోపాటు తాను నిర్మించతలపెట్టిన ఫోర్త్‌సిటీ పరిధిని మినహాయించి రాష్ట్రంలోని ఇతర పట్టణ ప్రాంతాలను ఒక మంత్రికి అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి పురపాలక శాఖ కార్యదర్శులకు కూడా ఇదే తరహాలో పని విభజన చేయడం గమనార్హం.ఎవరికి.. ఏ శాఖ!సామాజిక, ప్రాంతాల వారీగా సమీకరణల నేపథ్యంలో కొత్త మంత్రులకు ఇచ్చే శాఖలపై చర్చ జరుగుతోంది. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వాకాటి శ్రీహరికి మత్స్య, పశుసంవర్థక శాఖతో మరో ముఖ్యమైన శాఖ ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, వివేక్‌కు కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఇవ్వొచ్చని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా కూడా సింగరేణి బెల్ట్ కావడం, గతంలోనూ ఈ శాఖను ఆయన సోదరుడు వినోద్ చూసిన నేపథ్యంలో కార్మిక శాఖ కేటాయించవచ్చనే ప్రచారం జరుగుతోంది. దీనితోపాటు మరో ముఖ్యమైన శాఖ కూడా ఇచ్చే అవకాశాలున్నాయి. -
సామాజిక న్యాయానికే పెద్దపీట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సామాజిక న్యాయానికే పెద్దపీట వేసింది. ఇప్పటికే ఉన్న కేబినెట్ కూర్పును బేరీజు వేసుకొని మరీ సామాజిక న్యాయం కల్పించామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేలా మంత్రులను ఎంపిక చేసింది. ఇద్దరు ఎస్సీ, ఒక బీసీ నాయకుడికి మాత్రమే విస్తరణలో అవకాశం కల్పించింది. విస్తరణకు ముందు రాష్ట్ర కేబినెట్లో ఉన్న 12 మంది మంత్రుల్లో (ముఖ్యమంత్రితో సహా) నలుగురు రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఏడుగురు అగ్రవర్ణాలకు చెందిన మంత్రులున్నారు.వీరితోపాటు ఇద్దరు బీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు కేబినెట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు బీసీ, ఎస్సీ నేతలకు కేబినెట్లో అవకాశం కల్పించింది. దీంతో ప్రస్తుతం కేబినెట్లోని 15 మంది సభ్యు ల్లో అగ్రవర్ణాల కంటే అధికంగా 8 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలకు స్థానం కల్పించినట్టయ్యింది. ఓసీ నేతలను ఏడుగురికి మాత్రమే పరిమితం చేసింది. కేబినెట్లో ఓసీల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను ఎక్కువ మందికి అవకాశం కల్పించడం ద్వారా సగానికిపైగా ఆయా సామాజిక వర్గాలకు చెందిన నేతలుండేలా జాగ్రత్త తీసుకుందని స్పష్టమవుతోంది.గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డిలతో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిట శ్రీహరి, సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఇందుకోసం రెడ్డి సామాజిక వర్గాల నేతల్లో మంత్రి పదవులు చేపట్టేందుకు అర్హులైన సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, వెలమ వర్గానికి చెందిన ప్రేమ్‌సాగర్‌రావు లాంటి నేతలను కూడా పట్టించుకోలేదు. ఇదే క్రమంలో సుదర్శన్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్, ప్రేమ్‌సాగర్‌రావుకు అవకాశం ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం భట్టిల విజ్ఞప్తులు, మంత్రి పదవి ఇస్తామని అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టడం గమనార్హం. కీలక పదవులూ వారికే మంత్రివర్గం సంగతి అటుంచితే.. అసెంబ్లీలో మిగిలిన పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ప్రాధాన్యం లభించింది. అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ (ఎస్సీ) ఉండగా ఎస్టీ (లంబాడా) వర్గానికి చెందిన డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించనుంది. ప్రస్తుతం విప్‌గా ఉన్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ (ఎస్సీ)కి మంత్రివర్గంలో అవకాశం కల్పించగా, మిగిలిన ఇద్దరు ఆది శ్రీనివాస్, బీర్ల అయిలయ్యలు బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారే. ఈ నేపథ్యంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్థానంలో ఖాళీ అయిన విప్‌తోపాటు చీఫ్ విప్ పదవులు మాత్రమే అగ్రవర్ణాలకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.లేదంటే అడ్లూరి లక్ష్మణ్ స్థానాన్ని మరోమారు ఎస్సీ నేతతో భర్తీ చేస్తే..ఒక్క చీఫ్ విప్ మాత్రమే రెడ్డి సామాజికవర్గానికి వస్తుంది. ఈ పదవిని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డిలలో ఒకరిని వరించే అవకాశాలున్నాయి. స్థానిక ఎన్నికల అనంతరం మరోమారు కేబినెట్ విస్తరణ ఉంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆదివారం జరిగిన విస్తరణ అనంతరం కేబినెట్లో నియమించుకునేందుకు వీలున్న మూడు స్థానాలను అప్పుడు భర్తీ చేయొచ్చు.అప్పుడు కూడా కేవలం ఒక్కటి మాత్రమే అగ్రవర్ణాలకు వస్తుందని, ఒకటి బీసీ, మరోటి ఎస్టీ లేదా మైనార్టీ సామాజికవర్గాలకు కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద తాజా విస్తరణ తరహాలోనే భవిష్యత్‌లో జరిగే విస్తరణలోనూ అగ్రవర్ణాలతో పోలిస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతలకే ప్రాధాన్యం ఇవ్వాలని, అగ్రవర్ణాలకు ఇతర పదవులు కేటాయించాలనే యోచనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉన్నట్టు అర్థమవుతోంది. -
ముగ్గురికే పట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులుగా గడ్డం వివేక్ వెంకటస్వామి (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్)లు ప్రమాణ స్వీకారం చేశారు. ఊహించినట్టుగానే ఈ దఫాలో ఈ ముగ్గురికే మంత్రులుగా అవకాశం లభించింది. ఆదివారం మధ్యాహ్నం 12:13 నిమిషాలకు రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సరిగ్గా 9 నిమిషాల్లో ముగిసింది. జాతీయ గీతాలాపన అనంతరం తొలుత వివేక్ వెంకటస్వామి, ఆ తర్వాత అడ్లూరి లక్ష్మణ్, అనంతరం వాకిటి శ్రీహరిల చేత గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ ప్రమాణం చేయించారు. దైవ సాక్షిగానే వివేక్ ఇంగ్లిష్‌లో, మిగిలిన ఇద్దరు తెలుగులో ప్రమాణం చేశారు. ఈ ముగ్గురిని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డిలు పూలబొకేలు ఇచ్చి అభినందించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మరోమారు జాతీయగీతాలాపనతో 12:22 నిమిషాలకు ప్రమాణ కార్యక్రమం ముగిసింది. నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ జి ప్రసాద్‌కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీలతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కొత్త మంత్రుల కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకార అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, సీఎం రేవంత్‌రెడ్డిలు, కేబినెట్ మంత్రులు గ్రూప్ ఫొటో దిగారు. రాజ్‌భవన్‌లో వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, గడ్డం వివేక్‌తో మంత్రులుగా ప్రమాణం చేయిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. చిత్రంలో సీఎం రేవంత్ మరో మూడు బెర్తులు ఖాళీగానే... కొత్తగా ముగ్గురు ప్రమాణం చేయడంతో రాష్ట్ర మంత్రివర్గ సభ్యుల సంఖ్య 15కు చేరింది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, మరో 11 మంది కేబినెట్లో ఉన్నారు. వీరికి తోడు మరో ముగ్గురు కొత్తగా మంత్రులు కాగా, ఇంకా మూడు బెర్తులు ఖాళీగానే ఉండిపోయాయి. ఈ మూడు బెర్తులను కూడా వీలున్నంత త్వరలోనే భర్తీ చేయాలనే యోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం రెండో దఫా కేబినెట్ విస్తరణ ఉంటుందనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సరిగ్గా సంవత్సరం ఏడు నెలల తర్వాత విస్తరణకు ముహూర్తం కుదిరింది. 2023, డిసెంబర్ 7న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగా, మళ్లీ 2025, జూన్ 8న తొలిదఫా విస్తరణ జరిగింది. అదిగో.. ఇదిగో అంటూ పలుమార్లు వాయిదా పడిన అనంతరం ఎట్టకేలకు ముగ్గురిని కేబినెట్లో తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. -
‘నేను కమిషన్ దగ్గరకు దోషిగా వెళ్లలేదు.. సాక్షిగా వెళ్లాను’
హైదరాబాద్: తానే కాళేశ్వరం కమిషన్ ముందుకు దోషిగా వెళ్లలేదని, సాక్షిగా మాత్రమే వెళ్లానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను ఆర్థిక మంత్రిగా ఉండటంతో తప్పకుండా విచారణకు హాజరుకావాలని పిలిస్తే కమిషన్ ముందుకు సాక్షిగా వెళ్లానన్నారు. బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈటల. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘నన్ను కమిషన్ పిలిచింది.. కమిషన్ కూడా సాక్షిగా రమ్మని పిలిచింది తప్ప దోషిగా పిలవలేదు. నేను తప్పకుండా వస్తాను. మా పార్టీ ,కమిషన్ మీద నమ్మకం ఉన్న పార్టీ అని చెప్పి వెళ్లాను. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అనే కోరుకునే పార్టీ మాది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎక్కడ వెతికినా ఒక్క స్కాం కూడా కనపడదు. కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ. సొంత మంత్రులే జైలుకు పోయారు.కాలేశ్వరం ప్రాజెక్టులో అనేక తప్పులు.. ఎన్నో డీవియేషన్ జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నీకు నీతి నిజాయితీ ఉంటే కమిషన్ రిపోర్ట్ ను బయట పెట్టండి, మీకు చేతకాకపోతే సిబిఐ కి అప్పగించండి దోషులకు శిక్ష పడేలా చేస్తాము. ఇప్పుడున్న కమిషన్‌ను ఆరుసార్లు పొడిగించారు... దోషులను బయట పెట్టకపోతే నీకు శిక్ష తప్పదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు మన మీద మాటల దాడి చేస్తారు. ఈ ఆరోపణలను, దాడులను తిప్పి కొట్టే సత్తా బీజేపీ కార్యకర్తలకు ఉండాలి’ అని ఈటల పేర్కొన్నారు. -
కాంగ్రెస్‌లో ‘కేబినెట్ బెర్త్’ హీట్.. ముగ్గురు అసంతృప్తి నేతల దారెటు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణ వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు.. హైకమాండ్ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారు. కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో పార్టీ సీనియర్ నేతలు బిజీ అయ్యారు.తాజాగా కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్‌కు చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు కేబినెట్లో స్థానం ఉంటుందని ఆశించారు. ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండిచేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు.ఇద్దరు నేతలు ఎక్కడ?తాజాగా సుదర్శన్ రెడ్డి ఇంటికి తెలంగాణ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేరుకున్నారు. మరో సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్‌సాగర్ రావుతో కూడా పార్టీ నేతలు భేటీ కానున్నారు. అయితే, ప్రేమ్‌సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి మాత్రం అందుబాటులో లేకపోవడంతో హస్తం పార్టీలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. ఇక, మరో కాంగ్రెస్ సీనియర్ నేత మల్రెడ్డి రంగారెడ్డి సైతం మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్టు స్పష్టం చేశారు. మరో నేత బీర్ల ఐలయ్య సైతం.. హైకమాండ్‌పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. రోజంతా ఉత్కంఠ..రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం శనివారం రోజంతా చర్చనీయాంశమైంది. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లేదా కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం లభించవచ్చని చర్చల మధ్య అడ్లూరి స్థానం దక్కింది. ఇక, రెడ్డి సామాజికవర్గానికి ఈసారి విస్తరణలో అవకాశం లేదనే చర్చ మొదటి నుంచి జరిగింది. ఒకవేళ లభిస్తే మాత్రం నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ నేత పి.సుదర్శన్ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయనే వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి అనే చర్చ ఎక్కడా జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు స్థానాలు పూర్తి అయ్యాయి. -
రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో కొత్త మంత్రులు మధ్యాహ్నం 12:19 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్(ధర్మపురి) ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్.. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అవకాశం లభించింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ప్రమాణం చేసిన ముగ్గురు మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.ఎవరికి ఏ శాఖ?కొత్త మంత్రులకు ఏ శాఖలు అప్పగిస్తారనే దానిపై చర్చ నడుస్తుంది. ఇవాళ సాయంత్రానికి మంత్రులకు శాఖలు కేటాయించే అవకాశం ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి దగ్గర హోం, మున్సిపల్, విద్య, సంక్షేమ శాఖలు ఉండగా.. ఆ శాఖలే కొత్త మంత్రులకు కేటాయించనున్నారు. 👉వివేక్ రాజకీయ ప్రస్థానంకేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గడ్డం వెంకటస్వామి తనయుడైన వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో పనిచేసి, తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. చెన్నూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఎట్టకేలకు మంత్రి పదవి సాధించారు. ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక దశలో ఆయనకు పదవి వస్తుందా, రాదా? అనే ఊహాగానాలు వచ్చాయి.అధిష్టానం తొలి విడతలోనే పదవీ ఇస్తున్నట్లుగా ఒకింత ప్రచారం జరిగినా సమీకరణల నేపథ్యంలో సాధ్యం కాలేదు. గతంలో పదవి రాకపోయినా, సామాజిక సమీకరణలు, రాజకీయ పట్టుదలతో అధిష్టానం ఆమోదం పొంది, తన పంతం నెగ్గించుకున్నారు. మరో వైపు జిల్లా నుంచే తన సోదరుడు వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ప్రయత్నాలు చేశారు. అయితే సామాజిక, రాజకీయ పలు కోణాలను లెక్కలోకి తీసుకుని అధిష్టానం వివేక్ పేరు ఖరారు చేసింది👉శ్రీహరి రాజకీయ ప్రస్థానంకర్ణాటక సరిహద్దులో ఉన్న మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీహరికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గేతో మంచి సాన్నిహిత్యం ఉంది. మొదటి నుంచీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారనే పేరు శ్రీహరికి ఉంది. సర్పంచ్‌గా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఉండగా.. నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు చేపట్టారు.ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్రను మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి ప్రశంసలు పొందారు. రాష్ట్రంలో బీసీ జనాభాలో అత్యధికంగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటికి మంత్రి పదవి.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మేలు చేస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇవన్నీ శ్రీహరికి కలిసి రాగా.. ఆయన పేరు ఖరారైనట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎలాంటి అవరోధాలు లేకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే మంత్రి అయిన ఘనత శ్రీహరికి దక్కనుంది.👉లక్ష్మణ్ రాజకీయ ప్రస్థానంధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పని చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్‌గా నియమితులయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. -
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ముగ్గురి పేర్లు ఫైనల్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు లేదా నాలుగు బెర్తులను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్త మంత్రులు ఆదివారం మధ్యాహ్నం 12:19 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రులతో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు.కొత్త మంత్రులుగా వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), గడ్డం వివేక్ (చెన్నూరు), అడ్లూరి లక్ష్మణ్ పేర్లు ఖరారయ్యాయి. ముగ్గురు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది. ఇక, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేరు ఖరారు చేయగా.. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు అవకాశం లభించింది. బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి ,వివేక్ ,అడ్లూరి లక్ష్మణ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. ముగ్గురు నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.మరోవైపు.. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ.. కొత్త మంత్రుల చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి సమాచారం అందించిన ప్రభుత్వం. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్న సాధారణ పరిపాలన శాఖ అధికారులు. ఆదివారం ఉదయమే ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, ప్రోటోకాల్ అధికారులు రాజ్‌భవన్ చేరుకున్నారు. హైకమాండ్ కసరత్తు..ఇక, మంత్రి వర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పరిగణనలోకి తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా మంత్రివర్గ విస్తరణలో సుదర్శన్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల పేర్లు మొదటి నుంచీ వినిపించినా ప్రస్తుతానికి ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్ఠానం చెప్పినట్లు తెలిసింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి అవకాశం ఇస్తే ఆయన సోదరుడు, మంత్రి వెంకట్‌రెడ్డిని కూడా కొనసాగించడం కష్టమని, ఇద్దరిలో ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్ఠానం స్పష్టంచేయడంతో ఈ అంశాన్ని ప్రస్తుతానికి పక్కనపెట్టినట్లు తెలిసింది.చర్చల అనంతరం..గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌లతో కాంగ్రెస్ అధిష్ఠానం చర్చించింది. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత ఎవరెవరికి చోటు కల్పించాలో నిర్ణయం చెబుతామన్న అధిష్ఠానం శనివారం తన అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. అనంతరం పార్టీకి సంబంధించిన పలువురు నాయకులతో ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. నాలుగో పేరును ప్రస్తుతానికి పక్కనపెట్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురికి అవకాశం కల్పిస్తే మరో మూడు స్థానాలు ఖాళీగా ఉంటాయి. వీటితోపాటు చీఫ్ విప్ పదవి భర్తీకి కూడా కసరత్తు సాగుతోంది. బీసీల నుంచి ఆది శ్రీనివాస్ ప్రస్తుతం శాసనసభలో విప్‌గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేనందున వికారాబాద్ ఎమ్మెల్యే, సభాపతి ప్రసాద్‌కుమార్‌ను మంత్రివర్గంలోకి తీసుకుని అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. -
మాగంటి మృతి పట్ల రేవంత్, కేసీఆర్ సంతాపం..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యం కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సీఎం రేవంత్ సంతాపం..జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటించారు. మాగంటి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కేసీఆర్ సంతాపం.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాగంటి మరణం పార్టీకి తీరనిలోటు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడుగా ప్రజానేతగా పేరు సంపాదించారని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయనేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారని మాగంటి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. తనను కాపాడుకునేందుకు వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు మిత్రులు అభిమానులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.కేటీఆర్ దిగ్బ్రాంతి..మాగంటి గోపీనాథ్ అకాల మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి గోపినాథ్ చేసిన కృషిని గుర్తు చేసుకున్న కేటీఆర్. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మాగంటి మృతి పార్టీకి తీరని లోటు అని చెప్పుకొచ్చారు. హరీశ్ రావు సంతాపం..మాగంటి గోపినాథ్ అకాల మరణం అత్యంత బాధాకరం. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. వారి మృతి బీఆర్ఎస్కు తీరని లోటు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన వారి జీవితం ఆదర్శం. గోపినాథ్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.బండి సంజయ్ సంతాపం..మాగంటి గోపీనాథ్ మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతాపం. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలందిస్తున్న నాయకుడి మరణం ప్రజలకు తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థిసున్నా. మాగంటి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(62) మృతిచెందారు. అనారోగ్యం కారణంగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ ఆదివారం ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గురువారం సాయంత్రం (ఈ నెల 5న) తీవ్రమైన ఛాతీనొప్పితో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ అరెస్టు కావడం.. సీపీఆర్‌తో తిరిగి గుండె కొట్టుకోవడంతోపాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా.. అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూశారు.మూడుసార్లు ఎమ్మెల్యేగా.. మాగంటి గోపీనాథ్ 1963 జూన్ 2న జన్మించారు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు. గోపినాథ్‌కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన 2014, 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యవత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలోకి దిగారు. తన సమీప మజ్లిస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై 9 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో తొలిసారే విజయాన్ని రుచిచూశారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్ నుంచే పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌పై గెలిచి హ్యాట్రిక్ సాధించారు. నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ తెలంగాణే శ్వాసగా పనిచేసే బీఆర్ఎస్ జెండాను రెపరెపలాడించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా ఎదిగారు. -
తప్పుడు ప్రచారం మానుకోవాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై వాస్తవాలు వివరించినా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అబద్ధాల ప్రవాహాన్ని ఆపడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై స్పందిస్తూ మంత్రి ఉత్తమ్ చేసిన విమర్శలను హరీశ్‌రావు ఖండించారు. ‘ఐదేళ్లలో మేడిగడ్డలో ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలు మాత్రమేనని చెబుతున్న ఉత్తమ్.. కాళేశ్వరంలో భాగమైన ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరుకు లిఫ్ట్ చేసిన నీటి వివరాలు చెప్పడం లేదని ఆక్షేపించారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతి, నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల నుంచి ఎత్తిపోసిన నీళ్ల వివరాలు దాచిపెడుతున్నారని విమర్శించారు.కాళేశ్వరం కట్టిన మూడేళ్లలోనే మేడిగడ్డ నుంచి 162.41 టీఎంసీలు, అన్నారం నుంచి 172.86 టీఎంసీలు, సుందిళ్ల నుంచి 172.12 టీఎంసీలు, నంది మేడారం పంప్‌హౌస్ నుంచి 181.70 టీఎంసీలు, గాయత్రి పంప్‌హౌస్ నుంచి 179.41 టీఎంసీల గోదావరి జలాలను కాళేశ్వరం ప్రాజెక్టులోకి ఎత్తిపోశామన్నారు. మంత్రికి తెలియకుంటే ఇంజనీర్లను అడిగి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఏ ప్రాజెక్టు నిర్మించినా తొలి దశలోనే పూర్తి ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యపడదనే విషయంతోపాటు కాల్వలు తవ్వుతున్నకొద్దీ నీరు అందే ఆయకట్టు పెరుగుతుందనే విషయాన్ని మంత్రి తెలుసుకోవాలన్నారు.ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్, కల్వకుర్తి దేవాదుల సహా ఏ ప్రాజెక్టులో అయినా మొదట హెడ్ వర్క్స్ పూర్తి చేసి టెయిల్ వర్క్స్ తర్వాత పూర్తి చేస్తుంటారని.. కానీ కాంగ్రెస్ మాత్రం కమీషన్ల కోసం తోక పనులు ముందు మొదలుపెట్టి, హెడ్ వర్క్స్ వదిలి పెట్టిందని హరీశ్‌రావు విమర్శించారు. తలాతోక లేని మాటలు మానుకొని అబద్ధాల ప్రచారం మానాలని హితవు పలికారు.