
ఈటల రాజేందర్(ఫైల్‌ఫోటో)
హైదరాబాద్: తానే కాళేశ్వరం కమిషన్ ముందుకు దోషిగా వెళ్లలేదని, సాక్షిగా మాత్రమే వెళ్లానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఆ సమయంలో తాను ఆర్థిక మంత్రిగా ఉండటంతో తప్పకుండా విచారణకు హాజరుకావాలని పిలిస్తే కమిషన్ ముందుకు సాక్షిగా వెళ్లానన్నారు. బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా వర్క్ షాప్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈటల. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
‘నన్ను కమిషన్ పిలిచింది.. కమిషన్ కూడా సాక్షిగా రమ్మని పిలిచింది తప్ప దోషిగా పిలవలేదు. నేను తప్పకుండా వస్తాను. మా పార్టీ ,కమిషన్ మీద నమ్మకం ఉన్న పార్టీ అని చెప్పి వెళ్లాను. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అనే కోరుకునే పార్టీ మాది. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎక్కడ వెతికినా ఒక్క స్కాం కూడా కనపడదు. కాంగ్రెస్ అంటేనే దొంగల పార్టీ. సొంత మంత్రులే జైలుకు పోయారు.
కాలేశ్వరం ప్రాజెక్టులో అనేక తప్పులు.. ఎన్నో డీవియేషన్ జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. నీకు నీతి నిజాయితీ ఉంటే కమిషన్ రిపోర్ట్ ను బయట పెట్టండి, మీకు చేతకాకపోతే సిబిఐ కి అప్పగించండి దోషులకు శిక్ష పడేలా చేస్తాము. ఇప్పుడున్న కమిషన్‌ను ఆరుసార్లు పొడిగించారు... దోషులను బయట పెట్టకపోతే నీకు శిక్ష తప్పదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లు మన మీద మాటల దాడి చేస్తారు. ఈ ఆరోపణలను, దాడులను తిప్పి కొట్టే సత్తా బీజేపీ కార్యకర్తలకు ఉండాలి’ అని ఈటల పేర్కొన్నారు.