కాంగ్రెస్‌లో ‘కేబినెట్‌ బెర్త్‌’ హీట్‌.. ముగ్గురు అసంతృప్తి నేతల దారెటు? | Cabinet Expansion Effect Political Twist In Telangana Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ‘కేబినెట్‌ బెర్త్‌’ హీట్‌.. ముగ్గురు అసంతృప్తి నేతల దారెటు?

Jun 8 2025 12:26 PM | Updated on Jun 8 2025 1:20 PM

Cabinet Expansion Effect Political Twist In Telangana Congress

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్‌ విస్తరణ వేళ అధికార కాంగ్రెస్‌ పార్టీలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి పదవి ఆశించి భంగపడిన నేతలు.. హైకమాండ్‌ నిర్ణయంపై ఆగ్రహంతో ఉన్నారు. కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే ప్రయత్నాల్లో పార్టీ సీనియర్‌ నేతలు బిజీ అయ్యారు.

తాజాగా కాంగ్రెస్‌ పార్టీలో బుజ్జగింపుల పర్వం మొదలైంది. ముఖ్యంగా నిజామాబాద్‌కు చెందిన సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు తమకు కేబినెట్‌లో స్థానం ఉంటుందని ఆశించారు. ఇదే విషయాన్ని తరచూ అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండిచేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకులను బుజ్జగించేందుకు సీనియర్‌ నేతలు రంగంలోకి దిగారు.

ఇద్దరు నేతలు ఎక్కడ?
తాజాగా సుదర్శన్‌ రెడ్డి ఇంటికి తెలంగాణ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ చేరుకున్నారు. మరో సీనియర్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌ రావుతో కూడా పార్టీ నేతలు భేటీ కానున్నారు. అయితే, ప్రేమ్‌సాగర్‌ రావు, రాజగోపాల్‌ రెడ్డి మాత్రం అందుబాటులో లేకపోవడంతో హస్తం పార్టీలో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. ఈ క్రమంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ నడుస్తోంది. 

ఇక, మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి సైతం మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి లేఖ రాస్తానని చెప్పుకొచ్చారు. ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నట్టు స్పష్టం చేశారు. మరో నేత బీర్ల ఐలయ్య సైతం.. హైకమాండ్‌పై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారు. 

రోజంతా ఉత్కంఠ..
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అంశం శనివారం రోజంతా చర్చనీయాంశమైంది. మాదిగ సామాజికవర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ లేదా కవ్వంపల్లి సత్యనారాయణకు అవకాశం లభించవచ్చని చర్చల మధ్య అడ్లూరి స్థానం దక్కింది. ఇక, రెడ్డి సామాజికవర్గానికి ఈసారి విస్తరణలో అవకాశం లేదనే చర్చ మొదటి నుంచి జరిగింది. ఒకవేళ లభిస్తే మాత్రం నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత పి.సుదర్శన్‌ రెడ్డికే ఎక్కువ అవకాశాలున్నాయనే వార్తలు చక్కర్లు కొట్టాయి. మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మంత్రి పదవి అనే చర్చ ఎక్కడా జరగలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులకు గాను మూడు స్థానాలు పూర్తి అయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement