రేవంత్‌ మంత్రి వర్గంలో భారీ మార్పులు!.. హైకమాండ్‌కు జాబితా | Telangana Govt Ministry Changes And High Command Decision | Sakshi
Sakshi News home page

రేవంత్‌ మంత్రి వర్గంలో భారీ మార్పులు!.. హైకమాండ్‌కు జాబితా

Jun 11 2025 10:35 AM | Updated on Jun 11 2025 10:49 AM

Telangana Govt Ministry Changes And High Command Decision

సాక్షి, ఢిల్లీ: తెలంగాణ మంత్రివర్గంలో భారీ మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రుల శాఖల మార్పులపై కసరత్తు కొనసాగుతోంది. తాజాగా మంత్రుల శాఖల మార్పుల జాబితాను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. హైకమాండ్‌కు పంపించారు. ఇక, మంగళవారం శాఖల మార్పులపై సునీల్ కనుగోలుతో కలిసి సీఎం రేవంత్‌ కసరత్తు చేశారు. అనంతరం, అధిష్టానానికి కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, పలువురికి శాఖల మార్పుపై రేవంత్‌ నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు.. ముఖ్యమంత్రి రేవంత్‌ ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మూడు రోజులుగా ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్‌ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే, పలువురు సీనియర్ మంత్రుల శాఖల మార్పుపై తర్జనభర్జనలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అభిప్రాయంపై హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టింది.

ఇక, సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉన్న పలు కీలక శాఖలు ఇతర సీనియర్‌ మంత్రులకు కేటాయించాలని హైకమాండ్‌ సూచించినట్లు తెలిసింది. ఇందుకు ముఖ్యమంత్రి కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా శాఖల కేటాయింపు, శాఖల మార్పు ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కొత్తగా మంత్రివర్గంలో చేరిన ముగ్గురు మంత్రులు కొత్తవారే అయినందున వారికి ఇతర మంత్రుల వద్ద ఉన్న శాఖలను కేటాయించి, సీనియర్‌ మంత్రులకు న్యాయ, హోంశాఖ, విద్యా శాఖలను ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కొందరు మంత్రుల పనితీరు పరిగణనలోకి తీసుకుని శాఖల మార్పు చేయాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. 

మరోవైపు మంగళవారం రోజంతా డిప్యూటీ సీఎం భట్టితో హైకమాండ్‌ ఫోన్‌లో మంతనాలు జరిపింది. అయితే ఉత్తమ్‌ ఢిల్లీ వెళ్లిన కొద్దిసేపటికే భట్టికి కూడా అక్కడినుంచి పిలుపు వచ్చిందని, ఆయన కూడా విమానం ఎక్కుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, భట్టి మంగళవారం రాత్రి వరకు ఢిల్లీ వెళ్లలేదు. హైదరాబాద్‌లోనే ఉన్న ఆయన సమీక్షల్లో పాల్గొంటూనే పార్టీ పెద్దలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 

త్వరలో వర్కింగ్‌ ప్రెసిడెంట్ల నియామకం 
పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ల నియామకంతో పాటు 10–15 కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం కూడా త్వరలోనే జరుగుతుందని, దీనిపై కూడా పార్టీ పెద్దలతో రేవంత్‌ చర్చించారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement