ఎస్సైపై కత్తితో దాడి.. దొంగ ఆత్మహత్యాయత్నం | thief attacked on s.i. | Sakshi
Sakshi News home page

ఎస్సైపై కత్తితో దాడి.. దొంగ ఆత్మహత్యాయత్నం

Dec 18 2017 6:43 PM | Updated on Dec 18 2017 6:43 PM

టి.నగర్‌: తనను అరెస్టు చేసేందుకు సిబ్బందితో వచ్చిన ఎస్పైను ఓ వ్యక్తి కత్తితో పొడిచాడు.. ఆపై తాను ఆత్మహత్యకు యత్నించాడు. ఈ హఠాత్పరిణామం చెన్నై అమింజికరై అన్నానగర్‌ ప్రాంతంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఒంటరిగా వెళుతున్న మహిళలు, వాహన చోదకుల నుంచి సెల్‌ఫోన్‌లు చోరీ చేస్తున్న ఘటనలు జరుగుతున్నట్లు అమింజికరై పోలీసులకు సమాచారం అందింది. అమింజికరై మార్కెట్‌ ప్రాంతంలో సెల్‌ఫోన్‌ల దొంగ దాగి ఉన్నట్లు ఆదివారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై శ్రీనివాసన్‌ తన సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒక దుకాణం వద్ద దాగి ఉన్న నిందితుడిని పోలీసులు చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఎస్‌ఐ శ్రీనివాసన్‌పై అతడు కత్తితో దాడి జరిపాడు. దీంతో ఆయన తీవ్ర గాయాలతో కింద పడిపోయాడు. పోలీసులు ఎస్సైను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం దొంగను పోలీసులు చుట్టుముట్టగా వారిపైనా కత్తితో దాడికి యత్నించాడు. అతికష్టంమీద పోలీసులు అతనిని పట్టుకోగా గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే అతడినికూడా ఆస్పత్రికి తరలించారు. విచారణలో పట్టుబడిన వ్యక్తి మణికంఠన్‌ (25) అని, సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడేవాడని తెలిసింది. అతని వద్ద ఉన్న బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ శ్రీనివాసన్‌ను మెరుగైన వైద్యం కోసం అమింజికరైలో గల ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement